తెలుగువారి జానపద కళారూపాలు/కోకొల్లలుగా కోలాట నృత్యాలు

వికీసోర్స్ నుండి

కోకొల్లలుగా కోలాట నృత్యాలు


ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.

కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.

కోలాట ప్రస్తావన:

పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక జానపద కళా రూపాలను వర్ణిస్తూ కోలాటాన్ని కోలాట గొడియ అని వర్ణించాడు. ఇతర నృత్య విశేషాలను వర్ణించినంతగా కోలాట గొడియను గురించి అంత గా వివరించనందువల్ల సోమనాథుని కాలానికి కోలాటం అంతగా అభివృద్ధి పొందలేదని వూహించవచ్చు. కాని విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోలాటాలు ప్రసిద్ధంగా ప్రదర్శించినట్లు విదేశీ యాత్రికుడైన అబ్దుల్ రజాక్ వర్ణించిన విషయం తెలిసిందే.

ఈ నాటికీ విజయనగర శిథిల శిల్పాల గోడల మీదా, శ్రీశైలం దేవాలయ ప్రాకారపు గోడలపైనా కోలాటం వేసే నర్తకీ మణులు కోలాటపు శిల్పాలు చిత్రించబడివున్నాయి.

కోలాట నిర్వచనం:

కోలాట అనే శబ్దం కోల+ ఆట అనే రెండు దేశ్యాలయిన విశేషాల శబ్దాల కలయిక వల్ల ఏర్పడిందని, కోల అంటే కర్ర పుల్ల అని అర్థమనీ, కట్టియ, పుడక, కట్టె అనేవి పర్యాప పదాలనీ, ఆట శబ్దానికి తాండవం, నటనం, నృత్యం, నాట్యం, లాస్యం, నర్థనం, నృత్యం, క్రీడ విహారం అనేవి పర్యాయపదాలనీ.

కోలాటం అంటే పుల్లలతో నటనం, లేక నర్తనం, లేక తాండవం అని చెప్పవచ్చుననీ, అంటే రెండు చేతులతోనూ కర్ర ముక్కలు పట్టుకొని పదాలు పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్ర ముక్కను వేరొకరి చేతి కర్ర ముక్కలతో తాకించే ఒక ఆటనీ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారి జానపద విజ్ఞానగ్రంథం 76 వ పేజీలో వివరించారు.

డా॥వేంకటేశ్వర్లు గారు కోలాట ప్రక్రియను చక్కగా పరిశోధించినవారు. వారి అభిప్రాయలనే ఇక్కడ పుదహరిస్తున్నాను. వారి కృషికి నా ధన్యవాదాలు.

రూపాంతరాలూ - పర్యాయ పదాలూ:

ఈ నాడు మనం కోలాటంగా చెప్పుకునే కళారూపానికి పర్యాయ పదాలూ, రూపాంతరాలూ, అనేకం వున్నాయి. కోలాట పదానికి హల్లీసకమనీ, ఉద్దితమనీ, కొట్టమూ, దండలాసకం, దండ నర్థనం అనే పర్యాయపదాలున్నాయి.

అలాగే కోలాట పదానికి, కోలాటలు, కోలు, కోలన్నలు, కొట్టమాట, కోలన్న అనేవి రూపాంతరాలు.

ఆడటం, పాడటం:

ఆటలో ఆసక్తి కలిగిన కొంత మంది ఆటగాళ్ళు బృంద నాయకుని అధీనంలో బృందంగా ఏర్పడి, కోలాట నృత్యాన్ని నిర్వహిస్తారు. ముందు అందరూ వలయా కారంగా నిలబడతారు. ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. వారు ప్రదర్శన ఇచ్చే స్థలాన్ని గరిడీ అని పిలుస్తారు. వలయంగా నిలుచున్న కళాకారులు ఇద్దరు చొప్పున ఒకరి కొకరు ఎదురుగా నిలబడతారు. వారు పట్టుకున్న చిరుతలను లయబద్దంగా కొడతారు. వేగాన్ని పెంచడానికి జట్టు నాయకుడు ఇట్తయ్యకుడు దద్ధిమితా అనడంతో లయ, తాళం మారిపోయి వలయంలో వున్న వారు కొందరు లోపల వలయంగానూ, మిగిలినారు వెలుపలి వలయంగానూ మారుతారు.

ఆట మొదలు:

అప్పటితో ఆట ప్రారంభం అవుతుంది. ఇద్దరు ఇద్దరు కలిసి పట్టుకున్న పుల్లలను విడి విడిగా చేతుల్లోకి తీసుకుని కొట్టడంతో ఆట ప్రారంభమౌతుంది. అప్పుడు జట్టు నాయకుడు లయను సరి జేస్తాడు. కొన్ని ప్రాంతాలలో తాకా, తాకా, తాకా తాకా, తాకా తయ్యకు దిద్దిమి అని లయను సరిదిద్దుతాడు. మరి కొన్ని ప్రాంతాల్లో తకిటదిమిధిమిం, ధిమితధిమిధిం అంటూ ఎంత మంచి గురుడు దొరికేనే అనీ మరి కొన్ని ప్రాంతాలలో లాలి, లాలి, లాలి, లాలి__ లిలాయలో, లలిలాలి, లిలోయ్ లో లలీ, లాలి, ఎలాయ్ లో అని మరికిన్ని ప్రాంతాలలో కోలు, కోలు, కోలే, కొలన, కోలు, కోలోయ్, కోలు, కోలు, కోలే కోలన్న కోలు, కోలోయి అని లయను సరిదిద్ధుతారని వెంకటేశ్వర్లు గారు తమ జానపద విజ్ఞానంలో వివరించారు.

ఇలా లయను సరిదిద్దిన తరువాత ఒక పాటను ప్రారంభిస్తారు. ఆ పాటతో పాటే ఒక కోపును మొదలు పెడతారు. పాట పూర్తి అయిన తరువాత ఆ కోపులోనే సంవాద రూపంలో వున్న మరొక పాటతో ఉసెత్తుకుంటారు. ఉసెత్తు కోలాటం మారిన తరువాత ఆటను, పాటను ఇట్తయ్యకు తద్దిమిత్త అని జట్టు నాయకు డిచ్చిన ముక్తాయింపుతో నిలుపు చేసి తరువాత ఇంకో పాటను, ఇంకో కోపును ప్రారంభిస్తారు. ఇలా బాగా అలసిపోయే వరకూ కోపులు ఆడి, ఆ రోజుకు కోలాట ప్రక్రియను ముగిస్తారు. ఇదీ కోలాట మూల రూపం.

కోలాటానికి కొన్ని కావాలి:

కోలాట ప్రక్రియకు, జట్టు, జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి, ఉద్ది, కోపు, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపు, ఇంతే గాక కోలాట కర్రలు, గజ్జెలు, అందెలు, కొరడా, వాయిద్యాలు, వెలుగు సాధనాలు కోలాటానికి పనికి వచ్చే వస్తువులు.

జట్టు జట్టు నాయకుడు:

కోలాటం ఆడే ఆటగాళ్ళందరినీ కలిపి జట్టు అంటారు. జట్టు అంటే గుంపు లేక సమూహము అని అర్థం చెపుతారు. ఈ జట్టులోని ఆటగాళ్ళు జట్టు నాయకుడు వుంటారు. జట్టులో సభ్యులు సరి సంఖ్యలోనే వుంటారు. బృంద సభ్యులందరూ గురువు చెప్పే మాటకు కట్టుబడి క్రమశిక్షణతో మెలగుతారు.

జట్తు నాయకుణ్ణి కోలన్న పంతులనీ, పెన్నుద్ది అనీ, ముందు పాటగాడనీ, అయ్యవారనీ, మేళగాడనీ వివిధ పేర్లతో పిలుస్తారు. గరిడీ ఏర్పాటు చేయడానికి, ఆట ముగించటానికీ, జట్టు నాయకుడిచ్చే

సంజ్ఞల మీదే ఆధారపడి వుంటుండి. గరిడీకి స్థలాన్నీ నిర్ణయించడం లోనూ, ప్రారంభించడంలోనూ ప్రారంభించడానికి సమయం నిర్ణయించడానికి ఆయనకే అధికారం.

జట్టు నాయకుడు...లయ, తాళం, పాటలు, ఆట బాగా తెలిసిన వాడై యుండాలి. వికలాంగులు జట్టు నాయకుడుగా పనికిరాడు. ఆరోగ్యవంతుడైన వానినే జట్టు నాయకునిగా ఎన్నుకుంటారు. కోలాట జయ ప్రదానికి జట్టు నాయకుడే ముఖ్యుడు.

ఆటగాళ్ళు ఇరవై మంది నుంచి, నలబై మంది వరకూ వుంటారు. వీరు సరి సంఖ్యలోనే వుంటారు. ప్రతి ఆటగాడూ రంగు రంగుల కోల కర్రలతో, కాళ్ళకు గజ్జెలతో, రంగు రంగుల చొక్కాలతో, పంచెలతో చూడ ముచ్చటగా వుంటారు. సామాన్యంగా వెలుపలగాని, గ్రామ మధ్యలో వున్న ఖాళీస్థలాల్లోగాని గరిడిని ఏర్పాతు చేస్తారు.

ఉద్ది:

ఉద్ది అంటే జత. సమానులుగా వుండే సముదాయం, జట్టు, సాంగత్యం, చెలిమి అనే అర్థాలు, జత, జంట అనేవి రూపాతరాలు... ఎదిరి. పోటీ వాటు, సమానము_ సాటి_ అనే అర్థాలున్నాయి. అంటే ఇద్దరు ఆటగాళ్ళను కలిపి ఉద్ది అంటారు. కోలాటంలో ఇలాంటి కొన్ని వుద్దులుంటాయి. ఉద్దిలోని వారిని ఉద్దికాడు అని అంటారు. ఏకవచనంలో దుద్దివాడు, ఉద్దికాడు అంటారు. అంటే జతకాడు; చెలికాడు, మిత్రుడు అనే అర్థాలు కూడా వున్నాయి. ఉద్దికాళ్ళందరిపైన వుండే వాణ్ణి పెన్నుద్ది లేక జట్టు నాయకుడు అంటారు. కానీ కోలాటంలో జట్టు అంతకీ ఒక పెన్నుద్ది వుంటాడు. అందుకే అతనిని జట్టు నాయకుడూ అంటారు. జట్టు నాయకుని ఆజ్ఞమేరకు కోలాటంలో ఈ ఉద్దీలు ఏర్పడటం., విడిపోవటం జరుగుతుంది. ఉద్దీలుగా ఏర్పడిన తరువాతనే ఆటలో కర్రలు కలపటం మొదలు పెడతారు.

కోపులు:

కోపు అంటే నాట్యం, నాటకం, తీర్పు, నాట్యగతి విభేదం, ఆట, నాట్య గతి విశేషం అనే అర్థాలున్నాయి. కోలాటంలో అనేకమైన గతి భేదాలనే కోపులంటారు. ఈ కోపులకు పాటలోని మొదటి చరణాన్ని బట్టీ, గతికి తగ్గ భావంతోనూ, పురాణ పురుషులైన కృష్ణ, రామ మొదలైనవారి పేర్లతో పేర్లు పెడతారు.

ప్రాంతాలను బట్టి కోపుల పేర్లూ మారుతూ వుంటాయి. పలనాటి సీమలో ప్రార్థన కోపు _ ఉద్ది తిరుగుడు కోపు _ వరగత్తెర కోపు _ కృష్ణ కోపు _ చెలియ కోపు _ కంస కోపు _ జడకోపు, భారత కోపు _భామ కోపు _ లాలి కోపు _ లంకె కోపు _ కలువ రాయ కోపు మొదలైనవి వున్నాయి.

కోలాటంలో పాటనూ, పాట తోపాటు ఆటను మొదలు పెట్టటం ఎత్తుగడ అంటారు. అందరూ వలయంగా ఏర్పడి దేవతలకూ, దేవుళ్ళకూ, రాజకీయ నాయకులకూ జై కొట్టి, వారి వారి కిష్టమైన ప్రార్థనలు చేసి _ ఇట తయ్యకు తాధిమిత, అనడంతో ఆట ప్రారంభమౌతుంది__ ఎత్తుగడ నుంచి పాట ఆట వేగాన్ని పుంజుకుంటుంది.

ఉసెత్తుకోవడం:

కోలాటంలో రెండవ కాలం నుంచి మూడో కాలానికి వెళ్ళడాన్ని ఉసెత్తుకోవటం అంటారు. అప్పటివరకూ నెమ్మదిగా చిరుతలు కొడుతున్న ఆటగాళ్ళు ఒక్క సారిగా హుషారుగా, ఎగురుతూ, పాడుతూ, పాట కనుకూలంగా అడుగులు వేస్తూనే కోలాటం వేయటాన్ని ఉసెత్తుకోవటం అంటారు. దీనినే త్వరితం ఉసి _ దుడుకు అని కూడ అంటారు. ఇలా ఆటలో ఉసెత్తుకోవడం ప్రేక్షకులను ఎంతో ఆనందపరుస్తుంది.

ముక్తాయింపు:

ముక్తాయింపు అంటే పాట, ఆట, ఒక దశకు చేరిన తరువాత ఆటను తెగగొట్టడం అంటారు. సామాన్యంగా ఇతతయ్యకు తాధిమిత, అనే చరణాన్ని గాని__కిటకిట తయ్యకు తద్ధిమిత అనే చరణాన్ని గాని వాడుతారు. ఈ చరణాన్ని ముక్తాయింపు చరణం అంటారు. తరువాత మరొక ఎత్తుడలో మరొక పాట, మరలా ఉసి, తరువాత ముక్తాయింపు. ఇలా కోపు కోపుకు ఎత్తుగడ, ఉసెత్తు ముక్తాయింపులు వుంటాయి.

కోలాట సామగ్రి:

కోలాట కర్రలు మొదట సన్నగానూ, మద్యలో ఉబ్బెట్టుగానూ, చివర సన్నగానూ వుంటాయి. పట్టు కోవడానికి వీలుగా పిడి వుంటుంది. ఈ కర్రలను చేవకలిగిన బిల్లుడు_ చండ్ర_ ఏపె_ రేల _ టేకు _ ఏగెస మొదలైన జాతుల చెట్లనుంచి కర్రలను ఎంచుకుంటారు.

ఈ కోలాటపు చిరుతలను చక్కగా చిత్రిక పడతారు. పిడివద్ద అందెలనూ, కోలచివర గజ్జెలనూ ఏర్పాటు చేస్తారు. కోలాటం వేశేటప్పుడు వీటి ధ్వని మధురంగా వుంటుంది. ఆటగాళ్ళందరు కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో జట్టు నాయకుడు కొరడాను భుజాన వేసుకుని ప్రదర్శనలో క్రమశిక్షణను పాటించని వారికీ, తప్పు చేసిన వారికీ ఈ కొరడా పక్కలో బల్లెంగా వుంటుంది. ఒక్కొక్క సారి అందరినీ హెచ్చరించడానికి మధ్య మధ్యన చెళ్ళుమనిపిస్తాడు.

అలాగే కోలాట బృందం మధ్యలో వాయిద్య గాళ్ళుంటారు. వారు మద్దెలనూ, హార్మోనియం, తప్పెట, తాలు మొదలైన వాటిని హంగుగా ఉపయోగిస్తారు. అలాగే కోలాట బృందం ఉసెత్తుగా నృత్యం చేసే సమయంలో, బృంద నర్తకుల్ని ఉత్సాహ పర్చటం కోసం రంగుల గులామునూ, పూలనూ, గంధాన్నీ, పన్నీరునూ చల్లుతారు.

రాత్రి ప్రదర్శనం:

రాత్రి, పగలూ కోలాట ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. ముఖ్యంగా రాత్రి ప్రదర్శనంలో గరిడి మధ్యలో ఒక పొడవైన కర్రను పాతి, పెట్రోమాక్సు లైటును పెడతారు. ఆ కాంతిలో బృందమంతా కనబడుతుంది. పూర్వం వెలుతురు కోసం కాగడాలనూ, ఆముదపు దీపాలనూ, కిరసనాయిలు పెద్ద బుడ్లునూ వాడే వారు. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో ఈ నాటికీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఆటగాళ్ళ అలంకరణ:

సమసంఖ్యలో అందరూ, అన్ని త్రాళ్ళు పట్టుకుని గుండ్రంగా నిలుస్తారు. వీరు రెండు పక్షాలుగా చీలుతారు. రెండు పక్షాలకూ ఇద్దరు నాయకు లుంటారు. వారు లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తరువాత మరొకరు వరుస క్రమంలో తిరగడంతో ఈ త్రాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది.

ఇలా జడను అల్లడం ప్రారంభించి, జడ పూర్తి అయ్యే వరకూ పాట పాడుతూ అల్లుతూనే వుంటారు. ఈ అల్లికలో ఒక్కరు తప్పుగా నడిచినా జడ చిక్కై పోతుంది. అందు వల్ల ప్రతి ఒక్కరూ వరుస తప్పకుండా నిపుణతతో జడను అల్లుతారు.

ప్రారంభంలో ఈ జడను అల్లడం నిదానంగా సాగుతుంది. తరువాత అతి వేగంగా అల్లబడుతుంది. ఈ వేగంలో కోలాట నృత్యం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా జడ కోపు పూర్తి అయిన తరువాత

అందరూ ఒక పుష్పాకారంలో దగ్గరకు చేరుకుంటారు. ఆ తరువాత జడను ఎలా అల్లుతారో అలాగా మరలా ఎదురు తిరిగి జడను విడదీస్తారు. జడను అల్లినంత కష్టం వూడదీయటంలో వుండదు. విడదీయటం అతివేగంగా జరుగుతుంది. ఈ విధానం ఎంతో కనుల పండువుగా వుంటుంది.

జడకోపులో బాలికలు:

ముఖ్యంగా జడకోపు కోలాటం బాలికలు వేయడం ఎంతో ఆనందంగా వుంటుంది. బాలికల్లో ఒకే ఎత్తు కలిగిన వారిని కోలాటానికి ఎంచు కుంటారు. అందరూ వాలు జడలు వేసి రంగు రంగుల పూలు ధరిస్తారు. ఒకే రంగుగల లంగాలు, చొక్కాలు తొడుగుతారు. రంగు రంగుల కోలాటపు చిరుతలు ధరించి వలయాకారంగా తిరుగుతూ వుంటే ఇంద్ర లోకంలో దేవతలు నృత్యం చేస్తున్నారా అనిపిస్తుంది.

గొంతులు కలిసిన ఇద్దరు బాలికలు పాట ప్రారంభిస్తే దళంలోని బాలికలందరూ ఒక్కసారిగా, గుమ్ముగా అందుకుంటారు. ఇలా పాడే బృందగానం, చెవుల కెంతో ఇంపుగా వుంటుంది. వీరి జడకోపు ప్రదర్శనం శాస్త్ర యుక్తమైన భరతనాట్యంలో ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ కోలాట నృత్యాన్ని ఒక వ్వాయామ క్రీడగా, ప్రతి సాయంత్రమూ డ్రిల్లు క్లాసులో వేయిస్తూ వుండేవారు. బాలికల కోలాటంలో ఆ రోజుల్లో ఇలా పాట పాడుతూ వుండేవారు.

పాట

ఆటవిస్తళముల కరుగుదు మా
వటపత్రంబులు కోయుదు మా
చందన గంధము తీయుదు మా
సఖియాజాక్షి మెడ పూయుదు మా
కోలాటంబులు వేయుదు మా
కోరిక తీరంగా మనము.

ఈ విధంగా బాలికలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రేక్షకులందర్నీ ముగ్దుల్ని చేస్తారు.

అలాగే మరి ఒక పాట గరుడాచల యక్షగానాన్ని చెంచులక్ష్మి - నరసింహ స్వామి సంతానాన్ని పోలిన పాట తెలంగాణా కోలాటంలో భార్యా భర్తల మధ్య జరిగే సంఘర్షణను సంవాద రూపంలో చిత్రిస్తారు.

భార్య భర్తల సంవాదం - కోలాట కీర్తన

భర్త: గట్టూకు బోయి నేను - కట్టే దెమ్మంటే
కొప్పౌకున్నా పూలు - ఎక్కడవే భామ - నీ
కొప్పునున్న పూలు - ఎక్కడివే భామ
అత్తేరి పూలు ఎక్కడివే భామ
ధూత్తేరి పూలు ఎక్కడివె భామ

భార్య: గాలి ధూళి వచ్చి - గంపంత్గ మబ్ బొచ్చి
కొమ్మ వూగి కొప్పు - నిండింది మొగుడా
నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు

భర్త: అన్నీ సరే కాని - ఇన్ని సరే కాని
చెంపనున్న కాట్లో ఎక్కడివె భామ?
అత్తేరి కాట్లు ఎక్కడివె భామ.
ధూత్తేరి ఎక్కడివే భామ
భార్య: కోమటోరింటికి - కొబ్బెరికి బోతేను
తక్కెట్లో గుండొచ్చి - తగిలింది మొగడా

తక్కెట్లో గుండొచ్చి - తగిలింది మొగడా,
నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు.

ఇలా ఎన్నో కోలాటపు పాటలు కోకొల్లలుగా వున్నాయి.

చుట్టుకోపు:
గోపిక, కృష్ణుల సంవాదం

గోపిక: గొల్లవారి వాడలకు కృష్ణమూర్తీ
నీవేమి పనుల కొచ్చినావు కృష్ణమూర్తీ................. ॥గొల్ల॥
కృష్ణుడు: పాలు కొనవచ్చి నానే గొల్లభామ
మంచి పాలు పోసి పంపించు గొల్లభామా:............. ॥గొల్ల॥

గోపిక: కొత్త కోడలనయ్య నేను కృష్ణమూర్తీ
మాఅత్తగారి నడుగుమయ్యా కృష్ణ మూర్తీ ..............॥గొల్ల॥

కృష్ణుడు: కొత్త కోడలైతే నేమి గొల్ల భామ
రొక్కమిస్త పుచ్చుకోవే గొల్లభామా

ఇలా సంవాదాలతో చుట్టుకోపు కోలాటం జరుగుతుంది.

ఇలా సాగిన ఆలాటి కోలాటాలు 1942 తరువాత కొత్త మలుపును సంతరించుకున్నాయి.

ఖండ ఖండాతరాల భరత మాతా ॥నీవు॥
ఖ్యాతిగన్న తల్లివమ్మ భరత మాతా ॥నీవు॥

అంటూ దేశ భక్తిని ప్రబోధించారు. కోలాటం ఒక సమిష్టి నృత్యం. అది ఒక సమిష్టి బృందగానం. అది ఒక వ్వాయమ క్రీడ. ఈ కోలాట నృత్యాలను ఈ నాడు తిరిగీ పునారుద్ధరించాల్సిన అవశ్యకత ఎంతో వుంది.