Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 188

వికీసోర్స్ నుండి


రేకు: 0188-01 గుండక్రియ సం: 02-444 శరణాగతి

పల్లవి:

నీవే సేసిన చేఁత నీవే చేకొనుటింతే
యీవల నీసొమ్ము నీకే ఇయ్య సిగ్గయ్యీనయ్యా

చ. 1:

అలుబిడ్డలఁ గని యటు దనమగనికి
సీలాన సమర్పణ సేయవలెనటవయ్యా
తాలిమిఁ బుణ్యాలు సేసి దైవమా నే నీకు
యేలీల సమర్పించే నిందుకే నవ్వు వచ్చీనయ్యా

చ. 2:

అంకెలఁ గన్నకొడు కటు దమతండ్రికిని
తెంకి నే నీవాఁడ నని తెలుపఁగవలెనటవయ్యా
లంకె నాలోపలనున్నలక్ష్మీశ నే నీకు
పొంకపు నీబంట నన్నఁ బునరుక్తయ్యీనయ్యా

చ. 3:

తననీడ యద్దములోఁ దానే యటు చూచి
పనివడి వూరకే భ్రమయవలెనటయ్యా
అనుగు శ్రీవేంకటేశ ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ గడఁ బూజించనేలయ్యా


రేకు: 0188-02 బౌళి సం: 02-445 అధ్యాత్మ

పల్లవి:

అనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన (నా?)
ఘనపవిత్రమైనట్టు ఘనుఁడే పో జ్ఞాని

చ. 1:

కాంచనము అంటువడినఁ గలదా అందు నింద్యము
పెంచు ముట్టంటువడినఁ బెక్కువ దూష్యము గాక
అంచల సుజ్ఞానిఁ బాపమంటునా తాఁ జేసినాను
పంచల నజ్ఞానినైతేఁ బైకొనిఁ గాక

చ. 2:

యెఱుకగల నాలిక నింతైనా జిడ్డంటునా
యెఱుకలేనిచేత నింతా జిడ్డంటుఁ గాక
కఱతలయోగిని కర్మములివంటునా
చుఱచుఱ జడునైతేఁ జుట్టుకొనుఁ గాక

చ. 3:

తామెరపాకుల నీరు తగ నందు నంటునా
ఆమేర నెందైనాను నంటుఁ గాక
యీమేర శ్రీవేంకటేశుని దాసుఁడు భూమిఁ
గామించి తా నుండినానుఁ గడు మాయలంటునా


రేకు: 0188-03 చాయానాట సం: 02-446 దశావతారములు

పల్లవి:

కమ్మంటేఁ గావా కాఁగల వన్నియు
చిమ్ముల మాయలు సేయఁగనేలా

చ. 1:

సరసిజాక్ష నీసంకల్పమాత్రము
అరుదగు ఘనబ్రహ్మాండ మిది
అరయఁగ ధరలో నల్పపుఁ బనులకు
హరి యవతారం బందితివేలా

చ. 2:

సతత సురాసుర జననమరణములు
మతి నీహుంకారమాత్రములు
గతియై యమృతము గల్పించుకొరకును
తతి ఘోరజలధి దచ్చితివేలా

చ. 3:

ఈ వైకుంఠము యీశేషగిరే
మహి నీ దర్శనమాత్ర మిది
విహరింపఁగ శ్రీవేంకటేశ యిటు
బహులోకపుకల్పన లవి యేలా


రేకు: 0188-04 సామంతం సం: 02-447 దశావతారములు

పల్లవి:

రాచాజ్ఞ మరలించ రాజే కర్తగాన
యేచి నీకు శరణంటి నిది మానుపవే

చ. 1:

కడు నహంకరించినను తొల్లి ఘనుడు నారదమౌని
బెడిదపుటింతిఁ జేసి నీమాయ ఆతని బిడ్డలఁ గనిపించెను
అడరి నే ననఁగా నెంతటివాడను అది నేఁ గడపఁగలనా
తడవి నే శరణంటి దనుజారి ఆమాయ దగ్గరకుండఁగఁ జేయవే

చ. 2:

మహి మిమ్ము మోచేనని మున్ను మదించిన గరుడనిని
సహజపు నీ హస్తము మోయకుండఁగ శక్తి హరించె నీమాయ
బహుముఖముల నే నెంతటివాఁడను పాయఁగ నీమాయ
అహిశయనుఁడ నే నీశరణంటివి అది నన్ను దగ్గరకుండఁ జేయవే

చ. 3:

సారపు శ్రీవేంకటేశ స్వతంత్రుఁడవు నీవు
గారవపు మాయ నీదే కమ్మి నే నీవాఁడనే
మారుదైవములు లేరు మరి నన్నుఁ గావ నిన్నుఁ
జేరుకొని శరణంటిఁ బెడఁబాపు మాయ


రేకు: 0188-05 మాళవి గౌళ సం: 02-448 కృష్ణ

పల్లవి:

ఎందుకు విచ్చేయనేల ఇన్నియు నాలోనివే
అంది యివే చేకొనవే ఆరడి నీకేల

చ. 1:

కాముకుఁడవై గోపికలఁ బొందఁ బ్రియమైతే
కాముకత్వము నాయందుఁ గలదెంతైనా
గోమున కంసాదులపై క్రోధమే ప్రియమైతే
నాముల క్రోధ మిదివో నాలో నున్నది

చ. 2:

లోకుల చీరలీకుండే లోభమే ప్రియమైతే
యీకడ లోభము నాలో హెచ్చినదిదే
మాకులు మద్దులు దొబ్బేమదమే ప్రియమైతే
చేకొను మదము నాలో సేనాసేన

చ. 3:

మఱి శిశుపాలునిపై మచ్చరమే ప్రియమైతే
మెఱయు మత్సర మిదే మించీ నాలో
తఱి శ్రీవేంకటపతి దాసులపై మోహము
నెఱి నీకుఁ బ్రియమైతే నేనేకానా


రేకు: 0188-06 శంకరాభరణం సం: 02-449

పల్లవి:

కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా
తానకమై నీకంటే దాస్యమే పో ఘనము

చ. 1:

యెనసి ప్రహ్లాదుఁడు యెక్కడఁ జూపునోయని
ననిచి లోకమెల్ల నరసింహగర్భములై
పనివూని వుంటి వటు భక్తపరతంత్రుఁడవై
తనిసి నీ వధికమో దాసులే యధికమో

చ. 2:

మక్కువ బ్రహ్మాదులు మానుపరాని కోపము
ఇక్కువై ప్రహ్లాదుఁడు యెదుట నిలిచితేను
తక్కక మానితి వట్టే దాసుని యాధీనమై
నిక్కి నీకింకరుఁడే నీకంటే బలువుఁడు

చ. 3:

ఆరసి కమ్మర ప్రహ్లాదవరదుఁడని
పేరువెట్టుకొంటి విట్టే బెరసి శ్రీవేంకటేశ
సారె నీశరణాగతిజనుని కాధీనమైతి-
వీరీతి నీదాసునికే యిదివో మొక్కేము