తెలుగువారి జానపద కళారూపాలు/సీమవాసుల గొరవయ్యల నృత్యం
సీమవాసుల గొరవయ్యల నృత్యం
తలపైన ఎలుగుబంటి చర్మంతో తయారు చేసిన కిరీటం, ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో త్రిశూలం, మెడలో తెల్లని గవ్వల హారం, నడుము చుట్టూ జింక చర్మంతో అందంగా తయారు చేసిన సంచి.
అపురూపంగా కనిపించే ఈ వేషధారణం ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించక పోయినా, ఆనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంది. వీరి వేషధారణ చూసి పిల్లలు భయపడితే, పెద్దవారు ఆసక్తి చూపుతూ వుంటారు. ఇంతకీ వీరు పేరు "గొరవయ్యలు" అని పిలుస్తూ వుంటారు.
కన్నడ దేశంలో శివభక్తులైన వారు, శివునిపై పాటలు పాడుతూ, ప్రతి ఇంటిముందూ, నృత్యం చేసి భిక్షాటనతో జీవితం సాగిస్తున్న ... గొరవయ్యలు కొన్ని శతాబ్దాల నుంచీ భిక్షాటనే వృత్తిగా మలుచుకొన్నారు. ఒకప్పుడు శైవమత ప్రచారానికి అలవాలమైన ఈ కళారూపం ఈనాడు భిక్షాటన కళారూపంగా మారిపోయింది.
గతంలో కుల పెద్దలుగా వ్వవహరించిన వీరు పొట్ట కూటి కోసం, వీథుల్లో పడ్డారు. రాయలసీమలోని అతి ప్రాచీనమైన నృత్య కళల్లో ... గొరవయ్యల నృత్యం ఒక ఉత్తమ కళారూపం.
- రక్త తర్పణం:
కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం, ఆలూరు త్గాలూకా "నెరణిక" సమీపంలో వున్న మల్లేశ్వర స్వామి, కురవ కులానికి చెందిన కొంత మందిని గొరవయ్యలుగా సృష్టించాడనీ, వీరి అభిప్రాయం, ప్రతి సంవత్సరమూ దసరా పండుగలకు గొరవయ్యలంతా అక్కడకు చేరి విచిత్రమైన పద్ధతుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. వారి శరీరం నుంచి కొంత రక్తం ధారబోసి దేవునికి నైవేద్యం పెడతారు. వీరు నాట్యం చేసే పద్ధతి చాల విచిత్రంగా వుంటుంది. నృత్యాంతాన, కుక్కల మాదిరిగా అరుచుకుంటూ కొట్టుకుంటారు. వీరి సంతానంలో తప్పని సరిగా ఒక పిల్ల వాడికి నృత్యం నేర్పి, తమతో పాటు తిప్పుతారు.
- గట్టు మల్లయ్య కొండ:
గొరవయ్యలు కురువ వంశస్థులు, వంశంలో వున్న పెద్దకుమారుడు కానీ, చిన్న కుమారుడు కాని తప్పని సరిగా గొరవయ్య కావాలి. గొరవయ్యను తయారు చెయ్యాలంటే గురువు, లేదా గణాచారి అవసరం. గురువులు కర్నూలు జిల్లా ఆలూరులో గట్టు మల్లయ్య కొండలో ఉన్నారు, గణాచారులు అనంతపురం జిల్లా కాట్నే కాలవలో వున్నారు.
గొరవయ్య కాలంటే పిల్లవాణ్ణి గట్టు మల్లయ్య కొండ మల్లేశుని గుడికి తీసుకువెళతారు. అక్కడ కోనేటిలో స్నానం చేయించి, నల్ల కంబళి పరచి; కూర్చో పెడతారు. పిల్లవాని మేనమామ పాలతో ప్రమాణం చేయిస్తాడు. అప్పుడు గురువు గవ్వల దండతో ముద్రాదానం చేస్తాడు. ముద్ద్రా దానాన్నిపిల్లవాడి మెడలో కటతాడు. గురువు పాదాలకు నమస్కరించి కానుకలు సమర్పించుకుంటాడు. పిల్లవాడికి గురువు ఈ విధంగా ప్రబోధం చేస్తాడని, డా॥చిగిచర్ల కృష్ణారెడ్డి గారు తమ జానపద నృత్య కళ ... గ్రంథంలో ఉదహరించారు. గురువు చెప్పే మాటలు:
- మన కులవృత్తికి ద్రోహం చేయకూడదు.
- ఇతరులను మోసం చెయ్యవద్దు.
- అబద్ధం చెప్పొద్ధు, అని పిల్లవాడి నోటినుంచి పలికిస్తారు.
- గొరవయ్య కర్తవ్యం:
ప్రమాణం చేసిన పిల్లవాడు ఆ వంశంలో కోటీశ్వరుడు అయినప్పటికీ, సంక్రాంతి పండుగనాడు మాత్రం, గొరవయ్యలా అలంకరించుకుని, అయిదు ఇళ్ళు అడుక్కుని రావాలి. ఇది వంశ పారంపర్యంగా వస్తూన్న ఆచారం. గొరవయ్య వేషధారణ, మెడలో గవ్వల దండను ధరించి, నల్ల కంబళిని శరీరమంతా కప్పుకుని, కుడిచేతిలో డమరుకాన్ని పట్టుకుని ఎడమ చేతిలో పిల్లన గ్రోవి పట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టి, తలకు కిరీటంలా ఎలుగుబంటి చర్మాన్ని ధరించి, నుదుట బండారు బొట్టు పెట్టి, నడుముకు జింక చర్మంతో చేసిన బండారు తిత్తిని కట్టుకుని ప్రతి ఇంటి దగ్గరా అడుక్కుంటూ, ఇంటిలోని వారందరికీ బండారు బొట్టు పెడుతూ పిల్లన గ్రోవి ఊదుతూ ఇలా పాడుతారు.
శివమల్లేశ్వరా, బండారువయ్యా
కాపాడప్పా, పిల్లలను పెద్దలను దీవించు
గాటెద్దులు కలిగి గూటావులు కలిగి
కోటి సంపదలు కలిగి
కనకపాత్ర గలిగి
మల్లేశునట్లు మగబిడ్డ కలిగి
మల్లిఖార్జున నీ పాదపద్మాలకు
నమస్తే
అని ముగిస్తారు.
- డమరుక శబ్దాలు :
గొరవయ్యలు నృత్యం చేసేటప్పుడు పాటలు పాడరు. పాటపాడే సమయంలో డమరుకాన్ని, ఒక ప్రక్క మాత్రమే నాలుగు వ్రేళ్ళతో వాయిస్తారు. డమరుకం నుంచి పుట్టే ధ్వనులు ఇలా వుంటాయంటారు కృష్ణా రెడ్డి గారు,.
డడబుడ్డ బుడ్ - ఇరడడ బుడ్డ
బుడబుడ్డ బుడ్ - బుడబుడ్డ బుడ్
బుడబుడ్డ బుడ్ - బుడబుడ్డ బుడ్
గొరవయ్యలు ఒకరు మొదలు ఎంత మందైనా నృత్యం చేస్తారు. డమరుకాన్ని వాయిస్తూ పిల్లన గ్రోవిని ఊదుతూ సరి సంఖ్యలో గుండ్రంగా తిరుగుతూ, వయ్యారంగా నడుమును త్రిప్పుతూ నృత్యం చేస్తారు.
- శ్రీశైల మల్లన్న:
ఒకరు పాట పాడుతుండగా మిగిలినవారంతా పాట వంత పాడుగారు. అలా అన్ని గొంతులు కలపటం ఒక్కొక్క కాలిని కొద్ది మంది నేలపై కొడుతుండగా గజ్జెలు ఘల్లుమని మ్రోగుతాయి.
ఆ పాట ఇలా ప్రారంభమౌతుంది.
శివుడు శీనయ్య శ్రీ శైల మల్లయ్య
కానగ రావయ్యా శీనయ్య
సిక్కు జడలవాడు శివనీల కంఠుడు
అని పాడుతూ డమరుకాన్ని ఈ వరుసలో వాయిస్తారు.
తక్ తక తక్
తక అక తక్
తక తక్ తక్
తక్ తక్ తక్
అంటూ వాయిస్తారు.
- శివరాత్రి నాడు:
శివరాత్రి నాడు మల్లయ్య కొండకు పోతూ గ్రామాల వారికి కొండను గూర్చి, దేవాలయాన్ని గూర్చి, కష్టాలు కడతేర్చే దేవుణ్ణి గూర్చి, కోనేరు లోతు పాతుల్ని తెలియ జేస్తూ ఇలా పాడు కుంటూ పోతారు.
- శివరాత్రి
శివకొండకని పోదాము రారమ్మ
మల్లయ్య కొండ స్వామినే చూతాము
శివాపురమికి పరమటంట
శిద్దులేలే మల్లయ్య కొండ
కొండ పైన దేవళంబు
కొండ దిగువున మందిరంబు
మందిరంబులో వెలిగేటి
మల్లికార్జునుడున్నడంట
ఒంటి స్థంభము మాలలోన
ఒక్కడే మల్లయ్య నిలిసె.
ఇలా మహాశివుని వర్ణిస్తూ, ప్రయాణ అలసటను మరచి పోతూ భక్తి భావంతో పాడుకుంటూ చివరగా మంగళం పాడతారు గొరవయ్యలు. అందరికీ బండారు కుంకాన్ని అందచేస్తారు.
గొరవయ్యల నృత్యాన్ని చూస్తున్నప్పుడు పిల్లలు భయపడుతూ వుంటారు. కాని పెద్దలు వారిని ఎత్తుకుని ఒడిలో కూర్చో పెట్టుకుంటారు. పిల్లలు మాత్రం కళ్ళు మూసుకుని, అప్పుడప్పుడు చూస్తూ వుంటారు. డమరుకాల ధ్వని గుండెలు అదిరేలా వుంటాయి. పెద్ద గొరవయ్యలు, చిన్న గ్తొరవయ్యలు కలిసి చేసే నృత్యం అబ్బురంగా వుండి అందరూ చప్పట్లు చరుస్తారు. ప్రతి ఇంతికి వెళ్ళి యాచించి వారిచ్చిన ధాన్యాన్ని తీసుకుని, బండారు బొట్టు పెట్టి పోతూ వుంటారు. ఇలా గొరవయ్యలు బ్రతుకుతూ, ఆ కళను బ్రతికి స్తున్నారు.
అలా బ్రతికించే కళాకారులు, గొరవ రామాంజనేయులు __ గొరవ కాటమయ్య__ గొరవ చిన కాటమయ్య మొదలైన వారు ప్రముఖంగా పని చేస్తున్నారు.