తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస/స్తుత్యాదికము
డుట శ్రేయోదాయకమని నాయభిప్రాయము. ఈ యభిప్రాయమును ఈ పుస్తకమందేగాక యింతకు ముందు నాచే రచింపఁబడిన యితర గ్రంథములలోఁ గూడ వెల్లడిచేసితిని.
ఈ పుస్తకపు తుదిభాగము నే గ్రామాంతరమున నుండు నవసరమున ముద్రింపఁబడిన దగుటచే నచ్చటచ్చట గొన్ని ముద్రాస్ఖాలిత్యములు దోపవచ్చును. అట్టి వానిని రెండవ కూర్పున సరిచేసికొందును.
సంఘ విషయములఁ గూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మనదేశభాషలలో లేవు. ఐరోపాఖండమువారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణభూతములైనవి యిట్టి కావ్యములేయని నేను జెప్పనవసరములేదు. కనుక చదువరులారా! యీపుస్తకమున నుండు విశేషములను, వర్ణనలను గురించి మనసున వేరుగాఁ దలంపక నాయుద్దేశము నాలోచించి మన్నించి చదివి తక్కిన భాగములు కూడా త్వరలో వెలువడునటుల నన్ను ప్రోత్సాహపఱచెదరని నమ్ముచున్నాను.
దాసు శ్రీరాములు
శ్రీరస్తు.
తెలుఁగునాడు
(స్తుత్యాదికము.)
ఉ. శ్రీపరమున్ మహేశుని భ
జించి రసంబు ఘటింప గాళహ
స్తీపురమున్ బురాణపురి
శ్రీగిరి యెల్లలుగాఁ దలిర్చు నా
నాపుర మానితం బయిన
నాఁటఁ జెలంగు దెలుంగుఁబల్లెలన్
గాపుర ముండువారల ప్ర
కారము వీథి యొనర్తుఁ గ్రొత్తగన్.
ఉ. లోకవితాన మేలు పరలోకవిభు డఖిలంబు గూర్చెనౌ
నా కవితాకునన్ ధనమునం బరితృప్తులు గాక నిక్కువా
రా కవితారసంబు కెనయంగల రిద్దమరేయి దొంగకున్
రా కవితంబ యయ్యవి నిరాకుల చిత్తులపాలి భాగ్యముల్.
చ. తెలుఁగునఁ దేటతెల్లముగఁ దెల్పినమాట వరాలమూటగాఁ
దెలుఁగున మాటలాడు మనదేశపువారు గణింతు రందుకై
తెలుఁగనునాఁటివారల నుతింప నతిశ్రమ మంచు నెంచకే
తెలుఁగున వీథి సేయఁదగదే ధని మెచ్చిన మెచ్చుగల్గునే.
కం.కులవర్తనముల నానా
కలనము లాచారముల ప్రకారము లందం
బులఁ జందంబుల నుడుఁగుల
పలుతెఱఁగులు నిందుఁ జెప్పఁబడుఁ గడువేడ్కన్.
చ. ఇది నవవీథి దీనికి ననేకరసంబు లనేకనాయకుల్
పదపడి మంచిచెడ్డలును బాగులునోగులు మేళ్ళుఁగీళ్ళునుం
గొదవలుగొప్ప లాంధ్రజనకోటికి నెట్లగు నట్లు సెప్పెదన్
మదిఁబరికించి కోపమును మానుఁడు నానుడుఁ గానుఁడూరకన్.
ఉ.ఉన్నది యున్నయట్లు మధురోక్తులఁ జెప్పిన కబ్బ మెప్పుడున్
బన్నమునొంద దందఱును బాగని మెత్తురు, లేనిపోని దం
ధన్నలు కొన్ని పన్నుక కతల్ వెదఁబెట్టిన నేమి, యన్నెమా?
పున్నెమ? పూరుషార్థమ? బుభుక్షువు సేసిన బ్రాహ్మణార్థమా?
సీ.భాషీయపద్ధతి పట్టుదప్పఁగనీక
దీర్ఘ సమాసంబు తెరువుపోక
గూఢార్థసమితి దిక్కున దేఱిచూడక
స్పష్టార్థములజాడ జాఱనీక
మఱుఁగు పదంబుల మార్గంబు ద్రొక్కక
తేటమాటల రాచబాట విడక
దూరాన్వయంబుల దారి మూచూడక
సంకరాలంకార సరణి గనక
గీ. ఉన్నయది ఉన్నయట్టులు గన్నయదియు
గన్నయట్టులు విన్నది విన్నయటులు
నన్నయది యన్నయట్టులు వన్నె వెట్టి
కవితఁ జెప్పిన సంతోష మవు జగాన.
సీ. ఉచ్చరించినమాట యూఁకొన్న మాత్రనే
యెట్టిదో తాత్పర్య మెఱుఁగవలయు
నెఱిఁగి డెందానఁ జింతించిన మాత్రనే
దృష్టాంత మొకటి స్ఫురించ వలయు
స్ఫురియించి సరిఁజూచి పరికించు మాత్రనే
దొసఁ గిందు లేదని తోఁచవలయు
తోఁచి యొక్కింత యాలోచించు మాత్రనె
"యౌరా! యథార్థమే" యనఁగవలయు
గీ. స్వస్తుతియుఁ బక్షపాతము సంప్రదాయ
భంగమును, మత్సరము, శాస్త్రబాధ, నీతి
లోపమును, నింద, కఠినోక్తి దోఁపరాదు
కవి జగచ్ఛ్లాఘనీయమౌ కవిత గూర్ప.
ఉ. ఓరుపులేని వాఁడను మహోద్యమ మిచ్చి సుధీముఖంబునం
దీరుపులేనివాఁడను, విధిచ్యుతి లేని కృతిన్ రచింపఁగా
నేరుపులేనివాఁడను, గుణిప్రకరం బెపుడైన నిందు నా
కూరుపుఁ జూచి చీ! యనునొకో? తలపెట్టితి నేమి సేయుదున్.
ఉ. లోకములోని యెల్లనరలోకముల న్నిఖిలప్రవృత్తులం
దేకముగా సృజించెను మహేశుఁ డటంచుఁ తలంచి యెవ్వఁడా
లోకము సేయు, వాఁడె యతిలోక మతిక్రముఁ డంచు గీతలం
దా కమలాతరంగవిభుఁ డర్జునుతోడ వచించె వింటిరే?
ఉ. నందునినందనుండు విడనాడె భువి, న్గలి వచ్చె నాఁడె య
న్నందున నాఁటనుండియును నాలుగుదొమ్మిది తొమ్మిదీరువో
నందననామవత్సరమునన్ శుభపౌష సితాష్టమిన్ ధరా
నందననామవాసరమునన్ దొరకొంటిని దీనిఁ జేయఁగన్.
కం. పదునెనిమిదివందల తొం
బది రెండగు నాంగిలేయ వత్సరమున ని
ర్వదియెన్మిదవ డిశంబరు
మొదలుగ నివ్వీథిఁ జెప్ప మొదలిడితి వెసన్.
వైదికులు
చ. వచనములందు మార్దవము, వస్త్రముల న్మడి, వంటకంబులన్
బచనము సేయు చేతిపరిపాటి, శ్రుతిస్మృతిచోదితక్రియా
నిచయమునందు భక్తి, గృహిణిన్ సుఖపెట్టుట, వాసవాటికా
శుచితయు వైదికోత్తముల సొమ్మనవచ్చు నసంశయంబుగన్.
సీ. చదివిరా! ఋగ్యజుస్సామముల్ భూర్భువ
స్సువరాది లోకముల్ స్తుతులు ముట్టు
మెదపిరా! పెదవి గుంఫిత మృదుస్తుతిపాఠ
సల్లాపముల నల్లరాళ్ళు గఱఁగు
తలఁచిరా! క్షేత్రయాత్రలు సేతు కాశికా
గంగోత్తరలకు మూఁ డంగలీడు
నిలిచిరా! సత్కర్మనియతి న్మహాధ్వర
కాండంబు పౌండరీకంబు దట్టు
గీ. పఱచిరా! పంచపాళి దర్భాసనములు
ముక్కుమూఁతల సరిపుత్తు రొక్కజాము
బళిర! యీపాటి పరిపాటి దెలుఁగునాఁటి
వైదికునితోటి యేమేటి వచ్చుసాటి.