తెలుగువారి జానపద కళారూపాలు/ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు

వికీసోర్స్ నుండి

ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు

ఆంధ్రదేశంలో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళారూపం పిచ్చుకుంటుల కథ. ఈ కథ, పిచ్చుకుంటులవాళ్లనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ గోత్రాలను చెపుతారు.

వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్యమైనదీ, చారిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ శ్రీనాథ మహాకవి రచించిన "పల్నాటి వీరచరిత్ర". ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పదిహేను రాత్రులు చెపుతారు.

పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.

పండితారాధ్య చరిత్రలో:

వీవంగ చేతులు లేవయ్య - నడచి
పోవంగ కాళ్ళును లేవయ్య - అంధ
కులమయ్య పిచ్చుకుంటుల మయ్య
దాన మొసగరే ధర్మాత్ములార.

అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు అంగవైకల్యం కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, 'దాన మొసగరే ధర్మాత్ములార ' ఆనడాన్ని బట్టి వారు యాచకులని అర్థమౌతూ వుంది. ఆనాడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుండి.

వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చిగుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు. పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగవైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆనాడు సోమనాథుని శ్రీశైల యాత్రలో ఆపై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.

మూర్తీ భవించిన శైవం:

పిచ్చుకుంటుల వారందరూ మూర్తీ భవించిన వీర శైవ మతాన్ని ఆరాధించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా వీరు శక్తి ఉపాసనాపరులు. రేణుకా మహాత్మ్యాన్ని, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మూహూరమ్మ కథలను ప్రచారం చేయడమేకాక వారు నమ్మిన దేవతల్ల కొలువులు కొలుస్తారు. వీరికి మూలదైవం శ్రీశైల మల్లిఖార్జునుడే.

పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది:

అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చుకుంటుల వారిని గురించి అసలు మీ పుట్టు పూర్వోత్తరా లేమిటో అని ప్రశ్నిస్తే , వారీ విధంగా ఒక గాథను వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్బంలో వారి వారి గోత్రాలు వల్లించటానికి మూడు మట్టి బొమ్మల్ని చేసి వాటికి ప్రాణం పోశారనీ, అలా బొమ్మల నిర్మాణంలో ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటం వల్ల అతని సంతాన మంతా భిక్షమెత్తే కుంటి వాళ్ళయ్యారనీ, చెపుతూ, మరో కథను కూడ చెపుతారు. ఏడుగురు యాదవ కాంతలు సంతానం కోసం భక్తి శ్రద్ధల్తో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక కుంటి బాలును పెంచమని వరమిచ్చాడనీ, ఆ తరువాత వారంత గర్భధారులై ఏడుగురు ఆడ పిల్లల్ని కన్నారనీ, ఆ ఏడుగురు పిల్లల్నీ పెద్ద చేసి ఒక కుంటి వాడి కిచ్చి శివుడు పెళ్ళి చేయమన్నాడనీ, ఆ ప్రకారం వారు చేసారనీ, ఆ తరువాత శివుడు అతనికి ఒక శంఖాన్నీ, గంటనూ, ఒక శూలాన్నీ, ఒక ఎద్దునూ ఇచ్చి భిక్షాటన చేసి జీవించ మన్నాడనీ, అతని సంతానమే భిక్షక కుంటులనీ, పిచ్చు కుంటుల వారు చెపుతారు.

చంద్ర శేఖరుని వర్ణన:

పిచ్చుకుంటుల వారిని గురించి చంద్ర శేఖరుడు తన శతకంలో ఈ విధంగా వర్ణించాడు. పద్యం:

గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
కడు సెప్పినన్ని గోతరలు, గట్టిన జెప్పినామే సమంగుగా
పడిగొని సంపసాచి దలపట్టుకసిందు పదాలు పాడు
గుడగుడ వట్టి లొట్టయని కూయును ముర్ఖుడా.. ॥చంద్ర శేఖరా॥

అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాలక్రమాన కమ్మవారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహితులు జంగాలు.

పిచ్చికుంటులవారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నెండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర దేశంలో వున్నారనీ, ఈనాడు తెలంగాణాలో రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా॥ బి. రామరాజుగారు వారి జానపద సాహిత్య గ్రంథంలో ఉదహరించారు.

వారు చెప్పే కథలు:

తెలంగాణా లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివరెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, సూర్యచంద్ర రాజులు, హరిశ్చంద్రుడు మొదలైన కథలను చెపుతున్నారు.

ఇల రాయలసీమలో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో పలనాటి వీరగాథల్నీ, కాటమరాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు. మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడ పిచ్చుకుంటుల వారున్నారు. వారంతా కూడా శ్రీశైల మల్లిఖార్జున భక్తులే. వీరిలో దావన కుంట్లు, ఎద్దుకుంట్లు, గంట కుంట్లు మొదలైన తెగల వారున్నారు. పిచ్చు కుంటుల వారి వేష ధారణ కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలూ, కాళ్ళకు గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దరూ దీర్తం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఇక మూడవ వ్వక్తి ఒక తోలుతిత్తిని చంకకు తగిలించుకొని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు. ఈ శృతి చెవులకు ఎంతో ఇంపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు.

కథలో వచ్చే ఆయా పాత్రల మనస్తత్వాల ననుసరించి కథకుడూ, వంత దారుడూ, ఆ పాత్రల్లోకి మారి పోతారు. పిచ్చుకుంటుల కథా విధానం ఎలా వుంటుందో పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు యుద్ధంలో దూకిన ఘట్టాన్ని వింటే బోధ పడుతుంది.

రగడ

కుప్పించి ఎగసిన - కుండలంబుల కాంతి
గగనభాగంబెల్ల - గప్పి కొనంగ
కంపించి జగమంత - కదలి వణకంగ
మొగమందు చిరునవ్వు - మోసులెత్తంగ
కొండలంతా రాళ్ళు - పిండి పిండిగను
పత్రమంతా రాళ్ళు - పొడి పొడిగాను
శనగలంతారాళ్ళు - చిచ్చవ్వగాను.

ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.ఓ.ఓ. అంటూ దీర్ఘంతీస్తూ పాడతారు.

ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమరాజు, పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పేవారు.

రాయలసీమలో:

రాయల సీమలో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించేవారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత తంబుర, గుమ్మెటలు ఉపయోగించే వారు.

తెలంగాణాలో జంగాలు ఉపయోగించే బుడిగెలు ఇటు వంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుందని డా॥ తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచికలో ఉదహరించారు.

పాత కథలూ,కొత్త కథలూ:

అదే పిచ్చుకుంటుల కథా విధానాన్ని 1943 లో వచ్చిన కంట్రోలు, రేషనింగు విధానాల ద్వారా కరువుతో ప్రజలు పడిన బాధలను వివరిస్తూ వారి సమస్యలు తీసుకుని కోసూరి పున్నయ్య, ఆకలి మంటలు అనే పిచ్చుకుంటుల కథను వ్రాసి ప్రజా నాట్య మండలి ద్వారా ప్రచారం చేశారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తులుండే పేదవారి బ్రతుకుల్ని గురించి ఇలా వివరించారు.

ద్విపద

తిండికి బట్టకీ - తిప్పలొచ్చేను
కొండలై పెరిగేను - కొనుగోలు ధరలు
కష్టపడి పనిచేయు - కడుపు నిండదుగ
కష్టాలు హెచ్చేను - కరువొచ్చి నాదో....
                  ॥శ్రీమదంబా భారతాంబా జగదాంబా॥

అంటూ

ద్విపద

పూరి గుడిసెల్లోన - పువ్వుటెండల్లు
నోరు లేనీ పేద - తేరు కొనుటెట్టు
తాటాకు గుడిసెల్లో - బొటబొట వాన
కట్ట బట్టాలేక - గంజితో బ్రతికె


వాళ్ళ దేహాలలెల్ల - ఒట్టి బొమికల గూళ్ళు
పిల్లలూ కట్టుకొన - పీలికల గుడ్దలూ
ఆలసోమపురి లోన - ఆ బీద ప్రజలు
మల్లల్లో కూడ్లేక -మ్రగ్గుతుంటారో

ఇలా ఆనాటి పరిస్థితులనూ, సమస్యలనూ ప్రజలకు ఎరుక పర్చటానికి ప్రాచీన కళా రూపమైన పిచ్చికుంటుల కళా రూపాన్ని ప్రజానాట్య మండలి వుపయోగించిది. పిచ్చుకుంటులవారు ఈ నాటికీ గుంటూరు

జిల్లా రెంటచింతల గ్రామంలో 70 కుటుంబాలు, చెరకుపాలెంలో గ్రామంలో 70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6 , ప్రకాశం జిల్లా టంగుటూరులో 70, వరంగల్ జిల్లా మొగిలి చర్లలో కొన్ని కుటుంబాలవారు నివశిస్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ తగ్గటం వల్ల వేరు వేరు వృత్తుల్ని చూసుకుంటున్నారని కె.వి .హనుమంతరావు గారు ఆంధ్రప్రభ దిన పత్రికలో వివరించారు.

వారిలో వచ్చిన మార్పు:

ఆంధ్రదేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటుల వారు భామా కలాపం, గొల్ల కలాపం నేర్చుకున్నట్లు కూడా ఉదాహరణలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుమార దేవం గ్రామ వాస్తవ్యులు పల్లం పట్ల రామయ్య గారు, కోవూరు తాలూకా బందపురంలో నున్న పిచ్చుకుంట్లకు భామా గొల్ల కలాపాలను నేర్పారు.

బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ధహస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణగారి భామ వేషం అద్భుతంగా వుండేదట.

పై ఉదాహరణలను బట్టి పిచ్చుకుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది.