తెలుగువారి జానపద కళారూపాలు/పంబలవారు
Appearance
పంబలవారు
సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ పంబలవారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామదేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి.
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం పంబ జోడనీ, వీరు ఎక్కువగా అంకమ్మ కథలను పాడుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, మారాసపు అంకమ్మ అని పేరనీ వంతలు పంబజోడును వాయిస్తూ శ్రుతికి తిత్తి ఊదుతూ వుంటే కథకుడు రాజకుమారునిలా వేషాన్ని ధరించి కుడిచేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో అమజాల అనే చిన్న కత్తినీ పట్టుకుని వీరా వేశంతో చిందులు తొక్కుతూ కథను పాడుతారనీ, డా॥ తంగిరాల వెంకటసుబ్బారావుగారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.