తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 186

వికీసోర్స్ నుండి


రేకు: 0186-01 దేవగాంధారి. సం: 02-432 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము

చ. 1:

వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

చ. 2:

పాలజలనిధిలోనఁ బవళించే రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీఁది రూపము

చ. 3:

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీఁది కొన రూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము


రేకు: 0186-02 గుండక్రియ సం: 02-433 శరణాగతి

పల్లవి:

నేనేమిఁ జేయఁగలేను నీవు పరిపూర్ణుఁడవు
హీనుఁడ నే నధికుఁడ విన్నిటా నీవు

చ. 1:

దండము వెట్టుట నాది తప్పు లోఁగొనుట నీది
నిండి నీవెప్పుడు దయానిధివి గాన
అండఁ బేరుకొంట నాది అందుకు నూఁకొంట నీది
దండియైన దేవదేవో త్తముఁడవు గాన

చ. 2:

శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది
పరమ పురుష శ్రీపతివి నీవు
విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది
పొరి నీవు భక్తసులభుఁడ వటుగాన

చ. 3:

దాసుఁడననుట నాది తప్పక యేలుట నీది
ఆసదీర్చే వరదుఁడ వటుగాన
నీసేవ యొక్కటి నాది నిచ్చలుఁ గైకొంట నీది
యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన


రేకు: 0186-03 బౌళి సం: 02-434 శరణాగతి

పల్లవి:

ఎట్టైనాఁగావకపోదు యే నెంత సేసినాను
యిట్టే నీకు శరణంటి నిదియే తెరఁగు

చ. 1:

చేకొని నే మొక్కఁగాను చేతులు గోయఁగరాదు
ఆకడఁ దప్పుకుఁ దగినాజ్ఞ మానరాదు
కైకొని యపరాధాలే కావించితి నెన్నైనా
యీకడ నీశరణంటి నిఁకనో తెరఁగు

చ. 2:

చిక్కి దైన్యపడఁగాను చెలఁగి ఖండించరాదు
చక్కఁగా నాద్రోహాలు సైరించరాదు
అక్కడఁ జూచిన శరణాగతబిరుదు నీకు
యిక్కడ నీశరణంటి నిఁకనో తెరఁగు

చ. 3:

సేవసేయుచుండఁగాను జీతము మానుపరాదు
యీవిధి నాన దోసితే నిందుకోరాదు
దేవుఁడ నిన్నుఁ గొలిచి తెగి కర్మా లుడిగితి
యీవల శ్రీవేంకటేశ ఇఁకనో తెరఁగు


రేకు: 0186-04 గుండక్రియ సం: 02-435 అధ్యాత్మ

పల్లవి:

ధరలో "నెద్భావం తద్భవ'"తనెఁ గాన
హరిమయమే జగమంతాను

చ. 1:

మహి నెదిటివారందు మలినము దలఁచిన
తహతహ మనసే తా మలినము
వహి నెదిటందు భావనము భావించిన
బహువిధములఁ దానూ భావనమే

చ. 2:

యెక్కువ నెదిటిపాపా లెంచి నిందించేటి-
నిక్కపునాలుక తానే నిందితము
వొక్కటై యెదిటిపుణ్యా లుగ్గడించి ఘనమంటే
దక్కిన పుణ్యపు జహ్వ తానూ ఘనమే

చ. 3:

సారె శ్రీవేంకటపతి సగుణము దలఁచిన
సారపు జీవుఁడు దాను సగుణమే
నేరుపుల నాతని నిర్గుణము దలఁచిన
తారతమ్యములులేని తానూ నిర్గుణమే


రేకు: 0186-05 భూపాళం సం: 02-436

పల్లవి:

ఎందాఁక నిద్ర నీకిదె తెల్లవారెఁ గదె
యిందిరారమణ నీవిటు మేలుకొనవే

చ. 1:

కమలనాభుఁడ నీకు గంగాదినదులెల్ల-
నమర మొకమజ్జనం బాయితము సేసె
తమితోడఁ గనకాద్రి తానే సింహాసనము
విమలమై యొప్పె నదే విచ్చేయవే

చ. 2:

హరి నీకు నజుఁడు పంచాంగంబు వినిపించ
నిరతమగు వాకిటను నిలిచినాఁడు
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు
సరవి నాయిత్తపడి సందడించేరు

చ. 3:

కామధేనువు వచ్చె కనుఁగొనుటకై నీకు
శ్రీమహాదేవి నీచేలాగు కదివో
యీమహిమ శ్రీవేంకటేశ నీకే చెల్లె
కామించి యన్నియునుఁ గైకొంటివిపుడు


రేకు: 0186-06 సాళంగనాట సం: 02-437

పల్లవి:

రామా రామభద్ర రవివంశరాఘవ
యేమి యరుదిది నీకింతటివానికిని

చ. 1:

నాఁడు రావణు తలలు నఱకిన లావరివి
నేఁడు నాపాపములు ఖండించరాదా
వాఁడిప్రతాపముతోఁడ వారిధిగట్టిన నాటి-
వాఁడవిట్టె నామనోవార్థిఁ గట్టరాదా

చ. 2:

తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి
కినిసి నాయింద్రియాల గెలువరాదా
యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచితివి
ఘనము నాదుర్గుణము కడు వంచరాదా

చ. 3:

సరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి
గరిమ నే శరణంటిఁ గావరాదా
తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచ మెంచనేల
యిరవై లోకహితానకేదైనా నేమీ