తెనాలి రామకృష్ణకవి చరిత్రము/ముక్కు తిమ్మన్న

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సతికంటెఁ బ్రియతమంబగునట్టి దేదియునులేదు. మనపెద్దన కవిశేఖరుఁడు తమ్మెట్లు వర్ణించెనో మఱచిపోయినారా?

"శ్రీ వేంకటగిరివల్లభ
 సేవాపరతంత్ర హృదయ! చిన్నమదేవీ
 జీవితనాయక ! కవితా
 ప్రావీణ్యఫణీశ! కృష్ణరాయమహీశా!

చిన్నమదేవీ జీవితనాయక , యని పెద్దనగా రనినపుడు తాము నితాంతసంతోషతరంగిత హృదంతములుకాఁగా లచ్చిమగఁడ యని నపుడు శ్రీమన్నారాయణుఁ డుప్పొంగ, నెల్లిమగఁడని పిలుచుకొన్నపుడు నేను బ్రహ్మానందము నొందియుండఁగా మిత్రవింద మగఁడ యన్నపుడు శ్రీకృష్ణుడుఁ డెట్టి యానందము నొందియుండునో శ్రీవారే యూహింతురుగాక!" యనెను. అందఱు నాతని చమత్కారమున గబ్బురమందిరి.


16 ముక్కు తిమ్మన్న.

రాయ లొకనాడు రామరాజభూషణునిజూచి, 'కవీ ! స్త్రీ సౌందర్యమును వర్ణించుచు జక్కనిపద్యమును జెప్పుమా!' యనెను. భట్టుమూర్తి యీపద్యము జదివెను.

‘శా. నానాసూనవితానవాసనల నానందించు సారంగమే
     లానన్నొల్లదటంచు గందపలి బల్ కాకందపంబంది యో
     షా నాసాకృతిబూని సర్వసుమనస్సారభ్యసంవాసమై
     పూనెం బ్రేంక్షణమాలికా మధుకరీపుంజంబు లిర్వంకలన్ .'

రాయలు 'భట్టుమూర్తీ! నీకవితామాధురి యత్యంతమధురముగ నున్నది. నీకు వేయి దీనారములు బహుమానముగ నిచ్చితిని' అని వేయి దీనారముల నిచ్చెను, రామకృష్ణకవి లేచి 'మహారాజా! మీరు సకలవిద్యావిశారదులు రాజ్యపరిపాలనా ధురంధరులు కావుననే పద్యమునకు సరియైన వెల నిర్ణయించినారు. ఈ పద్యమును భట్టుమూర్తి వ్రాయలేదు. వేయి దీనారములకు మన తిమ్మనకవిగడ గొనెను. మీరు వేయికిబైన నేమైన నిచ్చినగదా మన భట్టుమూర్తికి లాభము?" అనెను. భట్టుమూర్తి సిగ్గుపడెను.

మఱొకనాడుతిమ్మసకవియింటివద్దనందఱునుగూర్చుండికవితా గోష్ఠి గావించుచుండగా నామార్గమున బోవుచున్న భట్టుమూర్తి వారందఱును వినునట్లు తన శిష్యునుద్దేశించి --

క. వాకిఁట కావలి తిమ్మన
   వాఁకిట కవికోటి మాధవా కిటకోటే. '

యని, తిమ్మన వాఁకిటగూర్చుండిన కవులసమూహము పరాహముల సమూహమును బోలియుస్నదను నర్థము వచ్చునట్లు చదివెను. రామకృష్ణుఁ డా దారినిబోవుచు నది విని--

'న. ప్రాకృత సంస్కృత ఘూర్జర
     మూకీకృతకుకవితుంగ ముస్తాతతికీస్
     వాఁకిట కావలి తిమ్మన
     వాఁకిటి కవికోటిమాధవా! కిటకోటే.'

ప్రాకృత సంస్కృత, ఘూర్జర భాషలమిశ్రమముచేసి, కవనము చెప్పునట్టి కుకవులనుతుంగముస్తల పాలిటికిఁ దిమ్మనవాకిటనున్న కవులందరును వరాహములవంటివారేయను భావము వచ్చునట్లు చదువగా భట్టుమూర్తి సిగ్గుపడెను. ,

మఱిరెండు రోజులు గడిచినపిదప, ముక్కుతిమ్మనయొకనాడు తనయింటి చావడిలోఁ గూర్చుండి, ఊయెలలో నుల్లాసముగ నూగుచుండగా రామకృష్ణుఁడేగి 'మామా! ఊతునా! యనెను. ఊయల నూపును కాఁబోలునని భావించి, తిమ్మన ఊఁ యనెను. వెంటనే వికటకవి తిమ్మనమోముపై నుమిసెను ఆగ్రహావేశమునొంది. 'ఓరి నీకేమి పోగాలమురా ? నిన్నుమియమంటినా? యని తిమ్మన గర్జింప, 'అవును మామా! ఊతునా! యని నిన్నడిగియే గదా నేనుమిసినాను, అని, రామకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చెను, కోపమాపుకొన జూలక తిమ్మనకవి యూయలపై నుండియే రామకృష్ణుని మొగముపై శక్తికొలదితన్నెను. ఆతాపునకు రామకృష్ణుని దంతమొకటి యూడిపోగా, నాతడు యింటికి బోయి దుప్పికొమ్ము నరుగదీసి పన్నుగా నమర్చుకొనెను ఆసంగతి రామరాజభూషణుడు తెలిసికొనెను నాటి మధ్యాహ్నము కొలువుకూటమున రాయలు 'రవిగాననిచో గవి గాంచునేకదా!' యనుసమస్యను పూర్తిచేయుమనెను. భట్టుమూర్తి యిట్లు పూర్తిచేసెను.

ఉ. “ఆరవి వీరభద్రచరణాహతిడుల్లిన బోసినోటికిన్
     నేరడు రామలింగకవి నేరిచెఁబో మన ముక్కు తిమ్మన
     క్రూరపదాహతిం దెగిన కొక్కెఱపంటికి దుప్పికొమ్ము ప
     ల్గా రచియించెనౌం! రవిగాననిచో కవిగాంచునేకదా!”

రాయ లాపద్యభావమును గూర్చి యాలోచనాథీనుఁడై యుండగా భట్టుమూర్తి జరిగినదంతయుచెప్పి రాయల కాహ్లాదము గలిగించెను.


17 కవి గండపెండేరము

కృష్ణరాయ లొకనాడు బంగరుపళ్ళెరమున గవిగండపెండేరమును దీసికొనినచ్చి, గీర్వాణాంధ్రములందునమోఘముగా కవిత్వము జెప్పువారికి గవిగండపెండేర మీయఁబడునని చెప్పగా కవులందఱు నాలోచనాధీనులై యుండగా, రాయలు మఱల నిట్లనెను-