తెలుగువారి జానపద కళారూపాలు/ఉరుమును మించిన ఉరుముల నృత్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉరుమును మించిన ఉరుముల నృత్యం

చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళా రూపాల ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల నృత్యం ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడల్లో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చనివీ

TeluguVariJanapadaKalarupalu.djvu

శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించుకుంటూ దేవాలయ ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య ధ్వని ఉరుమును పోలి వుండవచ్చును. అందువల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేసి వుండవచ్చు.

రాయల కాలంలో:

విజయనగర సామ్రాజ్య కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్భై కుటుంబాల దాకా ఉరుములవారు అనంతపురం జిల్లాలో వున్నారు. వీరిని ఉరుములోళ్ళు అని కూడ పిలుస్తారు. వీరు మాల తెగలో ఎక్కువగా వున్నారు. ఉరుము అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.

ఉరుముల వాయిద్యం ఒకేసారి ఏకధాటిగా వాయిస్తే కారుమొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్తమౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది.

ఒక చేత వీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళయుక్తంగా సాగుతాయి.

వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్మ్య గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:

వాయిద్యపు తీరు:

వాయిద్యాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు:

బూర్ బూర్ బూర్ బూర్
డబు డబు డబు డబు
యరడడ్డ బూర్ బరడ్డ్
డబు డబు డబు డబు

అని వాయిస్తూ పుల్లలతోనే చేతులెత్తి ప్రేక్షకులకు నమస్కారం చేసి పరాకు పరాకు అనే వచనాన్ని వల్లిస్తారు. తరువాత డప్ డప్ డప్; డప్ డప్ డప్; డప్ డప్ డప్ అంటూ వాయిస్తూ అందరూ వలయాకారంగా వుంటూ రెండు కాళ్ళను పెనవేసుకుంటూ శరీరాన్నంతా వూపుతూ ఎగురుతూ నృత్యం చేస్తారు. ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క ఎగురు ఎగురుతూ మధ్య మధ్య, ఆహా, ఓహో అంటూ ఉరుములను ఉధృతంగా వాయిస్తారు.

కుంకాలాట:

ఉరుములు వాయిస్తూనే కుంచెల నృత్యం చేస్తారు. దీనిని కుంకాలాట అంటారు. నెమలి ఈకలతో కుంచెల్ని తయారు చేసుకుంటారు. ఈ కుంచెల్ని రెండు చేతులతో తల మీద వుంచుకుని వరుసగా నిలబడతారు. వీరు బావిలో మునిగి స్నానం చేసి వస్తారు. ఉరుము వాయిద్య సాగుతుండగా కళ్ళు మూసుకుని వుంటారు. ఉరుములోళ్ళు వారికి పూనకం తెప్పించటానికి ఉరుముల వాయిద్యాన్ని దద్దరిలచేస్తూ ఇలా మేలు కొలుపు పాడుతారు.

మేలుకొనవే వో మేలుకొనవే
అమ్మ నీవు పుట్టక ముందేనాడు
యిగము లేడూ జగము లేడూ......................॥మే॥

అమ్మ మచ్చు మాయల వో గంగి నీవూ
పీనిగెలు తినే పిశాచివో
సామి గంగ లేని వో తానమే లేదు....................॥మే॥

గంగ లేని వో జలకమ్మే లేదు
సామీ నీవు పుట్టక ముందేనాడూ
నరుడు లేడు నారాయనుడే లేడు.....................॥మే॥

పాట అవగానే కుంచెలు పట్టుకున్న వారంతా వూగటం ఒక్కొక్క అడుగు వెనక్కి, ముందుకు వేయటం చేస్తుండగా చుట్టూ చేరిన జనం బండారు కుంకాన్ని చల్లుతారు. పూనకంలో వున్నవారు వాయిద్యానికి తగినట్లు అడుగులు వేస్తారు. అలా అడుగులు వేసివేసి అలసి పోయిన వారి నోటిలో ఒక నిమ్మపండు నోట్లో పెడతారు. కుంచెలు పట్టుకున్న వారి మీద బండారు కుంకాన్ని చల్లుతారు. గుడ్డలన్నీ రక్తసిక్తమై, వారంతా యుద్ధ వీరుల్లాగా కనిపిస్తారు. ఈ భంగిమల్లో నొక్కి అద్భుతంగా రౌద్రంగా అనిపిస్తాయి. కంటి గ్రుడ్లను పెద్దవి చేస్తూ, భ్రమ అభినయిస్తారు. ఉరుములోళ్ళు గాట్టిగా, ఏయ్, జోహో ఓహో అంటూ లయాత్మకంగా అరుస్తారు. అదొక వీరనృత్యమనీ ఆ నృత్యానికీ, పేరణికీ చాల పోలికలున్నాయనీ డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డి గారు వారి జానపద నృత్య కళలో ఉదహరించారు.

ఇలా వారు గంగ కథను ఎక్కువ చెపుతారు:

పరాకు పారాకు యచ్చరిక పరాకు
మనవాలకించు మందన పుడితివమ్మ
మాయారి గంగ
దొడ్డన పుడితవమ్మ - దొన కొండ గంగ
గంగలేని తానంబు లేదు
గంగ లేని జలకమ్ము లేదు

గంగ లేని వుతకమ్ము లేదు
గంగ లేని నంది లేదు
నీవు లేని తలము లేదమ్మ
పన్నెండు అత్తాలు గలవు
బాగిరతి నలవీర గంగవో హ హో

ఇలా పాడుతూ చివరికి:

పెద్దల కిచ్చిన వరము చిన్నలకి తప్పునంటివి
చిన్నల కిచ్చిన మాత శిశుబాలలకు తప్పనంటివి
శిశుబాల కిచ్చిన మాట కసి కందులకు తప్పనంటివి
మనవాలకించు మాయదండ మెప్పో

TeluguVariJanapadaKalarupalu.djvu

పై పాట పాడుతున్న సమయంలో అప్పుడప్పుడు అడుగులు ముందుకు వేయటం, వెనక్కి వేయటం చేస్తూ వారి అంగిక చలనానికి అనుగుణంగా ఉరుమును మలుచుకుని వాయిస్తూ వుంటారు. మరో పాటలో,

నేనే వస్తారా బీరన్నా, నేనే వస్తారా, కన్న తండ్రి
నల్లగొర్ల నేను మందాయిలోన నమ్మకాలు నేనే చెబుతాను
నేనే వస్తారా బీరన్నా నీకు నేనే వస్తారా ॥నేనే॥

ఇలా కథను నడుపుతూ దరువులు వేస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తారు.

పతాక సన్నివేశం:

ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని వారు దూరంగా నుంచుంటారు.

పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగిపోతారు ప్రేక్షకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావభావాలు చూడవలసిందే కాని వ్రాయ నలవికాదు.

చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంగళం పాటలో ఒక్కొక్క దేవత పేరు చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కుతారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేస్తారు.

ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది దేవతల్ని వేడుకొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత పేరు చెప్పటం, రెండు చేతులెత్తి మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూర్తి కాగానే బండారు బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళి పోతారు.

కళాకారులు:

ఈనాడు అనంతపురం జిల్లాలో వురుముల కథల్లో పాల్గొనే కళాకారులు ఉరుముల నారాయణ__ ఉరుముల నారాయణ స్వామి__ వురుముల నాగన్న__ ఉరుముల చంద్రప్ప__ ఉరుముల ఆంజనేయులు మొదలైన వారు కళను ప్రచారం చేస్తూ, దేవతల కొలువులు చేయిస్తూ

TeluguVariJanapadaKalarupalu.djvu

జీవితాలను సాగిస్తున్నారు. ఇలా ఉరుములోళ్ళు ధర్మవరం, సుబ్బారావు పేట, ముస్టూరు, గూగూరు, మేడాపురం, రేగాటిపల్లె మొదలైన చోట్ల వున్నారు. ఈ మాదిరి ఉరుముల బృందాలు ఆంధ్రదేశంలో మరెక్కడా లేవు.