Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 192

వికీసోర్స్ నుండి


రేకు: 0192-01 బౌళి సం: 02-468 గురు వందన. నృసింహ

పల్లవి:

నిరుహేతుకాన నన్ను నీవు రక్షించే వింతే
నిరతి నాకోరకే పో నిను సేవించేది

చ. 1:

ముందు సిరులిత్తువని మోక్షము నీ విత్తువని
బందుకట్టుదు దుఃఖములఁ బాపుదువని
యిందలి యాసలనేపో యేచిన నాభయభక్తి
యెందును నావల్ల నీకు నించుకంతా లేదు

చ. 2:

జననాలు చూచి చూచి సరి మరణాలు చూచి
వెనకటి నీకథలు వినివిని
వినుపై యాయాసవేపో విన్ను సారెఁ బొగడేది
వొనర నీయాసేపో వుపకారగురువు

చ. 3:

లోకులు గొలువఁగాను లోన నీవు వుండఁగాను
దీకొని గురుఁడు బోధించఁగాను
కైకొని శ్రీవేంకటేశ కరుణించగా నీవు
దాకొని యీయాసకే నీదాసినై కొలిచితి


రేకు: 0192-02 సాళంగం సం: 02-469 భక్తి

పల్లవి:

నానాభక్తులివి నరుల మార్గములు
యే నెపాననైనా నాతఁ డియ్యకొను భక్తి

చ. 1:

హరిఁకిఁగా వాదించు టది ఉన్మాదభక్తి
పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి
అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి
అరమరచి చొక్కుటే ఆనందభక్తి

చ. 2:

అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి
ఆతని దాసుల సేవే అదియే తురీయభక్తి
క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి
అతఁడే గతని వుండుటది వైరాగ్యభక్తి

చ. 3:

అట్టె స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మలభక్తి
గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి
తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి


రేకు: 0192-03 సాళంగనాట సం: 02-470 దశావతారములు

పల్లవి:

కంటిరా వింటిరా కమలనాభుని శక్తి
వొంటి నితని శరణ మొకటే వుపాయము

చ. 1:

యీతని నాభిఁ బొడమె యెక్కువైన బ్రహ్మయు
యీతఁడే రక్షించినాఁడు యింద్రాదుల
యీతఁడాకుమీఁద దేలె నేకార్ణవమునాఁడు
యీతఁడే పో హరి మనకిందరికి దైవము

చ. 2:

యీతడే యసురబాధ లిన్నియుఁ బరిహరించె-
నీతని మూఁడడుగులే యీ లోకాలు
యీతఁడే మూలమంటే నేతెంచి కరిఁ గాచె
నీతనికంటే వేల్పు లిఁక మరి కలరా

చ. 3:

యీతఁడే వైకుంఠనాథుఁ దీతఁడే రమానాథుఁ-
డీతఁడే వేదోక్తదైవ మిన్నిటాఁ దానె
యీతఁడే అంతర్యామి యీ చరాచరములకు
నీతఁడే శ్రీవేంకటేశుఁ డిహపరధనము


రేకు: 0192-04 సామంతం సం: 02-471 నృసింహ

పల్లవి:

సింగారమూరితివి చిత్తజగురుడఁవు
సంగతిఁ జూచేరు మిమ్ము సాసముఖా

చ. 1:

పూవులతెప్పలమీఁద పొలఁతులు నీవు నెక్కి
పూవులాకసము మోవఁ బూచి చల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు గొలువఁగా
సావధానమగు నీకు సాసముఖా

చ. 2:

అంగరంగవైభవాల నమరకామినులాడ
నింగినుండి దేవతలు నిన్నుఁ జూడఁగా
సంగీతతాళవాద్య చతురతలు మెరయ
సంగడిఁ దేలేటి మీకు సాసముఖా

చ. 3:

పరగఁ గోనేటిలోన పసిడి మేడనుండి
అరిది నిందిరయు నీవారగించి
గరిమ శ్రీవేంకటేశ కనులపండువ గాఁగ
సరవి నోలాడు మీకు సాసముఖా


రేకు: 0192-05 శంకరాభరణం సం: 02-472 అధ్యాత్మ

పల్లవి:

పట్టలేని మన భ్రమగాక
నెట్టనఁ దాఁ గరుణించని వాఁడా

చ. 1:

హితప్రవర్తకుఁ డీశ్వరుఁడు
తతి నంతరాత్మ తాఁ గాన
రతి నాతని దూరఁగనేలా
గతియని తలఁచిన కావనివాఁడా

చ. 2:

తెగని బంధువుఁడు దేవుఁడు
బగివాయఁ డిహముఁ బరమునను
అగపడి సందేహములేలా
తగ నమ్మిన దయదలఁచనివాఁడా

చ. 3:

హృదయము శ్రీవేంకటేశ్వరుఁడు
మెదలనే ఆనందమూర్తిగన
కదిసి వెలిని వెదకఁగనేలా
యెదురఁ గనిన వరమియ్యనివాఁడా


రేకు: 0192-06 గుండక్రియ సం: 02-473 అధ్యాత్మ

పల్లవి:

తానే తెలియుఁ గాక తలఁచఁగ నెట్టువచ్చు
నానాగతుల తన నాటకపుమాయ

చ. 1:

అట్టె యేఁబదియైన యక్షరాలలోనట
తిట్టులట వొకకొన్ని దీవెనలటా
మట్టుతో వేదములట మంత్రములట కొన్ని
యిట్టివి చిక్కులు భూమి నిఁకనెన్ని గలవో

చ. 2:

కదిసిన యఱువదిగడియలలోనట
పొదలు నడకలట భోగములటా
నిదురట వొకకొంత నేరుపులు కొన్నియట
యెదుట చూడఁగఁ జూడ నిఁక నెన్ని గలవో

చ. 3:

రేవగలు కన్నులివి రెంటిలోనేయట
దైవము జీవులలోనే తానకమట
శ్రీవేంకటాద్రిమీఁద జెలఁగి యా(గెనా?)తఁడే యట
యేవంక నీచేఁతలు యిఁక నెన్నిగలవో