తెలుగువారి జానపద కళారూపాలు/అందర్నీ ఆనందపర్చిన హరిహరీ పదాలు

వికీసోర్స్ నుండి

అందర్నీ ఆనంద పర్చిన హరిహరీ పదాలు

ఆంధ్ర జానపదగేయ సాహిత్యంలో హరిహరీ పదాలు కూడ ప్రముఖ స్థానాన్ని అలంకరిస్తున్నాయి.

హరి హరీ నారాయణ ఆది నారాయణా
కరుణించి మమ్మేలు - కమల లోచనుడ ॥హరి॥

హరిహరీ పదాలన్నీ ఈ పల్లవితోనే నడుస్తాయి. ఒకో ప్రాంతంలో, ఒకో పాటా, ఒకో ఆటా, ఒకో కథా, బహుళ ప్రచారంలో వున్నట్లే ఈ హరి హరీ పదాలు కూడ విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో విశేష ప్రచారాన్ని కలిగి వున్నాయి. ఈ పేరుతోనే అనేక కథలూ, సుద్దుల రూపంలోనూ చెపుతూ వుంటారు.

వీటినే జంపెలని కూడా అంటారు. హరిహరీ పదాల్లాంటి పాటలే మన యక్ష గానాల్లో కూడ చాలవరకు వ్రాయబడి వున్నాయి. పదాల నడక ప్రారంభం నుంచీ చివరి వరకూ ఒకే వరుసలో నడుస్తుంది. మధ్య మధ్య కథా గమనాన్ననుసరించి వచనంలో తేట తెల్లంగా కథ యొక్క అర్థాన్ని చెపుతారు. సన్ని వేశాలను బట్టి ఇంకా కీర్తనలు కూడా పాడుతూ వుంటారు. కథకుడు పదం పాడితే, మధ్య, ప్రక్కనున్న వంత దారులు ఆఁ__ అంటూ శ్రుతిలో దీర్ఘంగా సాగదీసి శ్రుతిపక్వంగా ఒక గమకాన్ని జత కలుపుతారు.

హరిహరీ పదాలు కేవలం ఎవో జానపద గేయాల్లాగా కాకుండా మన కళా రూపాల్లో అదీ ఒక కళా రూపంగా వెలుగొందుతూ వుంది. వీటి కథల్లో చాల వరకు రామాయణ, భారత కథలే ఎక్కువగా వున్నాయి. భారతం నుంచి నలచరిత్ర, శశి రేఖా పరిణయం, విరాట పర్వం; ఉత్తర గోగ్రహణం మొదలైనవే కాక పాతాళ హోమం శతకంఠ రామాయణం, కుశలాయకం మొదలైనవీ, శివ గాథలూ, గంగా వివాహం, సారంగధర చరిత్రా రాణిస్తూ వుంటాయి.

ప్రాతీయ కళారూపం:

హరిహరీ పదాలు ఎక్కువగా విశాఖ జిల్లాలోనే ప్రచారం పొందాయి. ఇతర జిల్లాలకు ఏమాత్రం వ్వాపించలేదు. అందుకు కారణం కూడ లేకపోలేదు. విశాఖ మండల ప్రాంతీయ భాష మనలకు చాల భిన్నంగా వుంటుంది. వారి మాట తీరు ప్రత్యేకంగా అదోలా వుంటుంది. మాండలికమైంది. అందువల్ల ఆ పదాలు ఇతరులు వ్రాయడం కూడ కష్టమే అందువల్ల ఆ మండలం వారే వారి ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే శైలిలో వ్రాస్తారు. ఇప్పటికీ వ్రాయబడిన పదాలన్నీ కూడ అటువంటివే. చీపురుపల్లి _రాజా _ పాలకొండ _ వీరఘట్టాం ఆముదాల వలస, శ్రీకూర్మం, విజయనగరం, శ్రీకాకుళం, మొదలైన ప్రాంతాల్లో ఈ కథలను రకరకాలుగా చెపుతారు. అన్ని కళా రూపాల కన్న ఈ హరిహరీ పదాలు - జముకుల కథలు ఎక్కువ ప్రచారంలో వున్నాయి.

ఈ హరిహరీ పదాల విషయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు గారు ఎక్కువ కృషి చేసి వ్రాశారు. కిన్నెర పత్రికలో వారి అనుభవాల నుంచీ సేకరణల నుంచీ కొన్ని ఉదహరిస్తాను.

మనకు దొరికే పదాలన్నీ ఇటీవలవే కాబట్టి, ఇవన్నీ చాలవరకు ఆధునిక పదాలు. ఈ పదాల వరుస లక్షణం ఒకటే. ఈ రకం పదాలలో స్వకపోల కల్పితాలు ఇంచు మించుగా నున్న ఇవన్నీ ఇతర రచనలను చూచి రచించినవేననీ, దీనికి కారణం చదువుకున్న వారు పురాణాలను ప్రబంధాలను చదివి ఆనందించగలరనీ నిరక్షరాస్యులకది సాధ్యం కాదనీ, కాబట్టి వీరి అంతస్తుకి తగిన రచనలు అవసరమనీ అందువల్ల జానపద కవులు ప్రాకృత జనుల కోసం పెద్ద గ్రంథాలలోనికి కథలనూ, భావాలనూ అనుసరించి పదాలుగా రచించారనీ, తామూ అలాగే చేస్తున్నామనీ కొందరు కవులు తెలియచేసారనీ కామేశ్వరరావు గారు అంటు కొందరు కవులను పేర్కొన్నారు. అందుకు వుదాహరణగా పూరి రామచంద్రరాజు కుశలాయక పదాన్ని వివరించారు.

కఠినంబు కాంచితే, కాపులకు తెలియది
మరుగులుంచుట మాన మాటలుంచితిని

అని అన్నాడు.

గంగా వివాహం:

గంగా వివాహ పదాన్ని పనగాడ సయాసి రాజు గారు 1856 వ సంవత్సరంలో రచించాడు. ఇది స్కాందపురాణం లోని కథ. కాని ఈ పద కవి, ఈ కథను తెలుగు దేశానికి అన్వయింప చేశాడు. ఏలూరులో శంభు దేవుడనే జాలరి పున్నాడనీ అతనికి గంగ జన్మించిందనీ శివుడు వచ్చి ఆమెను వలచి వివాహం చేసుకున్నాడనీ వ్రాశారు.

గంగ వివాహ కథ, పొంగి పారుతున్న గంగ తుంపరలు ఈశ్వరుని వెండి కొండ మీద పడగా ఈశ్వరుడికి కోపం వచ్చి, గంగను భూమిమీద పుట్టమని శపించాడు. భూలోకంలో శంభుదేవుడు చక్రమ్మ అనే దంపతులకు గంగ జన్మించింది. కయ్యాల మారి నారదుడు ఎరుకత వేషంలో వచ్చి గంగకి శివుణ్ణి గురించి చెప్పగా ఆమె శివుణ్ణి వలచింది. ఆ సంగతి తిరిగి వెళ్ళి శివుడికి చెప్పాడు. శివుడు జంగం వేషం ధరించి వస్తాడు. ఆ విధంగా గంగకూ శివునికి వివాహం జరుగుతుంది.

అమెను తలను ధరించి వెండి కొండకు వెళ్ళాడు శివుడు. కాని పార్వతికీ విషయం తెలుస్తుందేమోనని భయం. రహస్యం బయట పడింది. పార్వతికి కోపం వవ్చింది. శివుడు బ్రతిమాలాడాడు. అప్పుడు గంగకు కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళింది. ప్రపంచంలో ఎక్కడా నీటి చుక్క లేదు. పార్వతికి ఏ దారి దొరకక గంగను బ్రతిమలాడింది. అందరూ వెండి కొండకు చేరారు సుఖంగా వున్నారు.

సన్యాసి కవి గంగా వివాహంలో ఎన్నో వర్ణనలు వర్ణించాడు. ఈ కథలో సంభాషణలు అతి సహజంగానూ, సంవాదాలు చాల చమత్కారంగానూ వున్నాయి. గంగా గౌరుల సంవాదంలో కవి తెలుగు మాటల్ని చాల చమత్కారంగా వర్ణించాడు.

ఉదాహరణకు:

గౌరి॥ ఉన్న చోటను నున్న ఉండమన్నందుకు
తప్ప కను నీ జిహ్వ తరిగింతు గంగ

గంగ॥ నీవు తరిగిన కూర నేను తరిగిన కూర
వండి వడ్డింతుమే వనిత గౌరమ్మ

గౌరి॥ చెంప కాయలు గొట్టి చెవులూడదీతుగా
జగడ పోతుల మారి జాలారి గంగ

గంగ॥ నీవు గొట్టిన కాయ నేను గొట్టిన కాయ
గంప నింపింతుమే కాంత గౌరమ్మ.

గౌరికి కోపం రాగా శివుడు అర్థ నారీత్వాన్ని చక్కగా తెలియ చేశాడు. గంగకు మంగళ సూత్రం కట్టాడు.

సన్యాసి రాజు రచనలో నిండుగా లోకోక్తులు, నానుళ్ళు, జాతీయాలు వున్నాయి. శివుడు భార్యను గురించి చెప్పిన వాక్యాలు ఈ నాటి వారికి కూడ ఆదర్శ ప్రాయంగావున్నాయి.

ఎందరో హరిహరీ పదాలను రచించారు:

ఈ విధంగా హరిహరీ పదాలను ఎందరెందరో రచించారు. వారిలో కలగర్ల వేంకట కామయ్య "లక్ష్మణ మూర్ఛనూ" 1850 లో పసగాడ సన్యాసి రచించిన పదాలు "సారంగధర చరిత్ర" "శతకంఠ యుద్ధం" (శతకంఠ రామాయణం) గంగావివాహం మొదలైనవి రచించేడు. 1862 ప్రాంతంలో పూరి రామ చంద్ర రాజు కుశలాయక పదాన్ని రచించాడు.

అలాగే 1874 ప్రాంతంలో పూరి నారాయణ రాజు ధర్మాంగద చరిత్రను రచించాడు. 1922 లో మంధా సుబ్బరాయ శాస్రి 'పాతాళ హోమం' అనే పదాన్ని 1925 లో పొడుగు రామ బ్రహ్మ కవి "గయోపాఖ్యానం" "వైకుంఠ మహాత్యం" రచించాడు.

అయ్యగారి కూర్మనాథం 20 వ శతాబ్దంలో విరాట పర్వాన్ని పదంగా రచించాడు.

ఇలా పైడిగొండ అప్పన్న "సుభద్రా కళ్యాణం" చంద్రగిరి తాతయ్య "ఉత్తర గోగ్రహణం" ముడుంబ లక్ష్మణాచార్యులు "శ్రీ రామ కథను" 1895 లో రచించాడు. చిత్రాడ కామేశంసోంపుర వాసి - త్రినాథుని చరిత్ర - నడిమింటి రామ యోగి 1864 లో "బాణాసుర యుద్ధం" కటోజు వీరాచారి "భల్లాణ రాయపదం" చెర్విరాల బాగయ్య గారి పదం "కొమిరెల్లి మల్లకథ" వున్నాయి. ఈ విధంగా అనేక హరిహరీ పదాలున్నాయి.

పైన ఉదహరించిన హరిహరీ పదాల రచనలన్నీ, మన జానపద

కళారూపాలైన హరి కథలలోనూ, యక్షగానాలలోనూ, వీధి నాటకాలలోనూ, బుర్ర కథలలోనూ ఉదహరింపబడే వున్నాయి. అందువల్లనే మన జానపదులకు పూర్వ పురాణ గాథలన్నీ తేటతెల్లంగా తెలిసి పోయాయి.