తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 187
రేకు: 0187-01 లలిత సం: 02-438 కృష్ణ
పల్లవి:
అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా
చ. 1:
భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాననే మోచేటి దేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటి దేవుఁడ నేను
చ. 2:
దీపనాగ్నినై జీవదేహముల యన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
యేపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతుఁ దలఁపు మరపై దేవుఁడ నేను
చ. 3:
వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచేతా
ఆది నేనెరఁగఁదగిన యాదేవుఁడను
శ్రీదేవితోఁగూడి శ్రీవేంకటాద్రి మీఁద
పాదైన దేవుఁడను భావించ నేను
రేకు: 0187-02 గుండక్రియ సం: 02-439 అధ్యాత్మ
పల్లవి:
తలఁపులో కొట్టగొన దైవమే వున్నాఁడు
తలఁచిన రూపులెల్లా తా నయ్యీనయ్యా
చ. 1:
కలలో ప్రపంచము కంటి నే నొకటి
వెలినున్న ప్రపంచవిధివలెనే
కలనున్నవాఁడ నేనే వెలి నన్నువాఁడ నేనే
తెలి(య?) మాబతుకు రెంట దెప్పరములయ్యా
చ. 2:
దేహమీఁడ నుండఁగానే దిక్కులకేఁగీ మనసు
దేహముతో దిక్కులెల్లాఁ దిరిగినట్టే
దేహములోవాఁడ నేనే దేహముపై వాఁడ నేనే
వోహో మాజన్మములో నొకటి రెండయ్యా
చ. 3:
కన్నులెదుట శ్రీవేంకటపతిఁ గొలిచెద
కన్నుమూసి యాతనినే కమ్మర భావించెదను
కన్నులోపల నేనే కన్నులవెలిని నేనే
వున్నతి నీరెండును వొకటాయనయ్యా
రేకు: 0187-03 శ్రీరాగం సం: 02-440 అధ్యాత్మ
పల్లవి:
చాలునిదే నావిరతి సకలసామ్రాజ్యము
నాలోని పని యెంతైనా నాకుఁ గలదు
చ. 1:
వడఁబడి పరులిండ్లవాకిలి గాచే నేను
వడి నాలో హరియున్న వాకిలి గాచేను
బడి నొకరిఁ గొలిచి బహురాజ్యమేలే నేను
యెడ నామనోరాజ్యమింతా నేలేను
చ. 2:
చేరి యొరులకుఁ బనిసేసి యలసే నేను
సారె నాయోగాభ్యాసాన నలసేను
అరసి నే నడుగఁగ నన్యులిచ్చేయీవులు
తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని
చ. 3:
అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల-
మందును మాయాకల్పిత మిందును మాయే
అందు నిందు శ్రీవేంకటాధీశుఁడే కర్త
అందైతేఁ బరతంత్రుఁడిందు నే స్వతంత్రుఁడ
రేకు: 0187-04 సామంతం సం: 02-441 అధ్యాత్మ
పల్లవి:
నీసొమ్ము చెడకుండ నీవు చూచుకొనవయ్య
దాసుఁడ నేనింతే దైవమవు నీవు
చ. 1:
లోకము లేలుదువట లోకము లోపలి నేను
పైకొని నీవేలినట్టి బంటనే సుమ్మీ
ఆకడ నావుఁ గొంటే నావువెంట దూడయును
జోకలఁ గొన్నట్టివారి సొమ్మే కాదా
చ. 2:
చేరి నన్ను నీవే పుట్టించితివట నేఁ జేసే-
మేరతోఁ బుణ్యపాపాలు మీవే సుమ్మీ
ఆరుగ విత్తినవాఁడు ఆరుగలోపలి కంది
ఆరితేరి పండితేను ఆతనిదే కాదా
చ. 3:
శ్రీవేంకటేశ నీవు జీవాంతరాత్మవట
కావించి నాపాలఁ గలవే సుమ్మీ
కైవసమై చందురుఁడు కలువలజాతికెల్ల
భావింప సర్వవిధబంధువే కాఁడా
రేకు: 0187-05 బౌళిరామక్రియ సం: 02-442 అంత్యప్రాస
పల్లవి:
అన్నిటికి హరి యంతర్యామి మూలము
విన్నకన్న గతులెల్లా వృథా మూలము
చ. 1:
లాలిత వైరాగ్యమూలము మోక్షము
ఆలరిసంసారమూల మతిబంధము
మేలిమిశాంతిమూలమే సుఖము
వీలి క్రోధమూలమే వెడదుఃఖము
చ. 2:
కైకొను భవములే కర్మమూలము
శ్రీకాంతుపై భక్తి చిన్మూలము
పైకొన్న ధ్యానమెల్ల భావమూలము
దీకొని లంపటములు దేహమూలము
చ. 3:
అరుదై సుజ్ఞాన మాచార్యుమూలము
ధరణి జగత్తెల్లా ధనమూలము
పరము శ్రీవేంకటపతి మూలము
హరి నాతని శరణాగతి మూలము
రేకు: 0187-06 దేవగాంధా రి. సం: 02-443 అధ్యాత్మ
పల్లవి:
వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే
శ్రీనారాయణ వీనిచేత నే వేసరితి
చ. 1:
నీకల్పితములే యీనిఖిలేంద్రియములు
యీకడ నీయింద్రియాల నెట్టు గెలువఁగవచ్చు
నీకడ నిన్నే కొలిచి నీయప్పణ దెచ్చి వానిఁ
బైకొని చోఁపుటగాక బలిమా రాచాజ్ఞతో
చ. 2:
నీపంపునఁ గప్పిన నిజమైన మాయ యిది
మాపాటివారెల్లా మహి నెట్టు దాఁటవచ్చు
మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దాని
పైపైఁ దోయుటగాక బలిమా రాచాజ్ఞతో
చ. 3:
శ్రీవేంకటేశ నీచిక్కులే యీపుట్టుగులు
నీవు సేసే చేఁతలకు నే నెట్టు దొలఁగవచ్చు
నీవొద్ద శరణంటి నీయానతినే వాని
భావించి తోసితిఁగాక బలిమా రాచాజ్ఞతో