తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/తెలుఁగుఁదనము - తెలుఁగు సంప్రదాయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలుఁగు మెఱుఁగులు

తెలుగుఁ దనము-తెలుగు సంప్రదాయము

తెలుగువా రన్నను. అంధ్రు లన్నను ఒకరే అన్న యెఱుకతో మాటాడుచున్నాను. తెలుగు సంప్రదాయ మన్నను తెలుగుతన మన్నను, ఆంధ్రసంప్రదాయ మన్నను ఆంధ్రత్వ మన్నను ఒకటే అని నా తలపు.

"ఆంధ్రద్రవిడ కర్నాటా మహారాష్ట్రాశ్చ గుర్జరా!" ఈ అయిదు జాతులవారుసు పంచద్రావిడు లని ప్రాచీనులు పేర్కొన్నారు. ప్రాచీన కాలమునందు, నిప్పుటికిగూడ, ఈ యయిదుజాతులవారికిని ఆచార వ్యవహారములు, ఆహారవిహారములు, కవితాగానములు, కులమర్యాదలు కొంత కొంత సరిపోలుచునే ఉన్నవి. ఔత్తరాహులయిన పంచగౌడులకు "సారస్వతాః కాన్యకుబ్జ గౌడా ఉత్కలమైధిలాః" అని పేళ్లు. వారు చాల విధములందు పంచద్రావిడులతో భేదింతురు. పంచద్రావిడులలో నేడు, ఆంధ్ర ద్రవిడకర్నాటులు మాత్రమే అత్యధిక సంబంధముగలవారుగా ఉన్నారు. కాని. ప్రాచీన కాలమున, అనగా రెండువేల యేండ్లకుముందు, సాతవాహనులును ఇక్ష్వాకులును పాలించిననాళ్లలో మహారాష్ట్రులు, గుర్జరులుకూడ ఈ మూడు జాతులతో చాల సన్నిహిత సంబంధముగలవారై యుండెడివారు. ఆంధ్రుల నేటి యాహార సంప్రదాయమే పంచద్రావిడులయు నాహారసంప్రదాయ మని శంకరాచార్యాదులు రచించిన పూజాస్తోత్రముల లోని నైవేద్య క్రమవర్జనశ్లోకములను బట్టి గుర్తింపవచ్చును. శాల్యన్నము, నెయ్యి, పప్పు, కూరలు, పచ్చళ్లు, దప్పళము, పెఱుగు ప్రధానాహార పదార్ధములుగా శ్లోకము లున్నవి. ఇప్పటికిని ఆంధ్రులయాహార పధ్ధతి ఇదేకదా.

ప్రాచీనకాలమున తెలుగువారికి పైటలు లేవు. అవి మహారాష్ట్ర గుర్జరుల సంబంధమున, అప్పటి ఆంధ్రరాజధాని యయిన ప్రతిష్ఠానము (పైఠాన్) నుండి నాగరకతతో వ్యాపించినవి. పైఠాన్ పదభవమే పైట. ఆంధ్రస్త్రీవర్ణనమున సాతవాహనసప్తశతిలోను, ఇతర సంస్కృత కావ్యము లందును కుచసౌభాగ్యము ప్రధానముగా వర్ణితమగును. మంకుకుని కావ్యమీమాంసలో ఆంధ్రస్త్రీలనుగూర్చి యీ శ్లోక మున్నది.


"కేశాః సపుష్పగండూషా జఘనే మణిమేఖలా,

హారో రక్తోంఽశుకం శుభ్రం వేషః స్యా దంధ్రయోషితామ్. " సదుక్తి కర్ణామృతాదులలోఁగూడ ఆంధ్ర స్త్రీ వర్ణనము లున్నవి.


 *సదుక్తి కర్ణామృతముననుండి...
పాచో మాధుర్యవర్షిణ్యా సౌభయఃశీథిలాంశుకాః
దృష్టయశ్చచలద్ భూకా మండనా స్వస్థయోషితామ్. (భర్త్మ: మేమస్య)
ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రకరలాంఛితభాలభాగః
కక్షానివేశనిటిడీకృత నీవి రేష
వేష శ్చిరం జయతు కుస్తలకామినీనామ్.
(రాజశేఖరస్య)

వాక్ సత్త్వాంగసముద్భవై రభినయై ర్నిత్యం రసోల్లాసతో
వామాంగ్యః ప్రణాయని యత్ర మదన క్రీడామహానాటకమ్,
ఆ నాస్తవ దక్షిణేన త ఇమే గోదావరీగ్రోతసాం
సప్తానామపి వార్నిధిప్రణయినాం ద్వీపానరాళశ్రియః
(రాజశేఖరస్య)

మానసోల్లాసముననుండి---

కాశ్చ త్కుంతలకామిస్యః కుటి లీకృత కుస్తలాః:,
కాల్చి ద్రవిడ మిన్యః ప్రకాశతపయోధరాః
మహారాష్ట్ర స్త్రీయః కశ్చిత్ లంబలోలకభూషితాః
ఆంధ్రనార్యో వరాః కాల్చి దపసవ్యోత్తరీయక్యా
గుర్జర్యో వనితాః కాల్చి దాపాణికృత కంచుకాః

పువ్వులను పుక్కిలించు కొప్పు, మణిమయమయిన యెడ్డాణము, రక్తహారము, తెల్లచీర ఇది తెలుఁగునెలఁత వేషము అని పై శ్లోకమున కర్థము. భర్తృమేణ్డాది సంస్కృత కవులు ఆంధ్రులనుగూర్చి చెప్పిన శ్లోకములకు ఆంధ్రస్త్రీలు సౌందర్యవతులని, నృత్యగానప్రియలనీ, అమాయికలని అర్ధసారము. ఆంధ్రల సంగీత సాహిత్యములతో తొలుత మహారాష్ట్ర కర్ణాటకుల కధిక సంబంధ ముండెడిది. సంగీతమున ఆంధ్రదేశి సంప్రదాయభేదములు కొన్ని మతంగుని బృహద్దేశిలో వివరింపఁబడినవి తెలుఁగువారిలో వివాహములందు మంగళసూత్రము కట్టుట అనాది యాచారము. ఈ యాచారము ఉత్తరదేశీయులకు లేదు. ఆర్యుల గృహ్యసూత్ర గ్రంధములలో లేనే లేదు. ప్రాచీనకాలముననుండి ఆంధ్ర స్త్రీలకు వివాహము లందు తాటీయాకును చుట్టగాఁ జుట్టి పసుపుపూసి నూలిబొందుతో కట్టి వధువు కంఠమున వరునిచే మూఁడుముళ్ళు వేయించుట యాచారము. కనుకనే దానికి తాళిబొట్టని పేరయ్యెను. తాళి యనఁగా తాడియే. అట్లే ఆంధ్రస్త్రీలు చెవులకు కమ్మలను, అనఁగా తాటియాకులనే చుట్టి పెట్టుకొనుట యాచారము. 'తాటాకు' పదమే సంస్కృతమున తాటంక మయినది. దానికి తెలుఁగున 'చెపొకు' అనికూడ పే రున్నది. తాటియాకులను చెవుల కమ్మ లని ధరించుట, తాళిబొట్టు కట్టుకొనుట తెలుగువారి నుండి కడమ ద్రావిడులకు సంక్రమించినవి. ఇట్లనుటకు తాళి, తాటంక, కమ్మ, చెవాకు పదములే సాధకములు. తాడికమ్మతాటాకులు తెలుఁగు పదములే కదా. తెలుఁగువారికి తాడిచెట్టు కల్పవృక్షము! తెలుఁగు వారిలో మాలలు, మాదీఁగలు, రెడ్లు, వెలమలు, కమ్మలు, కాపులు,కోమట్లు, రాచవారు, వెలనాట్లు, వేఁగిసాట్లు, తెలుగాణ్యులు, నియోగులు మొదలయిన యంతర్విభాగములు గల యష్టాదశ జాతుల ప్రజలలో సామాన్య ధర్మము లుగా నీ క్రిందివి కానవచ్చును. .

 "ఆతిధ్య గౌరవంబును,
స్వాతంత్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దు
ర్నీతివిహీనత, నైచ్యా
పేతత్వము సంధ్రులందు పేర్పడు గుణముల్!!

ఓర్వరు మాయమర్శము సముజ్జ్వల ధీమహిమంబు పేర్పడన్
నెర్వరుగాక వీడియలు. నెయ్యము తియ్యము చూచుకోండ్రు. లో
గర్వము తక్కువే. యయిన గుండ్ర తలబునఁ గానవత్తు. రా
యుర్వపురుష్యులుల్ బలసమునకు లెన్న - నాంధ్రపుత్రకుల్. "


తెలుఁగువారీ స్వరూపస్వభాపములతో పాటు భాషా కవితా గాన రీతులలోని ప్రత్యేక లక్షణములు గూడ పేర్కొన్నదగినవి. తెలుఁగువారి శబ్ధోచ్చారము తక్కిన ద్రావిడుల యుచ్చారముకంటె సుందరమయినది. కనుకనే "తెలుఁగు తేట" అన్న నానుడి యేర్పడినది. తెలుఁగుదేశపు శీతోష్ణస్థితులు మంచి వగుటచే తెలుఁగువారి ముఖముద్ర స్పష్టవికాసము గలది. వారి ఆహారవిహారములు బలిష్ఠములగుటచే దృఢగంభీరరీతులుగలది వారి యుచ్చారము. వేదోచ్చారమున నాంధ్రద్రవిడులే భారతదేశమంతటి కిని బ్రఖ్యాతి గన్నవారు. తెలుఁగు భాష కున్నన్ని యక్షరములు తక్కిన యే ద్రవిడ భాషకుఁగాని లేవు. తెలుఁగుపలుకులు ప్రాయికముగా ఆజంతము లగుటచే ప్రతిపదము విభిన్నముగా వ్యవహరింప వీలగును. ద్రుతపుచ్ఛము కొన్నిపదముల కుండుటచే నది తర్వాతి యజాదిపదములతో సుఖ సంధ్యుచ్చారము గూర్చునదై హృద్యత గొల్పుచున్నది. గసడదవాదేశము, సరళాదేశము శబ్దముల కటూచ్చారమును దొలఁగించుచున్నవి. ద్రవిడ పదముల యచ్చమెత్తదనముగాని, సంస్కృతపదముల ప్రొడగాఢ క్లిష్ట వాక్సరములుగా లేక, యరవమెత్తదనమును, సంస్కృతపు బింకముసు కొంతకొంత కూర్చుకొని, దేశీతత్సమతద్భవపద పౌష్కుల్యముతో తెలుఁగుబాస ద్రావిడభాషా కుటుంబములో లేఁబ్రాయపు జిలిబిలి పలుకుల పొలఁతియై వన్నె కెక్కినది. ఇటువంటి భాషాపరికరముగల తెలుఁగువారి కవితయు కొంతవిశిష్ట లక్షణములు గలది తెలుగుకవిత ప్రాయికముగా సంస్కృతా సుకారియేయైనను నందులో నెంతో విశిష్టతకూడ కలదు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన యను కవిత్రయము గోదావరి, కృష్ణ, పినాకిని యసు నదీత్రయమువోలె తెలుఁగువారికి జీవనాధార మలునది గోదావర్యాదినదీత్రయము శాఖోపశాఖలతో కాల్వలై పాయలై పాటి తెలుఁగునేలనెల్ల పాడిపంటలతో సుక్షేత్రపఱిచినట్లు, కవిత్రయకవిత శ్రీనాధ పోతనాది సర్వాంధ్ర కవిపరంపర యొక్కయు హృదయ క్షేత్రములందు రసధార పాటించి దివ్య కావ్య సస్యములను పండించినది. నేఁటి నవకవిహృదయ క్షేత్రములందును పాఱుచు పండించుచున్నది. కవిత్రయమువారు దైవభక్తులు, సదాచారులు, ఉత్తమపండితులు, వారి రచనలలో జుగుప్పితము, నీతిదూరము నగు కూర్పు తీరు కానరాదు. వారి దివ్యకావ్యసృష్టి సర్వాంధ్రకవి మండలికిని మేలు జలతియై సత్కావ్యసంప్రదాయము కొనసాగించుచున్నది. నన్నయ ధర్మోపాఖ్యానములు. సన్నిచోడని దేసిమఱుగులతెలుఁగులు, తిక్కన మర్మకవితలు, ఎఱ్ఱనకృష్ణబాలక్రీడాది వర్ణన సౌభాగ్యములు, పోతన భక్తికచీతామృతధారలు, శ్రీనాధునియాంధ్రదేశశివసౌందర్యవర్ణన, శయ్యా సౌభాగ్యకల్పనాహ్లాదములు. పెద్దనతిష్మునల మనోజ్ఞ ప్రబంధసృష్టులు, సూరన రామకృష్ణుల శాలీన నిగమశర్మాది కధాకల్పనా విశేషములు, సోము రంగనాధ గౌరనల ద్విపడరచనా సారస్యములు, సుమతి భాస్కర వేణుగోపాలాది శతక కవితా చమత్కారములు, వేమున్న వినోదవిమర్శపు టాటవెలఁదులు తెలుఁగువారికి నిస్సామాన్య సాహిత్య భాండాగారములు. తెలుఁగువారి భక్తిమయ జీవితమునకు పోతరాజు, త్యాగరాజు, గోపరాజులు జీవగడ్డ లయిన త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులలో కడపటి యిద్దఱి గేయములు తెలుఁగువారి కమృతధారలు. తెలుఁగు కవులలో ప్రాచీనులు కొందఱు తెలుఁగుదేశము యొక్కయు, తెలుఁగు ప్రజల యొక్కయు విశిష్టతను వర్ణించిరి. ప్రధానముగా శ్రీనాథుఁడు కాశీ, భీమఖండములలోను, జక్కన విక్రమార్క చరిత్రలోను, సోమనాథుఁడు పండితారాధ్య చరిత్రలోను, అజ్జరపు పేరయ ఉడయనంబి విలాసములోను ఆంధ్రదేశ సౌభాగ్యమును వర్ణించినారు అజ్జరపు పేరయకవి ఉడయనంబి విలాసములో ఆంధ్ర ప్రజలనుగూర్చి వర్ణించిన వర్ణనలే కొన్ని యిప్పుడు వినిపించుచున్నాను -


 “భామ విను శ్రీమదాంధ్రభూభాగమనెడు
తారహారంబునకు సొంపు దనరుచున్న
మధ్యమణిచందమున మహామహిమ దాల్చే
భూరివిభవంబు బెజవాడపురవరంబు.
క్రొత్త బియ్యము థాయగూర లొబ్బట్లు సై
దంపు బూరెలు పంచదార తాలలు
వడలు నల్లంబు మీఁగడల తియ్యని పెర్గు
కమ్మని నీరివాలు గసగసాలు
చిఱుసెన్గపప్పును తఱచు వీడ్యంబులు
కంబళ్లు నంబళ్లు కంచుకములు
ఇంగువ జిలకట్టు నెనసిన మిరియంబు
మంచివాసన నెయ్యి మాటదురుసు

 >తఱుచు రణశీల, మొప్పు గంధాక్షతములు
నంద మింపొందు శిఖలు, నొయ్యారి నడలు
కలిగి కాంతలు పురుషులు కలసి సిరుల
చెలఁగు నయ్యాంధ్రదేశంబు తెలుపు గాంచె.
కదళీఫలంబులు ఖండశర్కరయును
పెనుపచ్చిపోకలు పనసతొలలు
మామిడిపండ్లు కమ్మని గోఘృతమ్మును
వంకాయ టెంకాయ వలుపు పప్పు
బహువిధభక్ష్యముల్ పరమాన్నమును బైళ్లు
కంద పెండలములు కాయగూర
అమృతోపమానంబు లైన రసావళుల్
శాల్యోదనము పెర్వు సకలరుచులు
గలుగు నూరుఁగాయలుఁ బానకములు నప్పు
డములు వరుగులు వడియముల్ శ్రమముదీర
సనుభవించిరి వేదశాస్త్రార్థవాద
ములకు నలరుచు కోన భూస్థలమునందు."

తెనుఁగుతనమును గూర్చి నా చిన్ని పద్దెము.

 "ఆంధ్రభాష యమృత మాంద్రాక్షరంబులు
మురువులొలుకు గుంద్రముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం
బాంధ్రజాతి నీతి నసుచరించు."

  • * *