తెనాలి రామకృష్ణకవి చరిత్రము/భారత రచన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యున్నాడని యీర్ష్యచెంది యొకనాడు సభలో నందఱు నుండగా, రామకృష్ణకవి కెట్లయినఁ బరాభవము సేయదలంచి యిట్లనెను. -

'అయ్యా! రామకృష్ణకవీ! నేనొక సమస్య నిచ్చెదను. అద్దానిం పూరించి, నీవు సత్కవివని, వికటకవివని సార్థకనామధేయుండ వగుదువు గాక!' కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చె౯.

రామకృష్ణుడు భట్టుమూర్తి తన్నవమానించుటకే యిట్టి సమస్య నిచ్చినాడను కోపముతో నిట్లు పూరించెను.

'క. గంజాయిఁద్రావి తురకల
    సంజాతులగూడి కల్లుచవిఁగొన్నవా
    లంజలకొడుకా యెక్కడ
    కుంజరయూధంబు దోమకత్తుక జొచ్చెన్ . ”

రామరాజభూషణుఁడు చిన్నబుచ్చుకొని కూర్చుండుట గాంచి రాయలు “రామకృష్ణా! ఆపద్యము నట్లు చెప్పఁజనదు. భారతపదముగా జెప్పు' మన నతడిట్లు చెప్పెను. '

'క. రంజనచెడి పాండవులరి
    భంజనులై విరటు గొల్వుపాలై రకటా!
    సంజయ విధినేమందును
    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ . '

9 భారతరచన

అల్లాయుద్దీన్ గంగోబహమనీ భామినీరాజ్యమును, బరిపాలించిన పిదప నేదులశాహి రాజ్యమున కధికారియయ్యెను. ఏదులశాహి తాతయగు, కుతుబ్ శాహి నాదిండ్ల అప్పొమాత్యుఁడు రచించిన తపతీ సంవరణోపాఖ్యానము నంకితమందెను. బాల్యమునుండియు నేదులశాహి తానుకూడ గ్రంథములకృతిభర్తృత్వము నందవలయు నను కుతూహలము కలిగి యుండెను. విజయనగర విజాపుర సామ్రాజ్యములవా రిరువురునుగూడ సరిహద్దులగూర్చి తగాదాపడుచుండిరి. విజూపురము సరిహద్దుగా నుండవలయునని, విజయనగర సామ్రాజ్యూధిపతులును తుంగభద్రానది సరిహద్దుగానుండవలెనని ఏదులశాహియు వివాదపడుచుండిరి. ఈవివాదము తుదకు భయంకరసంగ్రామముగాఁ బరిణమించెను. ఆ రణంబున రాయల సైన్యాధిపతులు, సైనికులు కొంద రేదులశాహిచే ఖైదీలుగా పట్టుకొనబడిరి. వారి విమోచనమునకై రాయలేదులశాహితో సంధికొడంబడవలసివచ్చెను. ఇర్వురు రాజ్యాధిపతులును దమకు రాయచూరు సరిహద్దుగా నుండవలయునని నిర్ణయించుకొనిరి. ఆసంధిలో ఏదులశాహి, రాయలు తన యాస్థానకవులచే భారతము వారముదినములలో వ్రాయించి, యంకిత మీయవలయునని కూడ నేర్పఱచెను. ఏదులశాహి కోరిక ప్రకారము వారమురోజులలో భారతము పూర్తి చేయవలయునని యాస్థానకవులతో ఖండితముగాఁ జెప్పెను.

పదునెనిమిది పర్వములు గలిగి, పంచమవేదముని ప్రసిద్ధినొంది యున్న భారతమును వారమురోజులలో వ్రాసి అందులో ఏదులశాహి పాండవులుగను, నాతనివిరోధియగు నైజాముల్ముల్కు కౌరవులుగను, వర్ణించి వ్రాయుట యసంభవమని పెద్దనాదులు తలపోసి, నిరాశచెందిరి. తమవలనఁ గాదనిచెప్పినచో దమకుఁ దప్పక దేవిడీ మన్నాయగునని యెఱింగిన యా కవులొకరినొకరు 'నీ వలన నేయిది జరుగవలె'నని యనుకొనితుదకుఁ తెనాలి రామకృష్ణునిసలహా యడుగుటకు నిశ్చయించుకొనిరి. నాలుగుదినములు గడచిపోయెను. పెద్దన, పింగళిసూరన్న రామకృష్ణునికడ కరిగి 'రామకృష్ణ కవీ! ఇన్నాళ్ళును రాయల యాస్థానమున గౌరవముగనే కాలక్షేప మొనరించితిమి. ఇప్పుడు మాఁదుమిక్కిలి వచ్చినది. ఆదిక్కుమాలిన ఏదులశాహీ పేర భారతము వ్రాయవలయునని రాయలు నిష్కర్షగా చెప్పెను. ఏమి చేయుటకును దోచకున్నది,” అనగా, 'రామకృష్ణుడు ' పెద్దనకవీంద్రా! ఇందుల కంతగా విచారింపవలయునా? ఏమివెర్రి? మీరు నిర్విచారులై యుండిన నేను జెప్పినట్లు చేయుడు. మీమర్యాద నామర్యాద గూడ దక్కింతును. వేయిబండ్ల తాటియాకు కొట్టించి, సంచికలుగా దయారు చేయింపుఁడు అనెను. పెద్దన సంతోష భరితాంతరంగుడై యట్లే చేయించెను.

ఏడవరోజున రాయల సెలవుగొని, రామకృష్ణుడు పెద్దనాది కవీంద్రులందఱితోఁ గలిసి, విజాపురమునకు బోయెను. కవుల నపరిమితముగ గౌరవించి, ఏదులశాహి భారతము కృతినొందుట కువ్విళ్ళూరుచుండెను. ఒకనాటి యుదయమున నాతడు కవులను రావించి సుఖాసనాసీనులగావించి యిట్లు ప్రశ్నించెను -

'పండితులారా! భారతం రచించి తెచ్చినారా!'

'రామకృష్ణుడు లేచి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

'సర్కార్ ! తమ హుకుం ప్రకారము పూర్తిచేసి తెచ్చినారము వ్రాయుట వారమురోజులలోఁ బూర్తియైనదిగాని చదువుట కధమమొక సంవత్సర మగును.'

'మమ్ము పాండవులుగనే వర్ణించినారా?'

'అవునట్లే వర్ణించినాము'

'మాశత్రువగు నైజాముల్ముల్కునో—'

'కౌరవులుగా వర్ణించినాము'

'అచ్చా! చాల సంతోషముగా నున్నది. అయితే ఎప్పుడు మొదలు పెట్టదరు?'

'కాని ప్రభూ! ఒక్క సందేహముతోచి, చిట్టచివర కొంత పూర్తిచేయకుండ యుంచినాము. మాటిమాటికి మాకా సందేహము కలిగి చాలచోట్ల నేమియు వ్రాయక యట్లె యుంచినారము. ఆ సందేహము నివృత్తి చేసినచో నరగంటలో బూర్తిచేసి, వినిపింతుము.' ‘ఆ సందేహమేదో చెప్పండి.”

'సర్కార్ ! నైజాముల్ముల్కు గారిని, వారి సోదరులను కౌరవులుగా వర్ణించితిమి. తాము పాండవులని వ్రాసితిమి. పాండవులైదుగురు సోదరులు. ఆయైదుగురకు భార్య ద్రౌపది. తాము ధర్మరాజని వ్రాసితిమి. తమ జనానా వారిని ద్రౌపదిగా వ్రాసినాము అయితే తమ జనానావారికి భీమార్జున నకులసహదేవులనెడి మిగత నలుగురు భర్తలుగ నెవరిని వ్రాయవలయునో తోచకున్నది. ఈ విషయమై తమరెట్లు సెలవిచ్చిన నట్లు వ్రాయుదుము.'

ఏదులశాహి నాపాదమస్తకము క్రోధమనలముభంగి దహించెను. 'ఛీ తూ! అరే ఏం భారతంబే మీది, ఒక్క ఆడదాన్కి అయిదుగురు మొగుళ్ళు, మాజనానాకింకా నల్గురు మొగుళ్ళు కావాలీ హైతో మీభారతం అంకితమువద్దు కంకితమువద్దు వెంటనే తగులబెట్టు'డను సరికి రామకృష్ణుడు 'చిత్తము సర్కార్ ! అట్లే చేయించెద'నని యా వేయిబండ్ల తాటియాకును నిశ్శేషముగఁ దగులఁ బెట్టించెను. అంతయు భస్మీభూత మయినపిదప నేదుల శాహికడ కతడేగి 'సర్కార్ ! తమ యాజ్ఞానుసారము తగులబెట్టించితిని అనెను. ఏదులశాహి పరమానందము నొంది, యాపండితులకు శ్రమయిచ్చి నందులకు నొచ్చుకొని పెక్కు బహుమానములిచ్చి వీడ్కొలిపెను. రాయ లిదియంతయుఁ దెలిసికొని కడుపు చెక్కలగు నట్లు నవ్వెను,


10 కుంకుమబొట్లు

చేర దేశమునుండి కుంకుమబొట్లు అనుజగదేకవిఖ్యాతినార్జించిన పండితుఁడు రాయల యాస్థానమందలి యష్టదిగ్గజములను జయించు తలంపుతో నేతెంచెను. అతఁడు రాయలను సందర్శించి యాస్థాన విద్వాంసులతోడి వివాదమునకుఁ దన కవకాశమిమ్మని కోరగా,


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.