తెలుగువారి జానపద కళారూపాలు/హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు

వికీసోర్స్ నుండి

హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు


తెలుగు ప్రజలకు అన్ని పండగలకంటే మకర సంక్రాంతి చాల పెద్ద పండుగ. అది నెల రోజుల పండుగ, సంవత్సరమంతా కష్టించుకున్న పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న కష్టజీవులైన రైతులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండగ.

సంక్రాంతి శోభలు:

ధనుర్మాసం నెలరోజులూ గ్రామాలన్నీ శోభాయమానంగ్దా వుంటాయి. ప్రతి ఇంటిని అలికి సున్నాలు కొటి సుందరంగా అలంకరిస్తారు. నెలరోజులూ ఇళ్ళముందు రంగు రంగుల రంగ వల్లులను తీర్చి దిద్దుతారు. యువకులందరూ కోడి పందాల సరదాతో కోడి పుంజులను తయారు చేస్తారు.

సంక్రాంతి సంకేతం, హరి దాసులు:

ముఖ్యంగా సంవత్సర కాలంలో ఎప్పుడూ కనిపించని సంక్రాంతి హరి దాసులు కనిపిస్తారు. వీరు ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో ప్రతి ఇంటినీ పావనం చేస్తారు. తెల్ల వారి ఆరుగంటలకే స్నానం చేసి కాషాయ వస్త్రాలను ధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూల దండలను రుద్రాక్ష మాలలను ధరించి నెత్తిమీద నామాలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద పెట్టుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒక చేతితో చిరుతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యం చేస్తూ హరిలోరంగహరి అంటూ బయలుదేరి ప్రతి ఇంటి ముందూ పాట పాడుతూ నృత్యం చేస్తూ వుంటే, ఇంటి ఇల్లాలు గాని, పిల్లలు గాని, ఫల పుష్పాదులతో దోసెడు బియ్యాన్ని తీసుకువస్తే, హరిదాసు వినమ్రతతో మోకాటి మీద కూర్చుని అక్షయ పాత్రలో వేయించుకుంటూ వారిని పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించి మరో ఇంటికి సాగి పోయి, ఇలా వూరంతా పూర్తి చేస్తాడు.

తన్మయత్వంతో పాడే పాటలు:

ఇలా ఇంటింటికీ తిరుగుతూ తన్మయత్వంతో పాడే పాటల్లో ఎక్కువగా రామదాసు పాటలనే ఇలా పాడేవారు.

అదిగో భద్రాద్రీ, గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతా రామముదిత లక్ష్మణల
కలిసి కొలువగా రఘుపతి యుండెడి...................॥అదిగో॥

అలాగే

ఏ తీరుగ నను దయ చూచెదవో
యినవంశోత్తమ రామా, నాతరమా
భవసాగర మీదను నళినదళేక్షణ రామా................॥ఏ॥

అలాగే

ఏమీరా రామా, నావల్ల నేరమేమీరా రామా
ఏమీరా రామ యిలాగు కష్టము
నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలిశయన వేదండ రక్ష
శాఖండ తేజ నాయకుండవే...........................॥ఏమీరా॥

అలాగే.............

పలుకే బంగారామాయెనా
కోడండ పాణి పలుకే బంగారామాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుక వేమి
కలలో నీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రి............॥పలుకే॥


ఇలా భక్తి తన్మయత్వంతో పాటలు పాడుతూ గ్రామపౌరలను పరవశుల్ని చేస్తారు.

ఎందరో హరి దాసులు:

ఇలా ఒక్కరు కాదు. ఇద్దరు ముగ్గురు హరి దాసులు కూడ కోలాహలంగా పూరంతా వారి గానంతో ముంచెత్తుతారు. ఇలా వచ్చిన ప్రతి హరి దాసుకూ, భిక్షను అందచేస్తారు... ఇలా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడ గ్రాసాన్ని సంపాదించుకుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. వార్షికంగా ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు...దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.

గ్రామవీథుల్లో హరిదాసులిలా హరిభజనచేయడం కోలాహలంగా వుంటుంది. హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి...బాల బాలికలు పోటీలు పడతారు. హరిదాసులిలా ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వ దినాలలో, గంగి రెద్దులవారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి.

పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందర్నీ ఆదరిస్తారు.