తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 189

వికీసోర్స్ నుండి


రేకు: 0189-01 ధన్నాసి సం: 02-450 శరణాగతి

పల్లవి:

అటుగాన మోసపోక హరి నీకే అన్నియును
ఘటియించుటే యెక్కుడు కమలారమణ

చ. 1:

నిన్నుఁజూడని కన్నులు నీచువలకన్నులు
చిన్ని నీకథవినని చెవులు రాట్నపుఁ జెవులు
వున్నతి నీకడకు రాకున్న కాళ్లు మరగాళ్లు
సన్నుతిసేయని జిహ్వ హరి నుపజిహ్వ

చ. 2:

చేరి నిన్నుఁ బూజించని చేయి దంతెనపుఁజేయి
తారి నీకు మొక్కనట్టి తలయే పెడతల
సారె నీముద్రలేని భుజములు బుద్బుజములు
తేరి నీదాస్యములేని దేహము సందేహము

చ. 3:

వనమాలలున్న గ్రీవము కంబుగ్రీవము
ఘన మిది దెలియుటే కైవల్యము
యెనయ శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
అనుమానమెల్లఁ బాసె నన్నిటా నాకును


రేకు: 0189-02 సామంతం సం: 02-451 కృష్ణ

పల్లవి:

అందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁదిపని కింతే
ఇందు నందు నీవే కర్త విందిరారమణ

చ. 1:

ఇంచుకంత వేలఁ గొండ యెత్తిన దేవుఁడవు
ముంచి నాసంసారభారము మోవలేవా
అంచల దేవతలకు నమృతమిచ్చిన నీవు
కంచాన నన్నమువెట్టి కాచుట నన్నెంత

చ. 2:

వడి ద్రౌపది కక్షయ వలువలిచ్చిన నీవు
బెడఁగు నాకుఁ గట్ని(ట్టని?) చ్చి పెంచుటెంత
జడసి యింద్రాదులకు సంపదిచ్చినట్టి నీవు
కడు నాకు నైహికభోగము లిచ్చు టెంత

చ. 3:

పొసఁగ లోకములెల్లఁ బూర్ణుఁడవైన నీవు
వుసురై నాలోన (నే?) నీవు వుండుటెంత
వసుధ శ్రీవేంకటేశ వరములిచ్చే నీకు
దెస నాకోరికెలెల్లాఁ దీర్చుటెంత


రేకు: 0189-03 గుజ్జరి సం: 02-452 అధ్యాత్మ

పల్లవి:

అందాఁకాఁ దాఁదానే అంత కెక్కుడు గాఁడు
ముందు వెన కెంచేనా ముఖ్యుఁడే యతడు

చ. 1:

చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా
అత్తల నతఁడు యోగియనఁబడును
సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా
వుత్తమవివేకియని వూహింపఁబడును

చ. 2:

భావము నభావమును పరికించి తెలిసెనా
కైవల్యనిలయుఁడని కానఁబడును
దైవంబుఁ దన్ను మతిఁ దలపోయ నేర్చెనా
జీవన్ముక్తుఁడని చెప్పఁబడు నతఁడు

చ. 3:

అడరి వైరాగ్యధన మార్జించనోపెనా
దిడువై జితేంద్రియస్థిరుఁడాతఁడు
జడియు శ్రీవేంకటేశ్వరుదాసుఁ డాయనా
బడిబడిఁ దుదఁ బరబ్రహ్మమే యతఁడు


రేకు: 0189-04 మలహరి సం: 02-453 నామ సంకీర్తన

పల్లవి:

పరమపురుష హరి పరమ పరాత్పర
పరరిపుభంజన పరిపూర్ణ నమో

చ. 1:

కమలాపతి కమలనాభ కమలాసనవం౦ద్య
కమలహితానంతకోటిఘనసముదయతేజా
కమలామలపత్రనేత్ర కమలవైరివర్ణగాత్ర
కమలషట్కయోగీశ్వరహృదయం తేహం నమో నమో(?)

చ. 2:

జలనిధిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా
జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా
జలనిధిజామాత జలనిధిశోషణ జలనిధిసప్తకగమన
జలనిధికారుణ్య నమో తేహం జలనిధిగంభీర నమో నమో

చ. 3:

నరధర నగరిపువందిత నగరచరయూథపనాథా
నగపారిజాతహర సారసపన్నగపతిరాజశయన (?)
నగకులవిజయ శ్రీవేంకటనగనాయక భక్తవిధేయా
నగధీరా తేహం సర్వేశ్వర నారాయణ నమో నమో


రేకు: 0189-05 పాడి సం: 02-454 అధ్యాత్మ

పల్లవి:

అట్టయితే నాయంతర్యామివేలైతివయ్యా
మట్టుమీఱి ముక్తియాస మాననటవయ్యా

చ. 1:

పొలఁతులు లేరా భూమి భోగించే నే లేనా
కలకాల మింద్రియాల కాణాచి లేవో
తొలి యీసంసారము లేదో నాకాంక్షలు లేవో
యెలమి నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా

చ. 2:

ధరలోఁ బసిఁడి లేదా తగిలి నాయాస లేదా
సిరుల యజ్ఞానపుచీఁకటి లేదా
అరయఁ జవులు లేవా అందుకో నాలికె లేదా
యిరవై నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా

చ. 3:

అట్టే సర్వాపరాధి నపరాధా లెంచనేల
గట్టిరాళ్లలో మలిగండ్లేరనేల
నెట్టన శ్రీవేంకటేశ నిన్నుఁ జూచి కావకుంటే
ఇట్టే నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా


రేకు: 0189-06 బౌళి సం: 02-455 ఉపమానములు

పల్లవి:

మరిగితి నేమి సేతు మగిడి నేనెందు వోదు
సరుస దైవమ నీకే శరణు చొచ్చేను

చ. 1:

తల్లి గోపించి మొత్తినఁ దనయుఁడు తల్లికొంగే
యెల్లగాఁ బట్టి పెనఁగి యేడిచినట్టు
వెల్లవిరై హరి నీవు విషయాలఁ జిక్కించితే
ఇల్లిదే నిన్నుఁ దలఁచి ఇటు దూరే నేను

చ. 2:

కన్నతండ్రి బాలునిఁ జంకంబెట్టి దించితేను
కొన్నేసి విలుచు ముద్దుగునిసినట్టు
వున్నతి నాలోనుండి వూరకే మాయ నాపై
బన్నితే నిన్నే సొలసి పగటులాడేను

చ. 3:

దైవము దాతవు నీవే తల్లివి దండ్రివి నీవే
భావించి చేపట్టితే నీ బంట నే నింతే
శ్రీవేంకటేశ నీవు చేకొని రక్షించఁగాను
జీవుఁడనయిన నేను చెలఁగి మొక్కేను