Jump to content

తెనాలి రామకృష్ణకవి చరిత్రము/నూరుతప్పులకు ఫర్మానా

వికీసోర్స్ నుండి

తెలతెలవారుచుండెను. ఒక దొంగ మఱల బావిలోనికిదిగి వెదకివెదకి మూటను పైకిదీసివిప్పెను. అందు రాళ్ళు కన్పింపగానే దొంగలు నిస్పృహచెంది. రామకృష్ణకవి తమకు తగిన ప్రాయశ్చిత్తమొనరించె నని వెడలిపోవునంతలో రామకృష్ణుడు ఓరీ! చోరులారా! మీ పుణ్యమా యని ఒకటిరెండు మొక్కలుదప్ప పూలమొక్కలన్నియుఁ దడిసినవి. మీధర్మమాయని యారెండు మొక్కలనుగూడ నను నంతలో దొంగలు గోడదుమికి పాఱిపోఁబోయిరి. సరిగా నావేళకామార్గముననే బోవుచున్న రక్షకభటులు చోరులను బంధించి మఱల కారాగారమునద్రోసిరి. రామకృష్ణు డీవృత్తాంతమును రాయలకు దెలిపి, యానందము కలిగించెనట.

6 నూరు తప్పులకు ఫర్మానా

రాయలు కొలఁదిపరివారము వెంటరా, కవిబృందముతోఁ గలసి వాహ్యాళికై భద్రానదినిదాఁటి చాలదూరమరిగెను. కనిగిరి పరిపాలకుఁడైన వీరభద్రగజపతి సేనానియగుపసరము గోవిందరాజను దండనాథుఁడు రాయలను బంధించుట కిదియే తగిన యదననియెంచి. ససైన్యముగ రాయల నెదుర్కొనెను. రాయల ననుసరించియున్న కొలఁదిమంది సైనికులును గోవిందరాజు ప్రతాపాగ్ని కోపఁజాలక పలాయన మవలంబించిరి. రాయలు ధైర్యముతో కవులవంకఁ జూచి ' కవీంద్రులారా ! ఈ విషమసమయమున వెనుకంజవేయరాదు. మీరు నాకు విజయము ప్రాప్తించునట్లాశీర్వదింపున, క్షణకాలములో గోవిందరాజును కృతాంతమందిరమున కతిథిగా నొనరించివత్తును' అని పలికి శత్రురంగమునకురికి యెచ్చట జూచినఁ దానెయై మెలం గుచు గోవిందరాజు సైనికులు చెల్లాచెదరగు నట్లొనరించెను. అది చూచి గోవిందరాజు రెట్టించిన క్రోధోద్రేకముతో రాయలపై గవిసెను. ఇరువురునుభయంకరముగ పోరాడుచున్న సమయమున రామకృష్ణుడుధైర్యముగ గోవిందరాజు వినునట్లీ క్రిందిపద్యములఁ జదివెను.

'క. బసవనకు బుట్టినప్పుడె
    పసరము గోవిందరాజు పసరంబైన౯
    గనవేటికి దినఁడనఁగాఁ
   గసవుందిను శత్రులాజిఁ గదిసినవేళన్. '

ఆ పద్యము నిశితశూలమువలె చిత్తమునకు దాకఁగాగోవిందరాజు వెంటనే రుధిరము నోటఁ గ్రక్కుకొని క్రిందబడి విలవిల దన్నుకొనుచుఁ బ్రాణములువిడిచెను. రామకృష్ణుని పద్యము విని గోవిందరాజు విగతజీవుఁడగుటతోడనే తక్కుంగల సైనికులు చెల్లాచెదరై పాఱిపోయిరి. రామకృష్ణుని మహిమ కెంతయు నలరి, 'రాయలు 'రామకృష్ణకవీ! నీమహాత్మ్య మేనెఱుంగనైతిని. ఈవిషయమున కీవు కారణభూతుఁడవు, నీ కేమి కావలయునో కోరుకొను' మనగా మన కవి యిట్లనెను-

‘మహారాజూ! నాపై తమకు దయయున్నఁ జాలును, నా కదియే పది వలు. తాము కోరుకొనమంటిరిగాన యొక చిన్నవరమడిగెదను. నేను చేయు తప్పులు దినమునకు నూఱింటివరకు క్షమించుచుండ గోరెదను. నాకఁతియే చాలును.

'నూరుకాదు ఎన్ని తప్పులైనను క్షమింతును.' అని రాయలు వచించెను. నాటినుండి రామకృష్ణుడు నిర్భయముగఁ గొంటెబనుల జేయుచుండెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.