తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 193

వికీసోర్స్ నుండి


రేకు: 0193-01 దేసాళం సం: 02-474 శరణాగతి

పల్లవి:

ఇంతటఁ బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల
దొంతి ఇంద్రియాలకెల్లఁ దొలఁగి వుంటేను

చ. 1:

మాటలాడవచ్చుఁ గాని మనసులు పట్టరాదు
చాటువకెక్కినయట్టి సతులఁ గంటే
కోటి చదువఁగవచ్చు కోపము నిలుపరాదు
జూటరై వొకఁడు దన్ను సోఁకనాడితేను

చ. 2:

అందరి దూషించవచ్చు నాసలు మానఁగరాదు
కందువైన మించుల బంగారు గంటే
అందాల మొక్కఁగవచ్చు హరిభక్తి సేయరాదు
పొందుల సంసారపు భోగము గంటేను

చ. 3:

మొదలఁ బుట్టగవచ్చు మోక్షముఁ బొందఁగరాదు
పొదిగి పుణ్యరాసుల భోగము గంటే
యెదుట శ్రీవేంకటేశ ఇదివో నీశరణంటే
కదిసితి నిట్టే పో నీకరుణ గంటేను


రేకు: 0193-02 లలిత సం: 02-475 శరణాగతి

పల్లవి:

అంతర్యామీ అలసితి సొలసితి
యింతట నీ శరణిదె చొచ్చితిని

చ. 1:

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా

చ. 2:

జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచకా

చ. 3:

మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవని వద్దనకా
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా


రేకు: 0193-03 మలహరి సం: 02-476 వైరాగ్య చింత

పల్లవి:

మగఁడు విడిచినా మామ విడువనియట్టు
నెగడిన వేమిసేయు నేనే రోయఁ గాని

చ. 1:

నరకము నను రోసి సురలోకాన విడిచె
నిరయముతోవ రోసి నేనే విడువఁ గాని
పరగి యోనులు రోసి బట్టబాయిట వేసే
సొరిది యోనుల రోసి చోరక నే మానఁ గాని

చ. 2:

పాపము రోసి నన్ను ప్రపంచాన విడిచె
పాపము సేయక రోసి పట్టకుండఁ గాని నేను
యేపున దేహము రోసి యింద్రలోకాన విడిచె
కైపువేసి రోయక నేఁగాయము మోచితిఁ గాని

చ. 3:

మాయలెల్ల నన్ను రోసి మనసులోన విడిచె
మాయల నే విడువక మగుడఁ దగిలేఁ గాన
నాయల(?) వేమి విడిచినాను శ్రీవేంకటేశ
పాయక నన్నేలితి నీభాగ్యము విడువఁ గాని


రేకు: 0193-04 ధన్నాసి సం: 02-477 అధ్యాత్మ

పల్లవి:

ఒక్కమనసున నే నుండేఁగాక
యెక్కడిపనులు దానే యెఱఁగఁడా

చ. 1:

బలుదేహ మిచ్చువాఁడు ప్రాణము వోసినవాఁడు
తలఁపొసగినవాఁడు దైవమేకాఁడా
వెలుపలి లంపటాలు వేవేలు గడించి తాను
మలసి ఇంతలో నన్ను మఱచీనా

చ. 2:

జగము లేలేటివాఁడు సంసారిఁ జేసినవాఁడు
తగులై యుండినవాఁడు తానేకాఁడా
బెగడకుండ దినాలు పెరుగఁజేసేటివాఁడు
తగినట్టు నడపించఁ దా నేరఁడా

చ. 3:

మొదలై యుండేటివాఁడు ముందరఁ దుదయ్యేవాఁడు
యెదలోవాఁడు శ్రీవేంకటేశుఁడే కాఁడా
చదివించి బుద్ధులిచ్చి చైతన్యమైనవాఁడు
పొదిగి నాదాపుదండై భోగించఁడా


రేకు: 0193-05 సాళంగనాట సం: 02-478

పల్లవి:

దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో
భావించ నింతటిలో భూభారమెల్ల నణగె

చ. 1:

నేఁడు కృష్ణుఁడు జనించె నేఁడే శ్రీజయంతి
నేఁడే రేపల్లెలోన నెలవైనాఁడు
వేఁడుక యశోదకు బిడ్డఁడైనాఁడిదె నేఁడే
పోఁడిమి జాతకర్మ మొప్పుగనాయ నేఁడు

చ. 2:

ఇప్పుడిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము
ఇప్పుడు తొట్టెల నిడి రింతులెల్లాను
చెప్పరాని బాలలీల సేయఁగలదెల్లాఁ జేసి
కప్పెను విష్ణుమాయలు గక్కన నేఁడిపుడు

చ. 3:

ఇదివో వసుదేవుని ఇంటిచెరలెల్లఁ బాసె
ఇదివో దేవకితప మిట్టె ఫలించె
చెదరక తా నిలిచె శ్రీవేంకటాదిపై నిదె
యెద నలమేలుమంగ యెక్కివున్న దిదివో


రేకు: 0193-06 బౌళి సం: 02-479 అధ్యాత్మ వైరాగ్య చింత

పల్లవి:

హితవే సేసుఁ గాకాతఁడేల మానును
మితి నాతని దూరక మెచ్చవలెఁ గాక

చ. 1:

ఆగమభోగములకు హరి నాలో నున్నవాఁడు
చేగదేర నాకు మేలే చింతించుఁ గాక
సాగిన ప్రపంచములో సంసారిఁ జేసినవాఁడు
యే గతి రక్షించఁ దానే ఇన్నిటికౌఁ గాక

చ. 2:

భూమిమీఁద దేహమిచ్చి పుట్టించినట్టివాఁడు
ప్రేమతో నన్నపానాలు పెట్టుఁ గాక
ఆమని పంచేంద్రియాల నటు పెడరేఁచేవాఁడు
నేమపు బుత్రదారలై నిండుకుండు గాక

చ. 3:

ఇహపరములకుఁ దా నిరవైనట్టివాఁడు
సహజాన నన్నియును జరపుఁ గాక
వహి శ్రీవేంకటాద్రిపై వరములిచ్చేటివాఁడు
మహిమతో మమ్మునేలి మన్నించుఁ గాక