తెలుగువారి జానపద కళారూపాలు/జానపద కళారూపాలు - ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జానపద కళారూపాలు

ప్రజానాట్యమండలి

ప్రగతిశీల దృక్పథం

TeluguVariJanapadaKalarupalu.djvu
TeluguVariJanapadaKalarupalu.djvu

నాటక రంగానికి మాతృకలై యుగ యుగాలుగా తరతరాల వైభవాన్ని సంతరించు కున్న జానపద కళారూపాలను గురించి, ఈ తరం వారికి చాలమందికి తెలియదనటం ఆతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం. తరగని వైభవం.

మన నాటక రంగానికి నూరేళ్ళు పూర్తి అయ్యాయి. అలాగే నాటకాలనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న సురభి నాటక రంగం ఏర్పడి కూడ నూరు సంవత్సరాలైంది. ఇటీవల చలన చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాలను జరుపుకుంది. ప్రాచీన జానపద కళారూపాలను పునరుద్దరించి నూతన ప్రయోగంతో ఆధునిక పద్ధతులలో ప్రజల మధ్యకు పోయి కళా రూపాలలో ప్రజా సమస్యలను జోడించి నవ చైతన్యం కలిగించిన ప్రజానాట్య మండలి ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలైంది.

TeluguVariJanapadaKalarupalu.djvu
ప్రజానాట్యమండలి నిర్మాతల్లో ప్రముఖుడు డా॥రాజారావు
నూరు సంవత్సరాల ముందు:

అయితే నూరు సంవత్సరాల ముందు నాటక రంగం లేని నాడు మన ప్రజలకున్న కళా రూపాలేమిటి? వారంతా ఎలా జీవించారు. వారి విజ్ఞాన వినోద వికాసాలకు ఉపయోగపడిన కళా రూపాలామేటి? అని మనల్ని మనం ప్రశ్నించు కుంటే మనకు కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే.

జానపద కళారూపాలంటే ఈనాడు చాల మందికి అర్థం కావు. జానపదమంటే పల్లెటూరని, జానపదంలో నివసించే వారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గానీ ఆటలు గానీ, నృత్యం గానీ, జానపద కళారూపాలని పెద్దలు నిర్వచించారు.

జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, తోలు బొమ్మలనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ, ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.

అంధ్రుల సాంఘిక చరిత్ర:

ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకూ ఆయా రాజుల కాలాల్లో రకరకాలుగా ఈ జానపద కళలు ఆభివృద్ధి చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడా అభివృద్ధి పొందాయి. ప్రజలు ఆదరించారు.

శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజా హృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటు పోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళాకారులను కన్న బిడ్డలుగా చూసుకున్నారు. తెలుగుజాతి గర్వించ తగిన కళారూపాలవి.

నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు. కళాకారులు కడుపు కోసం, కళలనే పట్టుకుని దేశ సంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ చాలీ చాలని ఆదాయాలతో కడుపు నింపుకుంటూ జీవిస్తున్నారు.

కాకతీయ ఉద్యమం, జాతీయ గీతాలు:

ప్రజా నాట్యమండలి ఏర్పడే నాటికి ముందే ఏర్పడిన వైజ్ఞానిక దళాలు, ప్రాచీన జానపద కళారూపాలను నూతన స్థాయిలో పునరుద్ధరించడానికి ముందే జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్వతిరేకంగా జాతీయ నాయకులు చేపట్టిన ఖాదీ కార్యక్రమమూ, రాట్నం వడకడమూ, సత్యాగ్రహ వుద్యమమూ, మద్యపాన నిషేధమూ, హిందీ వుద్యమమూ, గణేష్ వుత్సవాలూ మొదలైన ఉద్య మాలు చోటు చేసుకున్నాయి. తద్వారా ఆ వుద్యమాల ప్రచారానికి ప్రజల నాకర్షించి వారితో జాతీయోద్యమ భావాలు కలిగించాలనీ, అనేక మంది రచయితలూ, కవులూ, గాయకులూ, వారి కలాలనూ, గళాలనూ విప్పి ముందుకు నడిపించారు. ఆవిధంగా ఎన్నో గేయాలను వ్రాశారు. నాటకాలను వ్రాశారు. ప్రదర్శించారు. ఆ విధంగా వారంతా జాతీయోద్యమానికి ఎనలేని సేవలు చేశారు.

అకులందున అణగి మణగి కవిత కోకిల పలుక వలెనోయ్ అని గురజాడ అన్నట్లు, అతి నిరాడంబరుడైన స్వాతంత్ర్య సమర యోధుడు గరిమెళ్ళ, మాకొద్దీ తెల్ల దొరతనమూ అని, కొల్లాయి గట్టితే నేమీ మా గాంధి కోమటై పుట్టితే నేమీ అంటూ బసవరాజు అప్పారావు అగునా జీవాలు సాగునా లోకాలు, రాజుగా మన మెంచి రైతు చూడ పోతే అంటూ సెట్టి పల్లి వెంకటరత్నమూ, శివ శివ మూర్తివి గణ నాథా నీవు శివుని కుమారుడవు స్వామి నాథా అంటూ అబ్బూరి, తక్కెళ్ళ జగ్గని ధర్మ పన్నాలను, మాలపల్లి ద్వారా చెప్పించిన ఉన్నవ లక్ష్మీ నారాయణ, ఎగరాలి ఎగరాలి మన ఎర్రజండా అంటూ తుమ్మల వెంకట రామయ్య , ముద్దూరి అన్న పూర్ణయ్య, పి. లోకనాథం, గిరిరాజు రామారావు, వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ అనే త్రిపురనేని రామస్వామి పాటా మొదలైనవే కాక, రాయప్రోలు ఏదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, దువ్వూరు రామిరెడ్డి, కాటూరు వెంకటేశ్వర రావు, కొడాలి ఆంజనేయులు. తుమ్మల సీతారామమూర్తి మొదలైన ఎందరో దేశ భక్తిమూర్తీభవించిన మహా కవులు, జాతీయతనూ, దేశభక్తినీ, రైతాంగాన్ని, కూలీలనూ ప్రబోధిస్తూ, ఆచార్య రంగా వెలువరించిన రైతు భజనావళిలో అసంఖ్యాకంగా గేయాలను వ్రాశారు. నాటి జాతీయ సభలలో అద్భుతంగా గానం చేశారు. ప్రజలను వుత్తేజపర్చారు. కార్యోన్ముఖులను చేశారు. ప్రజలను ఉద్యమ కార్య రంగంలోకి దూకేటట్లు చేశారు.

అలాంటి గీతాలను గురుజాడ రాఘవ శర్మ గారు ఆరువందల పేజీల గ్రంథంలో సమకూర్చారు. ఆనాటి ఉద్యమంలో వెల్లువగా వచ్చిన గేయాలనూ, పద్యాలనూ గీతాలను, భజన పాటలనూ, హరికథలుగా ఎన్నో సంకలనాలు 1922 లో వెలువడ్డాయి.

ఇలాంటి ఎన్నో గేయ రచనలు:

ఆనాటి ఉద్యమంలో వెల్లువగా వచ్చిన గేయాలనూ, పద్యాలనూ, గీతాలనూ, భజన పాటలనూ హరికథలుగా ఎన్నో సంకలనాలు 1922 లో ఈ క్రింద విధంగా వెలువడ్డాయి. అవి మహాత్మా గాంధి ప్రబోధ పద్యాలు, ఆల్లూరు సీతారామరాజు పాటలు, మహాత్ముని ఉద్యమవాణి, స్వరాజ్యాందోళనము, భారతమాత పలుకు, రామదండు భజన పాటలు, గాంధీ జీవితము, స్వరాజ్య భక్తి కీర్తనలు, తిలక్ హరికథ, స్వరాజ్య దర్పణం ఇలా ఎన్నో జాతీయ గేయ సాహిత్య సంకలనాలు వెలువడ్డాయి.

జాతీయ నాటకాలు:

ఆరోజుల్లో చిలకమర్తి, తిరుపతి వెంకట కవులు, భారత గాథలకు చెందిన నాటకాలు, అలాగే భారత చారిత్రక వీరుల గాధలైన "శివాజీ" "రాణా ప్రతాప్" "మేవాడ శౌర్యాగ్ని" "బొబ్బిలి యుద్ధం" "రోష నార" మొదలైన గాంధీ బోధనలనూ, కాంగ్రెసు ఉద్యమాన్ని ప్రబోధించే దామరాజు పుండరీకాక్షుడు గారి పాంచాల పరాభవం, గాంధీ విజయం, గాంధీ మహోదయం మొదలైన నాటకాలే కాక ఆంధ్ర మాత, సంస్కారిణి, స్వరాజ్య పతాకం, చీరాల పేరాల గాంధి, మొదలైన నాటకాలను ప్రచారంలోకి తెచ్చారు. అలాగే శ్రీ పాద వారి విజయధ్వజ నాటకం, ముద్దూరి అన్న పూర్ణయ్య, చిచ్చుల పిడుగు, 1957 సిపాయి తిరుగు బాటు నాటి మంగళ పాండ్యా గాథను ఆమంచర్ల గోపాల వారు మొదలైన రచయితలు చెప్పుకో తగిన నాటకాలను వెలువరించారు. అయితే వీటిలో చాలవరకు ప్రదర్శన యోగ్యం కాలేదు.

ఎవరికి వారు ఒకే సమస్య మీద కేంద్రీకరించి స్థానికంగా కథలు, గేయాలను వ్రాసి పాడారు గానీ అవీ రాష్ట్ర వ్యాపితం కాలేదు. అలాగే నాగరికత అభివృద్ధి చెందిన సర్కారు ప్రాంతాల పట్టణాలలో ప్రభావితులైన మేధావులు మొదలైన వారు తప్ప ఉవ్వెత్తున గ్రామాలలో ఈ వుద్యమం సాగలేదు.


నాటి వైజ్ఞానిక ఉద్యమం:

నాటి సత్యాగ్రహ ఉద్యమంలో ఇలా ఎందరో వారి వారి కవితాధారలను కురిపించారు... అయితే ఎక్కడి కక్కడే బృందాలుగా, వ్వక్తులుగా వారీ కార్యక్రమం జరిపారు కానీ, రాష్ట్ర వ్వాపితంగా ఈ వైజ్ఞానిక కార్య క్రమం సంఘటిత ఉద్యంమంగా రూపు దాల్చ లేదు. అలా అని పల్లెలకు పోకుండానూ లేదు. నాటి సత్యాగ్రహ ఉద్యమం సాగిన ప్రతి పల్లె టూరులోనూ వలంటీర్లు పాటలను ఉద్వేగంగా పాడి బ్రిటీష్ ప్రభుత్యం మీద వ్వతిరేఖతను కలిగించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్వతిరేకంగా వ్రాయటమూ పాడటమూ సాహస వంతమైన విషయం. అయితే ఒకరిద్దరు రచయితలు "బుర్రకథ _ హరికథ_ నాటకం లాంటివి తప్ప ఎక్కువ జానపద కళారూపాల ప్రక్రియలను అనుసరించ లేదు.

TeluguVariJanapadaKalarupalu.djvu
ప్రగతిశీల విప్లవకవి కోగంటి గోపాలకృష్ణయ్య
పోరాట రంగ స్థలం, ప్రజానాట్యమండలి:

ఆ తరువాత జానప కళా రూపాలను ఒక మలుపు త్రిప్పి నూతన ప్రయోగంతో, నూతన దృక్పథంతో ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ నాటక రంగ స్థలంలో నవకాశాన్ని ఏర్పర్చి, ప్రజలను జాగృత మొనర్చి దేశభక్తిని రగులు కొల్పిన సంస్థ ప్రజా నాట్య మండలి.

రాష్ట్ర వ్యాపితంగా నిర్మించిన ప్రజానాట్య మండలి ఉత్సాహం కొద్దీ నిర్మించింది కాదు. అది ఒక ఉధృత వాతావరణంలో జన్మించింది.

కేవలం ఆర్థిక లాభాల కోసం నిర్మించింది కాదు. ఒక ఉన్నాతాశయ ప్రబోధంతో దేశానికి, ప్రజలకూ సేవ చేయటానికి పుట్టింది. కళ కోసం కాదనీ, అది ప్రజలకు చెందిన ఆస్తి అనీ చాటింది. దేశంలో వచ్చిన రాజకీయ కల్లోల వాతావరణంలో రూపొందింది ప్రజానాట్య మండలి.

ఆంధ్ర నాటకరంగంలో అది వరకు ఏనాడూ కనీ వినీ ఎరుగనంత మహత్తర పరిణామాలను సృష్టించింది. గత చరిత్ర కంటే ఈ యుగం లోనే నాట్య కళ సంపూర్ణంగా ప్రజా సామాన్యం వద్దకు పోయిందని చెప్పవచ్చు. ప్రజల యొక్క స్థితి గతులకు అనుకూలంగా వారి కష్టాల్లో పాలు పంచుకుని పరిష్కార మార్గాలను కళారూపాల ద్వారా పరిష్కరించింది. ప్రజలు నాటక రంగాన్ని తమ కన్న బిడ్డను ఆదరించినట్లు ఆదరించింది ఈ రోజుల్లోనే.

బానిసత్వపు రోజులు:

అవి బ్ర్ఫిటిష్ సామ్రాజ్య వాదుల బానిసత్వంలో మ్రగ్గుతున్న అరోజులు. ఒక ప్రక్క సత్యాగ్రహాలూ, శాసనోల్లంఘనాలూ, లాఠీచార్జీలు, జైళ్ళ కటకటాల మద్య ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు నానా బాధలు అనుభవిస్తున్న రోజులు, ప్రతి భారతీయుడూ అంతో ఇంతో జాతీయ భావాన్నీ దేశభక్తినీ కలిగి వున్న రోజులు. యువకులూ, విద్యార్థులూ, టెర్రరిస్టు విప్లవ భావాలతోనూ సోషలిస్టు భావాలతోనూ సమావేశ మౌతున్న రోజులు.

ఉత్తేజం పొందిన యువకులు:

దేశం కోసం ప్రాణాలర్పించిన ఆనాటి వివ్లవ వీరుల జీవితాలను నుంచి ఉత్తేజం పొందిన యువకులూ, విద్యార్థులూ, స్వాతంత్ర్య పోరాటంలో పాల్కొనాలనీ దేశం యొక్క విముక్తికి పాటు పడాలనీ వేలాది యువకులు నాటి యువజనోద్యమంలోకి ఆకర్షింపబడ్డారు.

1933 లో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఆంధ్ర ప్రజాజీవితంలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది. సోషలిజం స్థాపన లక్ష్యంగా రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆంధ్ర జాతీయ పునరుజ్జీవనానికి బహుముఖ సేవ చేసింది. మితవాద కాంగ్రెసు విధానలతో విసిగి పోయిన యువకు లందరూ సోషలిస్టు భావాలతో కమ్యూనిస్టుపార్టీ వైపుకు మొగ్గారు.

పీడిత ప్రజాఉద్యమంతోపాటు కమ్యూనిష్టు పార్టీ సమాజ శ్రేయస్సు కాంక్షించడమే సాహిత్యం, కళల పరమావధి అనే ప్రగతి శీల దృక్పథాన్ని రచయితలలో కలిగించటానికి అభ్యుదయ రచయితల ఉద్యమం ద్వారా కృషి చేసింది. ఈ మార్పును కళారూపాలతో, నాటకరంగంలో సాంస్కృతిక రంగంలో కూడా తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ కృషి చేసింది.

రెండవ ప్రపంచ యుద్ధం.

రెండవ ప్రపంచ యుద్ధం పాసిష్టుల ప్రళయ అర్భాటాలతో మారు మ్రోగింది. ఫాసిష్టు శక్తులకూ, ప్రజాస్వామిక శక్తులకూ పోరాటమది. ధర్మానికి, అధర్మానికి, శాంతికి, అశాంతికి ఘర్షణ దినాలవి. దేశ దేశాల ప్రజలు అట్టుడికి పోయారు. మానవసమాజం యొక్క యుగ యుగాల విజ్ఞానం, సంస్కృతీ పశు బలానికి ఆహుతై పోతూవుంది. ఏ దేశమైనా, ప్రజలైనా, ఈ భయంకర మారణహోమం నుంచి ఈ అగ్నిజ్వాలల నుంచి బయట పడాలని తహ తహలాడే భయంకర దినాలవి.

స్పందించిన యువ చైతన్యం:
TeluguVariJanapadaKalarupalu.djvu
బెంగాల్ కరువు బుర్రకథ _నాజరు, పురుషోత్తం, రామకోటి

ఈ స్థితిలో కళాకారులూ, కవులూ, గాయకులూ ఈ హోమగుండం నుంచి ప్రజలను విముక్తి చేయాలకున్నారు. ఆనాటి యువకులందరూ వేయి కంఠాలెత్తి పిడికిళ్ళను బిగించారు. రాబోయే యుద్ధ ప్రమాదాన్ని గూర్చి దళాలు దళాలుగా బయలు దేరి ప్రచారం చేయ సాగారు. ఈ తీవ్ర సంచలనంలో ప్రతి కళాకారుడు దేశభక్తి ప్రపూరితుడై పోయాడు. కవులు గేయాలు వ్రాశారు. గాయకులు కంఠాలు ఎత్తారు. ఆంధ్ర ప్రజా సామాన్యాన్నంతా గాఢ నిద్రలోనించి మేల్కొల్పారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఆనాడు కృష్ణా జిల్లా గండిగుంటలో రాజకీయాలతో పాటు వైజ్ఞానిక శిక్షణా శిభిరం ప్రారంభమైంది. బందరు కాలేజీలో చదువుతూ కాలేజీ ఫ్యాన్సీ డ్రస్సుల్లో తన ప్రతిభా విశేషాలను ఆనాడే వెల్లడించుకున్న కోగంటి గోపాలకృష్ణయ్యగారు స్వాతంత్ర భావాలను ప్రబోధిస్తూ బుర్రకథను వ్రాశారు. అంటే అంతకు ముందు బాలనాగమ్మ, కామమ్మ, లక్ష్మమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలైన బుర్రకథల స్థానంలో స్వాత్రంత్ర్య ప్రబోధం కోసం తొలిగా వ్రాసిన బుర్రకథ ఇది. ముగ్గురు యువకులు కలిసి స్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రించే ఈ బుర్రకథ ప్రజలను వుఱ్ఱూత లూగించింది. ఆ కథా రచనకూ, ప్రదర్శనకూ వైజ్ఞానిక వుద్యమానికీ, ప్రజానాట్యమండలి అవిర్భావానికి ప్రథమంగా కోగంటి ప్రముఖ బాధ్యతలు నిర్వహించారు.

కోగంటి కోయ వేషం:

భద్రాచలం ప్రాంతాలనుండి వచ్చే కోయవేషం గురించి అందరికీ తెలిసిందే. ఆ వేషం ద్వారా కోయవేషాన్ని ధరించి కోయభాషలో యుద్ధ బీభత్సాన్ని గూర్చి 1943 మే న బొంబాయిలో జరిగిన కమ్యూనిష్టు పార్టీ అభ్యుదయ రచయితల మహాసభలో వివరించాడు. ఉదాహరణకు ఆ సభలో వున్న డాంగేనీ, బలారాజ్ సహానీనీ చూచి ఓ సామి ఏం? ఈత పిక్కలా బక్కచిక్కి పోయుండావు. నాను ఒక్క ఏరు ముక్క కట్టినానంటే ఇంతలావై పోతావు. నా ఏరు ముక్కంటే ఏమనుకున్నారు హిట్లరూ, గిట్లరూ ఎగిరి సావాల. ముస్సోలీనీ గిస్సోలినీ తుస్సుమని పోవాల. తిండి దొంగలూ, లంచ గొండులూ ఎగిరి పోవాల అంటూ అందర్నీ కడువుబ్బ నవ్విస్తూ అందర్నీ ఆనంద సాగరంలో ముంచి వేశారు. ఇలా మన పాత కళారూపాన్ని ఈ విధంగా మలుపు త్రిప్పి, కళా రూపాల ప్రగతిశీల దృక్పథానికి దోహదం చేశారు.

ఫాసిస్టు వ్వతిరేక శిక్షణా శిభిరాలు:

బొంబాయి వెళ్ళి వచ్చిన దళం కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చింది. 1943 లో కృష్ణా జిల్లా కొడాలిలో ఫాసిస్టు వ్వతిరేక శిక్షణ శిబిరం జరిగింది. ఆ శిబిరంలో రాజకీయాలతో పాటు నూతన దృక్పథంతో జానపద కళారూపాలలో కూడా కళాకారులు శిక్షణ పొందారు. ఈ శిబిరంలో గొల్లసుద్దులు, పకీరువేషాలు, చెంచువేషాలు, సోది, జంతరుపెట్టె, డప్పుపాటలూ, బృందగానాలూ మొదలైనవి శిక్షణ ఇవ్వబడ్డాయి. శిక్షణ పొందిన కళాకారులు మిక్కిలినేని, మాచినేని, చదలవాడ, పెరుమాళ్ళు, కేశవరావు, అమృతయ్య, ఏసుదాసు మొదలైన వారు. కోగంటి, కోసూరి పున్నయ్య శిరివిసెట్టి సుబ్బారావు మొదలైనవారు శిక్షణ ఇచ్చారు.

ఎన్నో శిబిరాలు:

ఆ శిబిరం తరువాత కృష్ణా జిల్లాలో ఎన్నో శిబిరాలు నడిచాయి. ఎందరో కళాకారులు తయారయ్యారు. ఎన్నో బుర్రకథ దళాలు, పాటలు పాడే దళాలు, చిత్ర విచిత్ర కళారూపాల దళాలు తయారయ్యాయి. కేవలం పురుషులే కాక స్త్రీల దళాలు, బాలాబాలికల దళాలు కూడ ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, మోటూరు ఉదయం దళం, రష్యన్ వీరనారి టాన్యా బుర్రకథను చెప్పేవారు, అలాగే కొండేపూడి రాధ, తాపీ రాజయ్య, వీరమాచనేని సరోజని, దళం అల్లూరి సీతారామ రాజు బుర్రకథను అత్యద్భుతంగా చెప్పేవారు.

ఓ, మిట్టిపడే హిట్లరయ్యా?:

ఓ గుఱ్ఱాల గోపిరెడ్డి అనే పాత గేయం బాణీలో హిట్లరును గురించి సుంకర గేయం వెలువడింది.

ఓ, మిట్టిపడే హిట్లరయ్య
ఏటికీ ఎదురీదుచుంటివా ॥ఓ॥

కూలిరాజ్యం కూల దోసీ
నీదు రాజ్యం నిలప బోతే
సేనలన్నీ చెదరిపోయేనా॥ఓ॥

కూలి రైతుల పాలి స్వర్గం
నేలమట్టం చేయబోయి
కాలు జారీ నేలబడితివా॥ఓ॥

అలాగే కోలాట కీర్తన:

మాస్కో పొలిమేర లోనా, మారణ యంత్రాలు నిలిపి
మాడ్చేవేసెరా రెడార్మీ పూడ్చేవేసెరా ॥మా॥

లెనిను గ్రాడు లోనా, శత్రువలయము చించి
చీల్చేవేశెరా రెడార్మీ కూల్చె వేసెరా ॥మా॥

మరో కోలాట కీర్తన:

స్టాలినోగ్రాడుదాక సాగిరానిచ్చి నిన్ను
ఎఱ్ఱసేన చుట్టి ముట్టి గొఱ్ఱెకోత కోయుచుండ
హిట్లరూ అబ్బ నా కళ్ళు చల్లబడ్డ వోయి హిట్లరూ ॥స్టా॥

స్టాలినంతోణ్ణిబట్టి కాలు సేతులంట గట్టి
జర్మనీకి తెస్తునన్న జ్వరము వదల నిన్ను తన్న
హిట్లరూ అహ నీ తిక్క కుదిరిపోయెనోయి హిట్లరూ॥స్టా॥

TeluguVariJanapadaKalarupalu.djvu
మిక్కిలినేని, ఉమామహేశ్వరరావు, మాచినేని బుర్రకథ దళం
హిట్లరు వీథి నాటకం:

వీథి నాటకాలను కూచి పూడి వారు ప్రముఖంగా ప్రదర్శిస్తున్న తరుణంలో ఆ స్థాయిలో కోగంటి గోపాల కృష్ణయ్య, హిట్లరు వీథి నాటకాన్ని, వ్రాశారు. దీనికి కూచిపూడి వేదాంతం వెంకటేశ్వర్లుగారు శిక్షణ ఇచ్చారు. ఫాసిస్టుల ప్రళయార్భాటాలను ఈ విధంగా చిత్రించారు.

కీర్తన:

వెడలె హిట్లరు సభకూ
సూటుబూటు నీతులను చూపుతు
జర్మన్ ఫిటింగ్ ఆఫ్ కటింగుతో ॥వెడ॥

హిట్లరు పరివారంతో__ కీర్తన.

సిద్దమయ్యె హిట్లరూ-యుద్ధమునకు
ముందు వెనుక ముస్సోలిని టోజో
కుడి యడమల గోరింగ్ గోబెల్సులు
బలగము తోడను కొలువు కూటమునకు ॥వెడ॥

అంటూ వీధి భాగవత కత్తులలో నృత్యం చేస్తూ వుండగా వార్తా హరుడు అపజయవార్తలు తెస్తాడు. అప్పుడు హిట్లరు.

కీర్తన

వినుడి నినుడి నా వీర ప్రతాపము
స్టాలి నెంత స్టాలిన్ గ్రాండెంతరా
పక్ష పక్షముకు లక్షల సైన్యము
అంపెద శత్రుల జంపెద నిక్కము ॥వినుడి॥


ఈ విధంగా హిట్లరు అంతముతో వీధి భాగవతం ముగుస్తుంది. ఇలా ప్రగతి శీల దృక్పథంతో కోగంటి పేరిగాడి రాజ్యం, తెలంగాణా వీధి నాటకం సిమ్లా భాగవతం మొదలైనవే కాక ఎన్నో చిత్ర విచిత్ర జానపద కళా రూపాలను ప్రజా సమస్యలను తీర్చి దిద్దే ఎన్నో గేయాలను రచించారు.

తధ్యామయాగరుడ

నందామయా గరుడ నందామయా అనే ప్రాచీన జానపద గేయ బాణీలో కోగంటి గేయం.

తథ్యామయా మనకు తధ్యామయా
ఇంక అనందజీవితమె తధ్యామయా ॥త॥
సకల మానవజాతి చావు బ్రతుకుల జేర్చు
ఘోరయుద్ధము జరుగుచున్నాదయా ॥త॥

సర్వలోక ప్రజ - సోవియట్ తో జేరి
స్వేచ్ఛకై పోరాడుతున్నాదయా ॥తం॥

తుమ్మెద పాట:

ఆంధ్రదేశంలో దసరా పర్వదినాలలో శ్రామిక జన స్త్రీలు, తుమ్మెద పాటలు పాదుకుంటూ రైతు ఇళ్ళకు వచ్చి పారితోషికాలను పొందుతారు. అదే రీతిలో యుద్దాన్ని గూర్చి సుంకర గేయం ఇలా వెలువడింది.

పాడవే పాడవే తుమ్మెదా
మంచి పాటలెన్నో పాడు॥తు॥
పండించు పండించు ॥తు॥
మంచి పంటలను పండించు ॥తు॥
దేశాన చూడవే తుమ్మెదా ॥తు॥
పెద్ద తిండి కరువొచ్చింది ॥తు॥

పకీరు గీతాలు:

ముఖ్యంగా పకీర్లు అల్లా నామాన్ని జపిస్తూ మహమ్మదీయులను ఆశీర్వదిస్తూ మహమ్మదు ప్రవక్త బోధనలు ప్రచారం చేస్తూ వారిని మాత్రమే యాచిస్తారు. ఆ గీతాల్లో కోగంటి హిందూ ముస్లిం ఐక్యత గూర్తి ఇలా వివరించాడు.


పాడి పంటల్ సల్ గుండాలి ॥ఆల్లాకెనాం॥
తల్లి పిల్లల్ సల్ గుండాలి "
అన్ని జాతుల ప్రజలు "
వార్కి హేకం కావాలండి "
హిందూ ముస్లింము "
వార్కి హేకం కావాలండి "


క్వారీ పాట:

కొండ రాళ్ళను బండ రాళ్ళను పగల కొడుతూ శ్రమను మరిచి పోవటానికి ఒక రయం ప్రకారం గొంతులు కలుపుతూ వుంటారు. సుంకర హిందూ ముస్లిం ఐక్యతను ఈ విధంగా ప్రబోధిస్తాడు.

ఓ సాయీబన్నయ్యా ఈ సాయీబన్నయ్యా
నీవు నే కలిసుండీ నిలిచీ పోరాలన్నా

TeluguVariJanapadaKalarupalu.djvu
అల్లూరి సీతారామరాజు బుర్రకథ దళం: తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ, వి.సరోజిని

వస్తువూ లన్నిటికీ వడ్లకీ గుడ్డకీ
వచ్చి పడ్డది కరువూ ఓ సాయి బన్నయ్యా ॥ఓ॥

చెట్టుందా చేనుందా -పొట్టుందీ ఇద్దరికీ
కరువొచ్చి చస్తున్నా - కాపోళృా అన్నయ్యా

అంటూ ఆనాటి పేద ప్రజల కష్టాలను వివరిస్తూ కను విప్పు కలిగించారు.

గొల్ల సుద్దులు:

గొల్ల సుద్దులను చెప్పే వారు యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని సుద్దులవారు ప్రచారం చేస్తూ వుంటారు. ఇది మన ప్రాచీన కళారూపం. ఈ రూపాన్ని ఆనాటి పరిస్తితుల కన్వయిస్తూ కోగంటి

గొల్లల గోత్రాలు గొఱ్ఱెలకెరుక
గొఱ్ఱెల గోత్రాలు గొల్లక కెరుక
వీరి వారి గోత్రాలు తోడేళ్ళ కెరుకో

అంటూ ఈ బాణీలో పాసిష్టుల యుద్ధాన్ని వివరిస్తూ

తూర్పున ఒక నక్క - తుప్ప తల నక్క ॥ఆఁ॥
పడమర ఒక నక్క - బక్క చిక్కిన నక్క ,,
ఆ నక్క ఈ నక్క - జనాన్ని మాడ్చె ,,
జపాను ప్రభుత్వానికి పెద్ద బొక్కొ ,,
జర్మనీ గోత్రాలు- జపాను కెరుక ,,
జపాను గోత్రాలు - జర్మనీ కెరుక
జపాను జర్మనీ గోత్రాలు సోవియట్ కెరుకో


పడవ పాట:

పంట పొలాల ప్రక్కన ప్రవహించే కాలువల్లో పడవల్ని లాగుతూ పాడే విషయం అందరికీ తెలిసిందే. ఆ పాట బాణీలో దేశ సమైక్యతను వివరిస్తూ కోగంటి

పడవెళ్ళి పోవుచున్నదీ
ఐక్యతా పడవెళ్ళి పోవుచున్నదీ
అన్ని జాతుల వారి కందుతుందీ పడవ
స్వయం నిర్ణయ సూత్రాన్ని
చాటుతుందీ పడవ ॥పడవెళ్ళి॥

అని దేశ సమైక్యతనూ, స్వయంనిర్ణయ సూత్రాన్నీ పడవ పాటలో వివరించారు.

సోదె:

ఇంటింటికీ తిరిగి జరిగిన విషయాలనూ, జరగబోయే విషయాలనూ సోదె చెప్పే ఎరుకల స్త్రీలను గురించి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సోదెలో కోగంటి

అంబా పలుకు, జగదంబా పలుకు, మాయమ్మా పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు అంటూ...

ఓయమ్మ మేం పిశాచులం గాదే
పెను భూతాలం గాదె; మాతృద్రోహులం గాదె
మంత్రగాళ్ళం గాదె పెద్ద దోపిడిగాళ్ళం గాదు
ఫాసిస్టు భూతాలం గాము
నీ గర్భవాసాన పుట్టిన బిడ్డలమండీ
తెలియదే తల్లి
నికృష్టపాలన నిలువునా చెండ
ప్రతిజ్ఞ పట్టామె భారతాంబా మము
గన్నతల్లీ


అంటూ ఎన్నో జాతీయ సమస్యల వరకూ ఏకరువు పెట్టి ప్రేక్షకులకు కనువిప్పు కలిగించే వారు.

బుర్ర కథలు:

నాటి నుండి నేటి వరకూ బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఈ నాడు బుర్ర కథలుగా వెలువడుతున్నాయి. ఒకనాడు మత ప్రబోధానికి, అధ్యాత్మిక తత్వానికి అనుకూలంగా ఉపయోగపడిన జంగం కథలను దేశ భక్తికి ప్రతి బింబాలుగా సుంకర కష్ట జీవి, రైతు విజయం, స్టాలిన్ గ్రాడ్ యుద్ధం, వీరేశలింగం, అల్లూరి సీతారామ రాజు మొదలైన అనేక బుర్రకథలు రచించారు.

నాజరు బెంగాలీ కరువు బుర్ర కథను, పల్నాటి వీరచరిత్రను, బొబ్బిలియుద్ధం మొదలైన బుర్ర కథలను ప్రజానాట్యమండలి కళాకారులైన నాజరు, పురుషోత్తం, రామకోటి, మిక్కిలినేని, మాచినేని, పట్టం సెట్టి, కోసూరి పున్నయ్య, పిరివి సెట్టి, పెరుమాళ్ళు, చదలవాడ, పల్లం, కేశవ రావు మొదలైన అనేక మంది కళా కారులు రాష్ట్ర వ్యాపితంగా వ్యాపింపచేశారు.

జముకుల కథలు:

జముకుల కథ కాకతీయుల కాలంనుంచీ బహుళ ప్రచారంలో వుంది. అలాంటి కళారూపాన్ని తీసుకుని గురుజాడ వ్రాసిన కన్యక గేయాన్ని జముకుల కథగా మార్చిన వ్వక్తి పీసా లక్ష్మణ రావు. విష్టువర్థన మహా రాజు కన్యకను ఎలా చెరపట్టింది, కళింగ దేశంలో రాజు చేసే దురంతాలను వర్ణిస్తూ వ్రాసిన ఈ కథలో ప్రస్తుత రాజకీయ సాంఘిక సమస్యలను జోడించి అత్యుద్భతంగా వ్రాసిన కథను పీసా లక్ష్మణరావు, తొత్తడి సింహాచలం, మిక్కిలినేని, మాచినేని ఉమామహేశ్వర రావుల దళం, కన్యక కథను ఆంధ్రదేశమంతటానే కాక మద్రాసు, విజయవాడ, ఢిల్లీ మొదలైన రేడియో కేంద్రాలలో కూడ ప్రసారం చేయడం జరిగింది.

జంతరు పెట్టె:

ఆంధ్రదేశంలో పర్వ దినాలలో జాతర్లలో, ఈ జంతరు తమాషా చూపిస్తూ పిన్నల్ని, పెద్దల్ని అలరిస్తారు. ఈ కళా రూపాన్ని కోగంటి

పైస తమాష చూడర బాబు
ఏమి లాహెరిగ వున్నదొ చూడు
జంతర్ మంతర్ చూడర బాబు

అనే మకుటాన్ని ఇలా మార్చి వేశారు.

లాయరమ్మ లాయరో - లాయం పెట్టి చూడర బాబు
ఎంత లాయరుగ వున్నదొ చూడు "
భారతదేశపు తీరును చూడు "
నల్లధనంతో సంచులు నిండి "
కొల్లగొట్టిన ఘనులను చూడు "
ధరలను పెంచిన ధనికుల చూడు "
బ్రిటీషు తొత్తుల కుట్రలు చూడు "
గాంధీతాతా బోధలు చూడు "
జిన్నా వేసే ఎత్తులు చూడు "
అంటూ నాటి ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యలకు సంబంధించిన ఎన్నో దారుణాలను ప్రజానాట్యమండలి దళాలు ప్రచారం చేశాయి.
TeluguVariJanapadaKalarupalu.djvu
మోటూరు ఉదయం, మహంకాళి లక్ష్మి, చింతల కోటేశ్వరమ్మ, టాన్యా బుర్రకథ దళం
చెంచులు:

ఏవూరు ఏ భామ ॥నందాన॥
ఎవ్వారి భామవే "

TeluguVariJanapadaKalarupalu.djvu
కన్యక జముకుల కథ పట్టంసెట్టి, డా॥మిక్కిలినేని, మాచినేని

వినరోరి నరసిమ్మ ॥నందాన॥
వుండు గూడెం మాది "

చేతిడే ముద్దమ్మ ॥నందాన॥
చెయ్యెత్తి దానాలు "

అంటూ భద్రాచల ప్రాంతాల నుండి వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. ఈ బాణీని అసరాగా అయ్యపు వెంకటకృష్ణయ్య దేశభక్తిని ప్రబోధిస్తూ

మనది భారత దేశమమ్మా ॥నందానా॥
మనది భారత జాతి తల్లీ "
భారతీయులము మనమమ్మా "
బానిసలమైనాము తల్లీ "
మన బాలచంద్రుడూ "
మన ఖడ్గ తిక్కన "
మన రెడ్డి రాజులూ "
తమ శౌర్యమయ రక్త "
ధారా స్రవంతిలో "
తడిసి మొదిపిన వీర "
ధాత్రి ఇది మాతల్లి "
మనది భారత దేశమమ్మా "

ఈ విధంగా ప్రాచీన జానపద కళా రూపాలను, ప్రజా పోరాటాల రంగ స్థలం ప్రజానాట్యమండలి పునరుజ్జీవింప చేసింది_ ఆ విధంగా _ బుర్రకథ _ జముకుల కథ _ హరికథ_ కోలాటం _ జంతరు పెట్టె _ చెంచీత పాట _ పకీర్లు _ సై సై నృత్యం _ గొల్ల సుద్దులు _ సోది _ పిచ్చి గుంటుల కథ _ వీథి నాటకం, డప్పుల నృత్యం_ డప్పుల కోలాటం _ చెక్క భజన,_ జేగంట భాగవతులు _ సమిష్టి నృత్యాలు_ బృంద గానాలు _ ఇలా ఎన్నో కళా రూపాలాలను ప్రదర్శించారు_ కొన్ని వందల దళాలు, వేలమంది కళాకారులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు_ ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు.

ప్రజా నాట్యమండలి

ప్రజా నాట్యమండలి కళా రూపాలను కొన్ని లక్షల మంది చూశారు. ఆ నాటి తెలుగు జీవితంలో ప్రజానాట్యమండలి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్ర మించింది. అట్టడుగున పడి పోయిన ప్రాచీన కళారూపాల నన్నిటినీ సంస్కరించింది. ఆంధ్రనాటకరంగచరిత్రలో ఒక మహావిప్లవాన్ని తీసుకు వచ్చింది.

ప్రజానాట్యమండలి దోపిడి దారుల్నీ, సంఘ విద్రోహుల్నీ సంఘంలో పున్న కుళ్ళునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. ఈ విధంగా అనతి కాలంలోనే ఆంధ్ర ప్రజలలో నూతన చైతన్యం కలిగించింది.

ప్రజానాట్య మండలి ఉద్యమం మహత్తరమైంది. దాని ఆశయాలు గొప్పవి. దాని పోషకులు ప్రజలు, ప్రజానాట్యమండలి ఆశయాలను, సంప్రదాయాలను దేశంలో అనేక సంస్థలు అనుసరించాయి.

అన్న తమ్ముల చీలికలు:

దీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిష్టు పార్టీ 1964 వ సంవత్సరంలో రాజకీయ విభేదాలతో చీలి పోయింది. కమ్యూనిష్టు పార్టీ, మార్కిస్టు పార్తీ, మార్కిస్టు లెనినిష్టు పార్టీ, నక్షల్ బరీ ఉద్యమంతో ఏర్పడిన నక్సలైట్లు, పీపుల్స్ వార్ పార్టీ పార్టీ ఇలా కమ్యూనిస్టు పార్టీ చీలికలై పేలికలై ఎన్నో శాఖలుగా విడిపోయారు. ఎవరికి వారు అన్ని రంగాలలోనూ వేరే వేరే సంబంధాలను పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి గాను, జననాట్య మండలి గాను, ప్రజా సాహితి గాను ఇలా ఎన్నో సాంస్కృతిక సంఘాలు ఏర్పడి అసలు ప్రజానాట్యమండలి విడిపోయింది.

అలాగే, ప్రజానాట్య మండలికి అండదండలుగా వున్న అభ్యుదయ రచయితల సంఘంలో కూడ చీలికలు వచ్చాయి. 1970 లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మార్క్సిస్టులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి జన సాహితి ప్రదర్శనాలు, పీపుల్స్ వార్ గ్రూపు, జననాట్యమండలి ఇలా గ్రూపులుగా చీలిపోయి, ఎవరి పాలసీకి తగిన విధంగా వారు పాటలనూ, కళారూపాలను సృస్టించుకుని పని చేస్తున్నారు. అందరూ అందరికీ కూడూ, గుడ్డా, వుండటానికి ఇల్లు కావాలనే వారే. దోపిడీ విధానం పోవాలనే వారే. అందరికీ సమానత్వం కావాలనే వారే. అందరి ఆశయాలు ఒకటే అయినా కలిసి పోయి పని చేసే విధానం ఎవరి తరుపునా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారై వారి వారి కార్యక్రమాలను సాగించుకుంటున్నారు.

ఇక్కడ నేను ఏ పార్టీని, ఏ సాంస్కృతిక ఉద్యమాన్ని విమర్శించ దలుచుకోలేదు. అయితే పూర్వ వైభవం మళ్ళీ పునరావృతం కావాలి. జాగృతి నుంచి మేలుకో వాలి, అన్ని సాంస్కృతిక సంస్థలూ, ప్రజానాట్యమండలి తరువాత వచ్చినవే. అందరూ ప్రజానాట్యమండలి బాటలోనే నడుస్తున్నారు. ప్రజానాట్యమండలి వారసులే వారు. ఏ ప్రజల కోసం వారు పని చేస్తున్నారో వారినందరినీ నేను అభినందిస్తున్నాను. అందరూ ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు నడవాలనదే నా కోరిక.

మాతృ సంస్థ ప్రజానాట్యమండలి:

ప్రజా నాట్యమండలి కళారూపాలను కొన్ని లక్షల మంది చూశారు. ఆనాటి తెలుగు జాతీయ జీవితంలో ప్రజానాట్య మండలి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అట్టడుగున పడి పోయిన ప్రాచీన కళారూపాలన్నిటినీ సంస్కరించింది. ఆంధ్ర సాంస్కృతికోద్యమంలో మహా విప్లవాన్ని తీసుకు వచ్చింది.

ప్రజానాట్య మండలి దోపిడిదారుల్నీ, సంఘవిద్రోహుల్నీ సంఘంలో వున్న కుళ్లునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. ఈ విధంగా అనతికాలంలోనే నూతన చైతన్యం కలిగించింది.

ప్రజానాట్యమండలి ఉద్యమం మహత్తరమైంది. దాని ఆశయాలు గొప్పవి. దాని పోషకులు ప్రజలు, ప్రజానాట్య మండలి ఆశయాలనూ, సాంప్రదాయాలనూ దేశంలో అనేక అభ్యుదయ నాటక సంస్థలు అనుసరించాయి.అభ్యుదయ నాటక సమాజాల పేర్లతో ప్రజానాట్యమండలి ఉద్యమం కొత్త రూపు తీసుకుంది. ఆనాటికీ ఈనాటికీ ప్రజానాట్యమండలి అజేయమైంది.

TeluguVariJanapadaKalarupalu.djvu

నలభై అయుదు సంవత్సరాల క్రితం స్థాపించిన బడిన ప్రజానాట్యమండలి ఉద్యమం ... తెలంగాణా పోరాటంలో పని చేసింది. ప్రజానాట్య మండలి కళాకారులు నాటి కాంగ్రెసు ప్రభుత్వ దారుణ హింసా కాండకు గురైనారు. డా॥ రాజా రావు లాంటి ఉద్యమ నిర్మాతలు ఎందరో అమరులైనారు. వారి పేర్లన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి అవకాశం లేక పోయింది. కావాలని ఈ కళాకారుణ్ణీ విస్మరించ లేదు. అందరూ మహానుభావులే అందరికీ వందనాలు.