Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 195

వికీసోర్స్ నుండి


రేకు: 0195-01 పాడి సం: 02-486 అంత్యప్రాస

పల్లవి:

ఇట్టి బ్రాహ్మణ్య మెక్కుడు యిన్నిటిలోన
దట్టమై తదియ్యులకె తగును బ్రాహ్మణ్యము

చ. 1:

హరిఁ గొలిచేవారి కమరు బ్రాహ్మణ్యము
పరమవైష్ణవమే పో బ్రాహ్మణ్యము
హరిణోర్ధ్వపుండ్రదేహులౌటే బ్రాహ్మణ్యము
తిరుమంత్రవిధులదే తేఁకువ బ్రాహ్మణ్యము

చ. 2:

సతమై చక్రాంకితుల చరితే బ్రాహ్మణ్యము
పతి శరణాగతియే బ్రాహ్మణ్యము
వెతలేని వీరలసాత్వికమే బ్రాహ్మణ్యము
తతి ద్వయాధికారులే తప్పరు బ్రాహ్మణ్యము

చ. 3:

అంచఁ బరమభాగవతాధీనము బ్రాహ్మణ్యము
పంచంసంస్కారాదులదే బ్రాహ్మణ్యము
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డితఁడేఁ బ్రాహ్మణ్యుఁడు
ముంచి యీతనివారౌటే మొదలి బ్రాహ్మణ్యము


రేకు: 0195-02 మాళవిగాళ సం: 02-487 దశావతారములు

పల్లవి:

వీదులవీదులనెల్లా విష్ణుఁడు సంచరించీని
పోది మాని కన్నగతై పొండు మీరసులలు

చ. 1:

తేరుమీఁద నెక్కీ నేఁడు దేవోత్తముఁడు వాఁడె
సారమైన శంఖచక్రశార్జాయుధము లవే
కారుకమ్మీ నాకాసాన గరుడధ్వజం బదే
పారరో దానవులాల పంతములు విడిచి

చ. 2:

దండవెట్టె నల్లవాఁడే దైవాలరాయుఁడు
దండి నెట్టెపుఁజుట్ల తపారపు చుంగు లవే
కొండవంటి రథ మదె కొన పైఁడికుండలవే
గుండుగూలి విరుగరో గొబ్బున దైతేయులు

చ. 3:

విజయశంఖము వట్టె వీఁడె శ్రీవేంకటేశుఁడు
భజన నలమేల్మంగ పలుమారు మెచ్చీనదె
త్రిజగాన నాతనిఁ జేరినదాసు లిదె వీరె
గజబెజ లిఁక నుడుగరో రాక్షసులు


రేకు: 0195-03 లలిత సం: 02-488 శరణాగతి

పల్లవి:

కామధేనువిదె కల్పవృక్షమిదే
ప్రామాణ్యముగల ప్రపన్నులకు

చ. 1:

హరినామజపమే ఆభరణంబులు
పరమాత్ముని నుతి పరిమళము
ధరణిధరు పాదసేవే భోగము
పరమంబెరఁగిన ప్రపన్నులకు

చ. 2:

దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము
ఆ విష్ణుకైంకర్యమే సంసారము
పావనులగు యీప్రపన్నులకు

చ. 3:

యేపున శ్రీవేంకటేశుఁడే సర్వము
దాపై యితని వందనమే విధి
కాపుగ శరణాగతులే చుట్టాలు
పైపయి గెలిచిన ప్రపన్నులకు


రేకు: 0195-04 మాళవిగౌళ సం: 02-489 అధ్యాత్మ

పల్లవి:

నీచిత్త మిందరినేరుపు నేరమి
తోచి కాచి యిటు తుద కీడెర్చె

చ. 1:

దేవతలపాలు తీరని పుణ్యము
ఆవలఁ బాపం బసురలది
భావింప మనుజులపాలివి రెండును
శ్రీవల్లభ నీనేసిన మాయ

చ. 2:

వేదశాస్త్రములు విజ్ఞానమూలము
ఆది నసత్యము లజ్ఞానమూలము
సాదింప రెండును జగత్తుమూలము
భేదించి యివి నీపెరరేఁపణలు

చ. 3:

కావింపఁ గర్మము కాయము చేతిది
భావము చేతిది పరమము
తావుల రెండునుఁ దప్పని ప్రకృతివి
శ్రీవేంకటేశ్వర చేఁతలు నీవి


రేకు: 0195-05 దేవగాంధారి సం: 02-490 వైరాగ్య చింత

పల్లవి:

అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు
వొడ్డిన దనుభవించే దోపిక జీవులది

చ. 1:

యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు
కోరికల గొనసాగెఁ గోటానఁగోటి
నారుకొనె సంపదలు నానారూపములై
తీరదేమిటా నీచిక్కు దేవుఁడు వెట్టినది

చ. 2:

అల్లుకొనెఁ గర్మములు అక్కడికి నిక్కడికి
వెల్లవిరాయను మాయ వెనకా ముందు
కెల్లురేఁగె దేహమందే కిమ్ముల చుట్టరికాలు
పొల్లువో దెన్నఁడు భూమి పుట్టగాఁ బుట్టినది

చ. 3:

పండెను సంసారము ఫలమైన నానాఁటికి
నిండెను నాలికకు నెమ్మదిఁ జవులు
అండనే శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి
వండ వండనట్లుగ (?) వన్నె కెక్కెంచినది


రేకు: 0195-06 శంకరాభరణం సం: 02-491 దశావతారములు

పల్లవి:

ఎంతకెంత యిది యేమని పొగడుట
యింత సేయ నీకు నెదురా వీరు

చ. 1:

పిడుగులఁ బోలెడి పెను నీ నఖములఁ
కెడయక హిరణ్యుఁ డెట్లుండెనో
వుడికెటి చక్రాయుధము వేఁడికిని
జడియక మకరెటు వహించెనో

చ. 2:

శరపరంపరల శిరములు నఱకఁగ
యెరగొని రావణుఁ డేమనెనో
పరియలు వారఁగ బ్రహ్మాండభాండము
ఉరుశంఖరవం బోర్చుట యెట్లో

చ. 3:

గాఁటపు నిష్ఠురగదాహతికి మధు-
కైటభుల తలల కత లెట్లో
యీటున శ్రీవేంకటేశ నీకృపను
పాటించి దాసులు బ్రదుకుట యెట్లో