Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/సంతోషాల వసంతోత్సవాలు

వికీసోర్స్ నుండి

సంతోషాల వసంతోత్సవాలు

వసంతోత్సవం ఋతు సంబంధమైన పండుగలలో ఒకటి. వసంత కాలంలో మన్మథుని గురించి వుత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం గురించి వాత్సాయనుని కామసూత్రాల్లోనూ, శ్రీ హర్షుని రత్నావళి నాటకంలోనూ, కాళిదాసుని మాళవికాగ్ని మిత్ర నాటకంలోనూ ప్రస్తావించబడింది. ముఖ్యంగా రత్నావళి నాటకం ఈ వసంతోత్సవంతోనే ప్రారంభమౌతుంది.

ఆంధ్రదేశంలో ఈ మదన మహోత్సవానికి, వసంత మహోత్సవమనీ, కాముని పండగనీ పాల్గుణ శుద్ధ పూర్ణిమకు కాముని పూర్ణిమ అనీ పేరు. 14 వ శతాబ్దానికి పూర్వం ఈ వసంతోత్సవాలు ఏ విధంగా జరిగేవో తగిన ఆధారాలు లేవు. కానీ కొండవీటి రెడ్డి రాజుల కాలంలోనూ, ఆ తరువాత కాలంలోనూ ఈ వసంతోత్సవాలు ఎలా జరుపబడుతూ వుండేవో తెలుసు కోవడానికి, శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోనూ, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక లోనూ వసంతోత్సవాలను గురించి విపులంగా వర్ణించబడింది.

వసంత శోభలు:

ఆ కాలంలో వసంతోత్సవాలకు రాజ నగరునూ, నగరుకు వెలుపలనున్న వుద్యానవనాన్నీ మనోహరంగా అలంకరించి, వుద్యానవనంలో ఒక పూజా మండపాన్ని వివిధ దేవతలకు పూజా వేదికలను నిర్మించి, తోరణాలతోనూ: పుష్పాలతోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ వైభవంగా పూజా మండపాన్ని అలంకరించి; రతీ మన్మథులను, లక్ష్మీ, విష్ణువులను, శివ పార్వతులను, దేవేంద్రుడు, శచీ దేవి, వసంతుడు, విఘ్నేశ్వరుడు మొదలైన విగ్రహాలను వేదికలమీద వుంచి, మహారాజు అశ్వారూఢుడై మంత్రుల, సామంతులు, దండ నాయకులు, పురోహితులు, విదూషకులు, పురజనులు వెంటరాగా బ్రహ్మాండమైన మంగళ వాయిద్యాలతో ఉద్యానవనానికి బయలుదేరేవాడు.

కప్పాలూ, కానుకలు:

ఈ విధంగా ప్రారంభమైన వసంతోత్సవంతో వారి వారి విద్యల్ని ప్రదర్శించి పారి తోషికాలు పొందటానికి నటీనటులు, శిల్పులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు మొదలైన అనేక మంది కళాకారులు హాజరయ్యేవారు. రాజ్యం నలుమూలల నుంచీ ఈ వసంతోత్సవాలను తిలకించడానికి ఆబాల గోపాలం కదలి వచ్చేది. ఆ నాటి వసంతోత్సవాలు రాజుకు, ప్రజలకు పండుగగా మారింది.

ఉత్సవం ఈ విధంగా సాగుతూ వుండగా రాజుకు, సామంత రాజులూ,

మండలేశ్వరులూ మొదలైన వారు కానుకలనూ, కప్పాలనూ ఈ సందార్భంలో చెల్లించే వారు. విదూషకులు వినోదగోష్టి జరిపేవారు. రాజు వెంట వచ్చిన సుందరీ మణులు వనంలో ఉయ్యాలలూగుతూ, ఏలపాటలతోనూ, జాజర పాటల తోనూ కాలక్షేపం చేసేవారు. రాజు రాజులతో కలిసి; మన్మథునీ, తదితర దేవతలనూ పూజించి బ్రాహ్మణ దంపతులకు కర్పూర తాంబూలాలను సమర్పించేవారు.

రంగుల వసంతం:

తరువాత రాజు చందనాది సుగంద ద్రవ్వాలనూ, కర్పూర నీరాజనాలనూ వినోద ప్రారంభానికి చిహ్నంగా జన సమూహంపై చల్లేవాడు. ఆ తరువాత జన సమూహం ఒకరిపై మరొకరు పరిమళ ద్రవాలను రంగులతో కలిసి వసంతాన్ని చల్లుకొని వావి వరుసలు లేకుండా తటాకంలో దిగి జల క్రీడలతో విహరించేవారు.

కళాకారులకు, ఘన సత్కారం:

ఆ తరువాత మహారాజు.... నిండు కొలువులో గాయకులకు, శిల్పులకు, నట్టువరాండ్రకు, నటీ నటులకు బహుమానాలను సమర్పించి, పండితులను వేద పఠనాల మధ్య సన్మానించి, ఆనాటి రాత్రంతా...జాగారం చేసేవాడు. నాటక ప్రదర్సనాలతోనూ సంగీత నృత్యాలతోనూ తెల్లారేది.

రెడ్డిరాజుల్లో ఆనవేమారెడ్డి, ప్రప్రథమంగా ఈ వసంతోత్సవాలను ప్రవేశపెట్టాడు. ఆనాటి నుండి రెడ్డి సామ్రాజ్యంలో వసంతోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూ వుండేవి. ఆ మహోత్సవ సమయాలలో కర్పూరాది పరిమళ ద్రవ్వాలను వెదజల్లడం వలన అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజులకు, వసంత రాయ, కర్పూర వసంత రాయ బిరుదులు కలిగాయి; రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు, జాతీయ వుత్సవాలుగా జరిగేవి. విజయనగర రాజుల కాలంలో కూడా ఈ వసంతోత్సవాలు, ముమ్మరంగా జరుగుతూ వుండేవి.