తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 176
రేకు: 0176-01 బౌళి సం: 02-375 కృష్ణ
పల్లవి: జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు
వెగటు నాసోదంబు ఇది నీవెలితో నావెలితో
చ. 1: యెన్నిమారులు సేవించినఁ గన్నులూ దనియవు
విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయుఁ దనియదు
విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో
చ. 2: కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు
బడిఁ బ్రదక్షిణములుసేసి పాదములు నివిఁ దనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూఁ దనియదు
వెడఁగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో
చ. 3: చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు
చెలువు సింగారంబు దలఁచి చి త్తమూఁ దనియదు
అలరి శ్రీవేంకటగిరీశ్వర అత్మ నను మోహించఁజేసితి
వెలయ నిన్నియుఁ దేరే మును నీవెలితో నావెలితో
రేకు: 0176-02 దేవగాంధారి సం: 02-376 శరణాగతి
పల్లవి: అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ
సందడి నాభవ మిందువల్లనే నఫలంబాయనయ్యా
చ. 1: వొకనీనామము వొగిఁ దలంచిన
అకలంకంబగు నాపాపంబులు అన్నియుఁ బారణే సేసే
అకటా తక్కిన అనంతనామములు
వొకట నుపవాసములున్నవోయయ్యా
చ. 2: పరి నీపాదము లవి రెండే
పరమును విహమును నా కొసఁగెను పయిపైఁ గృపతోడ
ధర నీయనంతకరములు తా మేమి-
సిరు లిత్త మనుచు చెలఁగీనయ్యా
చ. 3: ఇల నీదాస్యం బిది యొకటే
సిలుగుల భవముల జిలుగు మాన్పె నదె చిత్తము తహ దీర
యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విదె
తలఁపునఁ బాయక దక్కితివయ్యా
రేకు: 0176-03 మాళవి సం: 02-377 నామ సంకీర్తన
పల్లవి: దేవ నమో దేవా
పావనగుణగణభావా
చ. 1: జగదాకారచతుర్భుజ
గగననీలమేఘశ్యామ
నిగమపాదయుగ నీరజనాభ
అగణితలావణ్యాననా
చ. 2: ఘనవేదాంతైగణన వుదార
కనకశంఖచక్రకరాంకా
దినమణిశశాంకదివ్యవిలోచన
అనుపమరవిబింబాధరా
చ. 3: భావజకంజభవజనక
శ్రీవనితాహృదయేశ
శ్రీవేంకటగిరిశిఖరవిహార
పావనగుణగణభావా
రేకు: 0176-04 బౌళి సం: 02-378 అంత్యప్రాస
పల్లవి: దేహంబొకటే దేహియు నొకఁడే
దాహంబెంతటఁ దనియునో తలఁపు
చ. 1: వినుకలి వెంట వెడలీఁ దలఁపు
కనుకలి వెంటఁ గదలీఁ దలఁపు
కొననాలుక మదిఁ గూడీఁ దలఁపు
తునిగిన యెన్నెన్ని తునకలో తలఁపు
చ. 2: నయమగు చోటను నవ్వీఁ దలఁపు
భయమగు చోటను బడలీఁ దలఁపు
లయమై నిద్రల లవమౌఁ దలఁపు
క్రియ నెందరి పంగెనయో తలఁపు
చ. 3: భావించిన గతిఁ బారీఁ దలఁపు
వేవేలు గతుల వెలసీఁ దలఁపు
శ్రీవేంకటపతి చిత్తము లోపల
నీవే తెలుపఁగ నినుఁగనె తలఁపు
రేకు: 0176-05 సాళంగనాట సం: 02-379 నృసింహ
పల్లవి: మొక్కరె మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి
దక్కి శ్రీవేంకటేశుఁడే తానైన దేవునికి
చ. 1: కరములు వే యవే కరములును భయం-
కరనఖాయుధములు కడాఁలే వనే
సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే
నరరూపు సగమదె నరసింహునికి
చ. 2: వంకరకోరలవె వజ్రపు దంతము లవె
సంకునుఁజక్రము నిరువంకలా నవె
జంకెల నేత్రము లవె జడలు మూఁపున నవె
అంకె నభయహస్తము అదె నరహరికి
చ. 3: నిక్కినకర్ణము లవె నీలిమచ్చవుర మదె
చుక్కల మొలపూసల నొక్కరూ పదె
తొక్కినపాపము లవె తోడనే శ్రీవేంకటాద్రి
పక్కెర నరసింహపు ప్రళయసింహునికి
రేకు: 0176-06 బౌళి సం: 02-380 వైరాగ్య చింత
పల్లవి: తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను
యిల్లిదె నట్టనడుమ నింతేసి మెరసీ
చ. 1: పుట్టినప్పుడే దేహి బుద్ధులేమీ నెఱఁగఁడు
యిట్టె లోకులఁ జూచి యింత నేరిచె
ముట్టుకొన్న యింద్రియాల ముదిసి ముదిసి రాఁగా
తట్టువడి తనమేను తానే మరచె
చ. 2: మనుజుఁడైనప్పుడే తా మాటలేమి నెరఁగఁడు
జనులాడుకొనఁగానె సంగడి నేర్చె
దినదినభోగాల దృష్టాంతములెల్ల
అనుభవనై(???) తన కడియాలమాయ
చ. 3: తచ్చి తాఁ గలప్పుడే దైవము నెఱఁగఁడు
నిచ్చ నాచార్యునివల్ల నేఁ డెఱిఁగె
అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతర్యామై యుండి
యిచ్చఁ గరుణించఁగాను యెక్కుడాయఁ దాను