తెనాలి రామకృష్ణకవి చరిత్రము/ప్రెగడరాజు నరసరాజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్కరి గరిభిద్గిరిగిరభి
త్కరి బిద్గిరిభిత్తురంగ కమనీయంబే.”

కుంకుమబొట్లు 'ఓరీ! ఆపద్యమున కర్థము చెప్పగలవా? యని ప్రశ్నింప, రామకృష్ణుఁ డిట్లుఁ జెప్పెను. "

టీ. నరసింహ=సాళువ నరసింహారాయల, కృష్ణరాయ= అతని కుమారుడైన శ్రీకృష్ణ దేవరాయల, కీర్తి= ప్రసిద్ధి, కరభిత్ =గజాసురుని వధించిన శివునివలెను, గిరిభత్కరి=పర్వతముల పెకలించిన యింద్రుని యేనుగయగుయైరావతమువలెను, కరిభిద్గిరి=సాంబశివుడు నివాసముండు కైలాసశైలమువలెను. దిరిభిత్కరిభిత్తురంగ = యింద్రుని యొక్కయు, నీశ్వరునియొక్కయు వాహనములైన యుచ్చైశ్రవము గోవృషభములవలెను తెల్లనికాంతి గల్గియున్నది.

'రామకృష్ణుని పరిచారకుడే యిట్టి యసాధారణ పాండితీప్రకర్ష గలిగియుండగా, రామకృష్ణకవి యెట్టి ప్రజ్ఞాధురంధరుండో, యష్టదిగ్గజములం దగ్రగణ్యుం డై యొప్పు పెద్దనముందు నే నసలు నిలువబడ గలనా' యని తలంచి యధైర్యమునొంది, యారాత్రి యేరికిని దెలియకుండ నెటకో వెడలిపోయెను.

మఱునా డాస్థానమున రాయలుకూర్చుండి, కుంకుమబొట్లు నాహ్వానించుటకై భటులనంపగా వారు తిరిగివచ్చి 'మహారాజా ! ఆ పండితుడు గతరాత్రముననే నగరమువిడిచి వెడలిపోయెనట' యని చెప్పిరి. రామకృష్ణుడు తానొనరించినదంతయు నెరింగింపగా రాయలు మిక్కిలి సంతోషించి సన్మానించెను. తమ యాందోళనము బాపినందులకు పెద్దనాదులెల్లరును రామకృష్ణకవిని విశేషముగా నభినందించిరి,


11 ప్రెగడరాజు నరసరాజు

ప్రెగడరాజు నరసరాజనుకవి యొకప్పుడు కృష్ణదేవరాయల భూస్థానమున కేగి 'మహారాజా! తమ యాస్థానముననున్న పెద్దన్న ' ధూర్జటి, రామరాజభూషణుడు మున్నగు కవులందఱికంటె మిన్నగ నాశుకవిత్వముం జెప్పుదును వారిపద్యములందుఁ దప్పులుపట్ట చూపింతును, ఎట్టిపద్యమైనను, నెంతకఠినముగానున్నను దప్పులేకుండవ్రాసి చూపింతును, అని చెప్పెనట రాయలు సరేయని సమ్మతించెను. పెద్దనాదికవు లొకరిమొగమువంక నొకరు చూచుకొనుచుండ, రామకృష్ణకవిలేచి, 'అయ్యా! నరసరాజకవీ! గొప్పవ్రాతకాఁడనని చెప్పుచున్నావు? నేను చెప్పు పద్యమును వ్రాసెదవా? అని యడిగెను.

'ఓహో! నిస్సంశయముగా వ్రాయుగును.'

రామకృష్ణుఁ డంతట నీక్రింది పద్యమును జదివెను.

“క, తృవ్వట బాబాతలపై
     బువ్వట జాబిల్లి నల్వబూచట! చేదె
     బువ్వట చూడగను హళు
     క్కవ్వట తలఁపంగ నిట్టి హరునకు జే జే ”

చితోచ్చారణముగల యాపద్యమును నరసరాజువ్రాయజాలక పోయెను. “సరే! వ్రాతలోని నీపసతేలిందింక మఱొక్క పద్యము జెప్పెద నర్థము చెప్పు” మని రామకృష్ణుడీపద్య ము జదివెను.

మ. కన నీహారగు పద్మపత్రధళరంగతీకార్తి! చాణూరమ
      ద్దనశుక్రాక్షికళేభరాణ్మృగపతీ! త్త్రెలోక్యదామోదరా
      యనగా శంకరవాంఛితార్థకృపదివ్యాస్తోకం పాణీజనా
      ర్థన వాహిప్రద! వైరివిగ్రహముకుందా! మిత్రవింధాధిపా!"

నరసరాజు “రామ రామ! ఇటువంటి యపశబ్దములను వినిన పాతకము వేయిజన్మములకైన తొలగదు” అనగా రామకృష్ణకవి “ఓహో! ఈ మారు నీపాండిత్యమంతయు వెల్లడియైనది, సుశబ్దములు నీకపశబ్ధములయ్యె నా? సరే నేనర్ధము చెప్పెద నాకర్ణింపుము. టీ. కనన్ = చూడగా, నీహార= హిమమువలె, గు=తేజరిల్లుచున్న , పద్మపత్ర = తామరపత్రములవలె, ధళ = తెల్లనై న, రంగత్=ఒప్పుచున్న, కీర్తి=ప్రశస్తిగలవాడా, చాణూరమత్=చాణూరుఁడను వానిని, హద=వధించినవాడా, శుక్రాక్షికళ=తెల్లనైన నేత్రములు గల కాళిందుఁడను, ఇభరాట్ = గజరాజునకు, మృగపతీ=సింహాసమానుఁడా, త్త్రెలోక్య=మూఁడులోకముల, ధామ=నివాసస్థానమైన , ఉదరా=ఉదరముగలవాడా, శంకర=శంకరునియొక్క, పాదపద్మయుగ, దివ్యాస్తోకపాణే= పాదపద్మముల భజించు, శరములతో=నొప్పువాడా, అనగా=అనిచెప్పగా, జన=జనులయొక్క, అర్ధ=కోర్కెల, నవ=క్రొత్తవైన, హి=హితముల, ప్రద=ఒసగువాడా, వైరి=శత్రువుల, విగ్రహ=పొందినను, ముకుందా=పోగొట్టువాడా, అధిపా=ఓప్రభూ, మిత్ = మృత్యు దేవతను, రవింధా=ఆజ్ఞాపింపుము.

తా. ఓ కృష్ణా! నిన్ను భక్తియుక్తులై గొల్చువారి హితాభిలాషివై , మృత్యువును దూరమొనరింతువు, అనఁగా దీర్ఘాయుష్మంతులుగాఁ జేయుదువు,

నీ కీ మహార్థ ప్రతిపాదకమైన పద్యము రుచింపక పోయెనా?

చ. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాస్థలంబునన్
    బలుకగరాకునోరి, పలుమారుఁబిశాచపుపొడగట్ట నీ
    పలికిననోట దుమ్ముపడ భావ్యమెఱుంగక పెద్దలైన వా
    రల నిరసింతురా! నినుమురా! నరసా విరసా! తుసా! భుసా.

చ. ఒకనికవిత్వ మందెనయు నొప్పులుతప్పులు; నాకవిత్వమం
    దొకనికితప్పు! బట్టపనియుండదు! కాదనితప్పుబట్టినన్
    మొగమటు క్రిందుగాదిగిచి మొక్కలువాసిన యంపకత్తితో
    సిక మొదలంటఁగోతు మఱిచెప్పునగొట్టుదు మోముదన్నుదున్.

నరసరాజు సిగ్గుపడి, మాఱుమాటాడకు0డ వెడలిపోయెను, కొలఁదిదినములు గతించినపిదప రాయలు తన తనూజయగు తిరమ లాంబతోఁ జదరంగ మాడుచుండగా, బంటు రెం డేనుఁగులమధ్య నిఱుకుకొంటఁజూచిఁ తిరుమలాంబ 'యుద్ధతుల మధ్యమునఁ బేదరుండ దరిమె, యని బంటులు పైకి ద్రోసెను. గాయలు 'నీకీ పద్యపాద మెటనుండి లభించినదని యడుగఁగాఁ దిరుమలాంబ 'నేనీపద్యమును నాలుగు దీనారములిచ్చి కొంటిని' అని, యిట్లు చదివెను.

'గీ. ఒత్తుకొనివచ్చు కటికుచోద్యృత్తి చూచి
    తరుణి తనుమధ్య మెచటికో తెలఁగిపోయె
    నుండెనేనియు : గపడకున్నె యహహ
    యుద్ధతులమధ్యమునఁ బేదకుండ దరమె'

'అయ్యో | ఆపద్యమునకు నాలుగు దీనారములు వెలయా? నూఱుదీనారము లిమ్ము' అనగా తిరుమలాంబ నరసరాజునకుఁ గబురంపి నూఱుదీనారము లొసంగి గారవించెను, 'తాను వ్రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థికావ్యమును వినవలసినదని రాయల నాతఁడు కోరఁగా, విని హరిశ్చంద్రనలోపాఖ్యాన మనరాదనియు నల హరిశ్చంద్రోపాఖ్యాన మని యుండవలయు ననియుఁ జెప్పి, యనేక రీతుల సత్కరించి, వీడ్కొలిపెను.

నరసరాజుని యుపాయమున కందఱు సంతోషభరిత హృదయాంతరులైరి.

కవితాప్రసక్తి

శ్రీకృష్ణదేవరాయలొకనాఁడు సభాస్థలి గూర్చుండి, కవులెల్లరును వినునట్లు రామకృష్ణుని జూచి 'కవివరేణ్యా ! పెద్దన కవీంద్ర విరచితమైన మనుచరిత్రమున తిమ్మన్నకవి రచించిన పారిజాతాపహరణమున రామరాజభూషణుని వసుచరిత్రమున నొకేసందర్భమున వ్రాయఁబడునట్లుండు నీ క్రింది పద్యములోని కవితామాధుర్యమును గ్రోలి నీయభిప్రాయముఁ దెలియఁ జేయవలయును.