తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 194
రేకు: 0194-01 కన్నడగౌళ సం: 02-480 అధ్యాత్మ
పల్లవి:
ఎవ్వరి నేమనఁగల నెంతబలువుఁడ నేను
నవ్వుచు నీవే యిఁక నన్ను మన్నించవయ్యా
చ. 1:
కామక్రోధములకు కాణాచికాఁపను
ఆమని యింద్రియముల కడిబంటను
దీమనపు టాసలకు తీరని లగ్గస్థుఁడను (?)
యీ మరఁగువాఁడ నిన్ను నెట్టు గొలిచేనయ్యా
చ. 2:
పాయని సంసారానకు బడివనివాఁడను
కాయపుభోగాల వూడిగపువాఁడను
పాయపు మదములకు పంగెమైనవాఁడను (?)
యీయెడ నీవాఁడ నని యెట్టు గొలిచేనయ్యా
చ. 3:
సరిఁ గర్మములకెల్ల చనవరి బొడుకను
పొరలే జన్మముల యప్పులవాఁడను
అరయ శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
యిరవై ఇట్టుండకున్న నెట్టు గొలిచేనయ్యా
రేకు: 0194-02 దేసాక్షి సం: 02-481 అధ్యాత్మ
పల్లవి:
ఎఱుఁగువా రెరుఁగుదు రీయర్థము
యెఱఁగనివారి కిది యెఱఁగనియ్యదు
చ. 1:
మొదలఁ గలుగువాఁడే ముందరనుఁ గలవాఁడు
అదన నాతఁడే పరమాత్ముఁడు
యెదుటఁ గలిగినదే ఇన్నిటాఁ గలిగినది
పదపడి యిదియే ప్రపంచము
చ. 2:
చెడనిదానికి మరి చేటెన్నఁడును లేదు
జడిగొన్న దిదియే సుజ్ఞానమార్గము
వుడివోఁ గల దెన్నఁడు వుడివోఁ గలిగినదీ
కడగడనే తిరుగు కర్మమార్గము
చ. 3:
యెంచి తొల్లి నడిచేవే ఇపుడును నడచేవి
మంచి శ్రీవేంకటేశ్వరు మహిమ లివి
అంచ నిపుడు గానని వల్లనాఁడుఁ గాననివే
మంచువంటి విషయపు మాయావాదములు
రేకు: 0194-03 లలిత సం: 02-482 వైష్ణవ భక్తి
పల్లవి:
కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరా లిఁకనేలా వెదక
చ. 1:
నిచ్చలుఁ గోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుఁ జేయ నీతీర్థమే చాలు
పచ్చిపాపా లణఁచ నీప్రసాదమే చాలు
యెచ్చుకొందు వుపాయాలు ఇఁకనేల వెదక
చ. 2:
ఘనునిఁ జేయఁగను నీకైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీముద్రలే చాలు
మనిపి కావఁగఁ దిరుమణిలాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇఁకనేల వెదక
చ. 3:
నెలవైన సుఖమియ్య నీధ్యానమే చాలు
అల దాపుదండకు నీయర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకుఁ గలవు
యెలమి నితరములు యిఁకనేల వెదక
రేకు: 0194-04 దేసాళం సం: 02-483 నృసింహ
పల్లవి:
కైవల్యమునకంటే కైంకర్య మెక్కుడు
శ్రీవిభుఁడ నీవు మాకుఁ జిక్కేమర్మ మిదివో
చ. 1:
చేపట్టి నీశిరసు పూజించే అహమికకంటే
నీపాదాలు పూజించే నేను మొక్కుడు
మాపుదాఁకా నినుఁగొల్చి మందెమేళమౌకంటే
దాపగు నీదాసుల శేషత్వ మెక్కుడు
చ. 2:
హరి నీపస్రాదజీవినై గర్వించుటకంటే
నరయ నీదాసులలెంకౌ టెక్కుడు
వెరవున నీచెవిలో విన్నపాలు సేయుకంటే
ధర నీవూడిగకాండ్లఁ దలఁపించు టెక్కుడు
చ. 3:
జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకంటే
అట్టె నీనామఫలమందు టెక్కుడు
ఇట్టె శ్రీవేంకటేశ యేలితి విందువంకనే
తిట్టపు మాగురు నుపదేశ మెక్కుడు
రేకు: 0194-05 శ్రీరాగం సం: 02-484 శరణాగతి
పల్లవి:
నావల్ల నీ కేమున్నది నారాయణ నీవు నన్ను
కావించి రక్షించే వుపకార మింతే కాక
చ. 1:
సొమ్ము దినఁబుట్టినట్టి సోమరిబం టేలికకు
ఇమ్ముల నందుకుఁ బ్రతి యేమి సేసీని
చిమ్ముచు నాతఁడు నేమించిన పనివాటలలో
వుమ్మడిఁ జేసేటి వట్టివూడిగాలే కాక
చ. 2:
ఆసపడి వచ్చినట్టి అతిథి బలురాజుకు
రాసిసేసి యేమిచ్చిన రతికెక్కీని
బేసబెల్లితనమున ప్రియాన నిచ్చకమాడి
మూసి దైన్యపుఁ జేతుల మొక్కు లింతే కాక
చ. 3:
శరణాగతుఁడ నీకెచ్చట శ్రీవేంకటేశుఁడ
దొరనై యేమిట సరిఁదూఁగఁగలను
ధరలోన నీవు దయదలఁచి నన్నేలుకోఁగా
పరగు నీమఱఁగున బదుకుదుఁ గాక
రేకు: 0194-06 రామక్రియ సం: 02-485 వైష్ణవ భక్తి
పల్లవి:
అదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు
యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో
చ. 1:
ఆనాయుధో సో అసురా అదేవా యని
వినోదముగ బుగ్వేదము దెలిపెడి
సనాతనము విష్ణుచక్రధారణకును
అనాది ప్రమాణ మందే తెలియరో
చ. 2:
యెచ్చ యింద్రే యని "యచ్చ సూర్యే" యని
అచ్చుగ తుద కెక్కె(క్క?) నదే పొగడీ శ్రుతి
ముచ్చట గోవిందుని ముద్రాధారణకు
అచ్చమయిన ప్రమాణ మందే తెలియరో
చ. 3:
మును "నేమినా తప్తముద్రాం ధారయే" త్తని
వెనువెంట శ్రుతి యదె వెల్లవిరి సేసీని
మొనసి శ్రీవేంకటేశు ముద్రాధారణకు
అనువుగఁ బ్రమాణ మందే తెలియరో