తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 175

వికీసోర్స్ నుండి

రేకు: 0175-01 దేవగాంధారి సం: 02-369 భక్తి

పల్లవి: సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి

చ. 1: నయనానందము నరులకు సురులకు
జయమగు హరి నీసాకారము
నయమగు శ్రవణానందము వినినను
క్రియగలిగిన నీకీర్తనము

చ. 2: చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొను నీపస్రాదము
నలుగడ దేహానందము బుధులకు
బలు నీపాదప్రణామమములు

చ. 3: ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయు సమారాధనము

రేకు: 0175-02 సామంతం సం: 02-370 అంత్యప్రాస

పల్లవి: ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు
సారపు లౌకికవిమోచనమే ముక్తి

చ. 1: మొగిఁ బుణ్యపాపవిముక్తియే ముక్తి
వెగటుఁ బ్రపంచపువిముక్తే ముక్తి
తగులు సంసారబంధవిముక్తే ముక్తి
జగములోఁ గలుగు యాశాముక్తే ముక్తి

చ. 2: కామక్రోధాదిసంగ విముక్తే ముక్తి
వేమారు రుచులపై విముక్తే ముక్తి
నాముల దేహభిమానపు ముక్తే ముక్తి
పామెడి కోరికలసంపద ముక్తే ముక్తి

చ. 3: ముందువెనకల కర్మమోచనమే ముక్తి
అంది సుఖదుఃఖభయ ముక్తే ముక్తి
కందువ శ్రీవేంకటేశుఁ గని యందే శరణని
విందుల నితరసేవావిముక్తే ముక్తి

రేకు: 0175-03 సాళంగనాట సం: 02-371

పల్లవి: ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా
చేతనే వరాలిచ్చీ శేషాచలేశుఁడు

చ. 1: విశ్వరూపబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము
ఐశ్వర్యస్వరా ట్టాసామ్రాట్టయిన బ్రహ్మము
శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము
యీశ్వరుఁడై మహరాట్టై యిందరిలో బ్రహ్మము

చ. 2: సూర్యునిలో తేజము సోమునిలో తేజము
శౌర్యపు టనలుని భాస్వత్తేజము
కార్యపు టవతారాలఁ గనుఁగొనే తేజము
వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము

చ. 3: పరమపురుషమూర్తి ప్రకృతియైన మూర్తి
గరిమతో మహదహంకార మూరితి
ధరఁ బంచతన్మాత్రలు తత్త్వములైన మూరితి
గరుడానంత సేనేశకర్తయైన మూరితి

చ. 4: భాగవతపు దైవము భారతములో దైవము
సాగిన పురాణవేదశాస్త్ర దైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డునఁ గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము

రేకు: 0175-04 దేసాళం సం: 02-372 గురు వందన, నృసింహ

పల్లవి: గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము

చ. 1: యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము

చ. 2: వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము

చ. 3: నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము

రేకు: 0175-05 నాదరామక్రియ సం: 02-373 అంత్యప్రాస

పల్లవి: నేనేమెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన
ఆని మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు

చ. 1: అనుగు నీరూప మింతంతనెరిఁగి సేసేనో
వునికై నీ వొక్కచోనే వుండేదెరిఁగి సేసేనో
తనిసి నీకు నొక్కమంత్రమునెరిగిఁ సేసేనో
కనరాని నీమహిమే కడయెరిఁగి సేసేనో

చ. 2: మరిగి నీకు నొక్కనామమునెరిఁగి సేసేనో
అరసి యించుకేకాలమనెరిఁగి సేసేనో
నిరతి నీకేమి లేవని యెరిగి సేసేనో
బెరసి నన్ను గొంత మెప్పించనెరిగి సేసేనో

చ. 3: తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో
అలమిన నీమాయఁ గొంతనెరిఁగి సేసేనో
అలమేల్మంగకుఁ బతియగు శ్రీవేంకటేశుఁడ
వొలసి నీ కుపమింప నొక్క టెరిఁగి సేసేనో

రేకు: 0175-06 వరాళి సం: 02-374 దశావతారములు

పల్లవి: డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥
మీనకూర్మ వరాహ మృగపతి ‌అవతారా
దానవారే గుణశౌ రే ధరణిధర మరుజనక

చ. 1: వామన రామ రామ వరకృష్ణ అవతార
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ

చ. 2: దారుణ బుద్ధ కలికి దశవిధ‌ అవతారా
శీరపాణే గోసమాణే శ్రీవేంకటగిరికూటనిలయ