తెలుగువారి జానపద కళారూపాలు/కాశీ కథలు చెప్పే కాశీ కావడి

వికీసోర్స్ నుండి

కాశీ కథలు చెప్పే కాశీ కావడి


కాషాయ వస్త్రాలను ధరించిన వ్వక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలుగానీ రెండు బుట్టలుగానీ కావడి బద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగ్రహాలను వుంచి పశుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించుతారు.

బొమ్మల చిత్ర పటం:

ఆ కావడి కొమ్ముకు మూడు గజాల చిత్రపటాన్ని, ఒక ప్రక్క కావడి కొమ్ముకు తగిలించి, కాశీ విశ్వనాథుని సందర్శనాన్ని గురించి వారు ప్రయాణించే దీర్ఘ ప్రయాణంలో దర్శించే క్షేత్రాలను గురించీ, పూర్వ కాలంలో కాశీయాత్ర చేయాలంటే ఎంత కష్టమో ఈ కథ ద్వారా వినిపిస్తారు.

యాత్రికులు బయలు దేరిన దగ్గర నుంచీ, కాశీకి పోయే దారిలో, అడవుల్ని గిరించి, ప్రకృతి వర్ణన గురించీ, క్రూర మృగాల అర్భాటాలూ, నదీ ప్రవాహాలూ, సత్రాలూ, దొంగల దోపిళ్ళూ, మజిలీలూ, ఇతర యాత్రా స్థలాలూ, పర్వతాలలో ప్రయాణం, చివరికి కాశీవిశ్వనాథుని సందర్శనం. ఈ మధ్యలో వచ్చే బాధల్ని గురించీ, క్రూర మృగాల బారినుండి తప్పుకోవడం గురించీ, వరుస క్రమంలో కథను నడుపుతూ ఆ కథా సంవిధానంలో అన్ని రసాలనూ చిత్రిస్తూ, చివరికి అన్ని కష్టాలనూ అధిగమించి, కాశీ విశ్వేశ్వరాలయానికి చేరి ముక్తి పొందడంగా దీనిని జీవితానికి అన్వయించి, మనం స్వర్గానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఈ కష్టాలను ఉదాహరణగా చెపుతారు. కథకుడు ద్విపద నడకలో కథను బహులబ్జుగా నడుపుతాడు.

ప్రజల మధ్యలో పగటి వినోదం:

ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత్ర కథా విధానం, పగటి పూట ప్రజల మధ్యనే జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లోనే జరుగుతుంది. కథా కాలం కనీసం అరగంట సేపు ఉంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు మ్రోగించుకుంటూ నడి బజారులో కావడి దించి, కథకుడు కథను ప్రారంభిస్తాడు. పిల్లా జల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్దవాళ్ళు ఆతరువాత స్త్రీలూ అందరూ కావడి చుట్టూ మూగుతారు.

ఆ రోజుల్లో కాశీ క్షేత్రాన్ని సందర్శించడమంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినట్లే. ధనవంతులు తప్ప ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించలేకపోయేవారు. ఈ చిత్ర కథావధానం ద్వారా, వారు కాశీక్షేత్రాన్ని చూసి నట్లే అనుభూతి చెందేవారు.

కథాంతానికి అందరూ రస సిద్ధిని పొందే వారు. ఆధ్యాత్మిక చింతనతో, తృప్తి పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్టచెప్పేవారు.

ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీథికి బయలుదేరేవాడు. వీ బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి అతి సుందరంగా వుంటాయి. అవి బందరు కలంకారీ బొమ్మల రంగుల్లో వుంటాయి.

బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజనులందరికీ ఈ కథావిధానం సుబోధకంగా వుండేది. వీరు కేవలం కాశీ మహత్తునే కాక ఆ యా జాతుల మతాల వారి దేవతలను గురించి దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆనాడు ఈ చిత్ర కథా విధాన్నాన్ని కాశీకావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భక్తి "శ్రద్దలతో చెప్పే వారు. వినే వారు కూడా అలాగే వినే వారు. అయితే రాను రాను ఈ కళారూపం భక్తినీ, ముక్తినీ ప్రభోధించేకంటే భుక్తికే ప్రాధాన్య మిచ్చి వ్వాచక వృత్తిలో దించేశారు.

కాశీకి పోయాను రామాహరి:

కాశీ కావడి కళారూపం ఈనాడు అంతగా ప్రచారంలో లేక పోయినా, అక్కడక్కడా ఈ కావడి ప్రదర్శనంతో బ్రతుకు తున్న వారు కూడా కనిపిస్తారు.

బ్రాహ్మణ వేషాలతో కావడిని మోసుకుంటూ బజారున పడి కాశీకి పోయి వచ్చామనీ, గంగతీర్థం తెచ్చామనీ, కాశీవిశ్వేశ్వరుని పటాలు చూపిస్తూ వుంటారు. ఇలాంటి వారిని గురించి, వెలువడిన జాన పద గేయం ఈ విధంగా వుంది.

కాశీకి పోయాను రామా హరీ
కాశి తీర్థమే తెచ్చాను రామా హరీ
కాశీకి పోలేదు రామా హరీ
వూరి కాల్వలో నీరండి రామాహరీ
కాశీకి పోయాను రామహరీ
కాశీ వీభూతి తెచ్చాను రామాహరీ
కాశీకి పోలేదు రామాహరీ
వీడి, కాష్టంలో బూడిదండీ రామాహరీ
పంచేంద్రియాలూ రామాహారీ
నేను బంధించి యున్నాను రామాహరీ
కొంచెము నమ్మినా రామాహరీ
కొంప ముంచి వేస్తాడండి రామాహారీ
ఆలు బిడ్దలు లేరు రామాహరీ
ఆత్మ యోగే నండి రామాహరీ
ఆలుబిడ్డ లెల్ల రామాహరీ
వీనికా యూరనున్నారు రామాహరీ

అంటూ కాశీయాత్రను వ్వంగ్యంగా చిత్రించి చుట్టూ మూగిన పూరి జనాన్ని నవ్వించి, ఆ విధంగా పారి తోషికాలను పొంది బ్రతుకు వెళ్ళబుచ్చుకునే వారు.

పూర్వ కాలంలో చాల మంది మోక్షం కోసం, పుణ్యం కోసం కాశీయాత్రలు చేసేవారు. ఈనాడు కాశీయాత్ర అంత కష్టమైన పని కాదు.

ఈ కాలంలో బ్రతకడం కోసమే, కాశీ కావడి ప్రదర్శనాల నిస్తున్నారని లక్ష్మీకాంత మోహన్గారు అంటున్నారు.