తెనాలి రామకృష్ణకవి చరిత్రము/పెద్దనకవిత్వము నాక్షేపించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉ. ఆర్ణవవేష్టితాఖిల మహామహి మండలమందు బూతుని
     బూర్ణుఁడు రామకృష్ణకవిఁబోలు కవీశ్వరుఁ డొండుగల్గునే
     నిర్ణయమెంచిచేయు మహనీయగుణాడ్యుడు బూతుమంచిగా
     దుర్ణయుఁడైనచో దివిరిధూర్తతమంచిని బూతుచేసెడున్ ,

15 పెద్దన కవిత్వము నాక్షేపించుట.

విద్వత్కవు లెల్లరును గూర్చుండి యుండగా రామకృష్ణుఁడు నిలువబడి రాయలు నుద్దేశించి, 'మహారాజా! నాతో భక్తిరసాత్మకములగు బద్యముల నాశువుగా నెవరును చెప్పలేరని ఘంటాపదముగా జెప్పగల' ననెను — రాయలు రామకృష్ణకవీ! భక్తిరసోజ్వలములగు పద్యములఁ జెప్పుము. అప్పుడు నీకంటె యుత్తమముగ నెవరైన నట్టి కవిత్వము జెప్పగలవారుందురో, ఉండరో నిర్ధారణ చేయవచ్చును. రామకృష్ణుఁ డిట్లు చదివెను—

“ఆ. వె. లచ్చిమగఁడ నీకు లక్షనమస్కృతుల్
          సీతమగఁడ! నీకు సేవఁజేతు
          సత్యభామమగఁడ సన్నుతించెద నిన్ను
          మిత్రవిందమగఁడ మేలొంగు
          లక్షణకు మగండ లాలింపరా నన్ను
          నీలమగఁడ నాకు నీవె దిక్కు
          జాంబవతికి మగఁడ జాలంబుసేయక
          యెల్లిమగఁడ నన్ను నేలికొనర!”

రాయలు “ఓహో! మిక్కిలి భక్తిరసాంచితమై యన్నది" యని నాక్షేపణపూర్వకముగాననఁగా రామకృష్ణుఁడు “మహారాజా! తాము నన్ను హేళనఁ జేయనక్కఱలేదు, లోకములో బురుషునకు సతికంటెఁ బ్రియతమంబగునట్టి దేదియునులేదు. మనపెద్దన కవిశేఖరుఁడు తమ్మెట్లు వర్ణించెనో మఱచిపోయినారా?

"శ్రీ వేంకటగిరివల్లభ
 సేవాపరతంత్ర హృదయ! చిన్నమదేవీ
 జీవితనాయక ! కవితా
 ప్రావీణ్యఫణీశ! కృష్ణరాయమహీశా!

చిన్నమదేవీ జీవితనాయక , యని పెద్దనగా రనినపుడు తాము నితాంతసంతోషతరంగిత హృదంతములుకాఁగా లచ్చిమగఁడ యని నపుడు శ్రీమన్నారాయణుఁ డుప్పొంగ, నెల్లిమగఁడని పిలుచుకొన్నపుడు నేను బ్రహ్మానందము నొందియుండఁగా మిత్రవింద మగఁడ యన్నపుడు శ్రీకృష్ణుడుఁ డెట్టి యానందము నొందియుండునో శ్రీవారే యూహింతురుగాక!" యనెను. అందఱు నాతని చమత్కారమున గబ్బురమందిరి.


16 ముక్కు తిమ్మన్న.

రాయ లొకనాడు రామరాజభూషణునిజూచి, 'కవీ ! స్త్రీ సౌందర్యమును వర్ణించుచు జక్కనిపద్యమును జెప్పుమా!' యనెను. భట్టుమూర్తి యీపద్యము జదివెను.

‘శా. నానాసూనవితానవాసనల నానందించు సారంగమే
     లానన్నొల్లదటంచు గందపలి బల్ కాకందపంబంది యో
     షా నాసాకృతిబూని సర్వసుమనస్సారభ్యసంవాసమై
     పూనెం బ్రేంక్షణమాలికా మధుకరీపుంజంబు లిర్వంకలన్ .'

రాయలు 'భట్టుమూర్తీ! నీకవితామాధురి యత్యంతమధురముగ నున్నది. నీకు వేయి దీనారములు బహుమానముగ నిచ్చితిని' అని వేయి దీనారముల నిచ్చెను,