తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 177
రేకు: 0177-01 గుజ్జరి సం: 02-381 భగవద్గీత కీర్తనలు
పల్లవి: జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబు గాన ॥పల్లవి॥
యెనయుచు నేఁగర్మమార్గముల నితరదేవతల భజియించెదను
అని యపరాధం బెంచకుమీ అన్యము నీకంటె మరి లేదు
పనివడి "మత్తఃపరతరం" బని పలికితి విన్నియు నీ యాజ్ఞలు
చ. 1: దేవ నావుదరపోషణకు తివిరి హింస చేసెదను
నీ విది నావల నెంచకుమీ నీవే అఖండ చేతన్యుఁడవు
దేవ మిము "నై తేన వినా తృణాగ్రమపి" యని శ్రుతి వొగడెడిని
చ. 2: భువిలో నాకట పూర్వకర్మమట పొఁగదునే నీసరణి నీయడను
అవి నా కేమియుఁ బనిలేవు అంతరియామివి నీవు
అవలను "త్వమేవ శరణం గతి" యనుటది నమ్మితి శ్రీవేంకటనిలయా
రేకు: 0177-01 గుజ్జరి సం: 02-382 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు
మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే
చ. 1: సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు
సర్వసర్వంసహాచక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే
చ. 2: పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుఁడ నన్ను సరిఁగావవే
చ. 3: అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు
ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు
రేకు: 0177-02 లలిత సం: 02-383 భగవద్గీత కీర్తనలు
పల్లవి: విజాతులన్నియు వృథా వృథా
అజామిళాదుల కది యేజాతి
చ. 1: జాతిభేదములు శరీరగుణములు
జాతి శరీరము సరిఁ దోడనె చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల హరివిజ్ఞానపు దాస్యంబిది యొక్కటెపో సుజాతి
చ. 2: హరి యిందరిలో నంతరాత్ముఁడిదె
ధరణి జాతిభేదము లెంచిన
పరమయోగులీ భావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోనఁ బరతత్త్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి
చ. 3: లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్యకర్తవ్యంబులు
శ్రీకాంతుండు శ్రీవేంకటపతి సేసిన సంపాదమిందరికి
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి
రేకు: 0177-03 గుజ్జరి సం: 02-384 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు
చ. 1: దేహం బొసఁగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె
దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను
దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును
దేహి కోరినట్టే కమ్మర దేవుఁ డనుమతి ఇచ్చీఁ గాన
చ. 2: చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడా యంటేను
కాయపుసుఖములు గోరఁగ గర్తట కడగనుటకుఁ గర్త గాఁడా
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే
దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁ గాన
చ. 3: ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము
సదయుఁడు మనశ్రీవేంకటగిరి సర్వేశ్వరుఁడు సత్యుఁడు
మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు
అదే "నమోఽహం సర్వభూతేషు" అని గీతలలో నున్నది గాన
రేకు: 0177-04 బౌళి సం: 02-385 భగవద్గీత కీర్తనలు
పల్లవి: తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన
చ. 1: బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర
పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
చ. 2: నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే
చ. 3: అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
చ. 4: కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
చ. 5: కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే