తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 174
రేకు: 0174-01 లలిత సం: 02-362 హరిదాసులు
పల్లవి: ఆతనిమూలమే జగమంతా నిది
ఆతుమలో హరి కీలుఅయివుండుఁ గాని
చ. 1: మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము
వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
యెచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే
యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని
చ. 2: నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
పట్టినదే వ్రతమైతే భవమే మేలు
జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము
యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని
చ. 3: చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని
రేకు: 0174-02 సాళంగనాట సం: 02-363 నృసింహ
పల్లవి: దిక్కు నీవే జీవులకు దేవసింహమా
తెక్కుల గద్దియమీఁది దేవసింహమా
చ. 1: సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా
చ. 2: భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల
త్రిజగముల నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి-
ద్విజమునిసంఘముల దేవసింహమా
చ. 3: ముప్పిరిదాసులకెల్లా ముందు ముందే యొసగేటి-
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవేంకటాద్రిమీఁద
తెప్పల దేలేటియట్టి దేవసింహమా
రేకు: 0174-03 బౌళి సం: 02-364 గోవిందరాజు
పల్లవి: కన్నులపండుగలాయ కమ్మి సేవించేవారికి
సన్నల నీదాసులము సంతసించేము
చ. 1: పడఁతు లిద్దరు నీపాదములు వొత్తఁగాను
కొడుకు బ్రహ్మదేవుఁడు కొలువఁగాను
కడుపులో లోకములు కడు జయవెట్టఁగాను
గుడిగొనె నీబ్రదుకు గోవిందరాజా
చ. 2: మెత్తఁగా శేషుఁడు నీకు మించుఁబరపై వుండగా
జొత్తు మధుకైటభులు సుక్కి వోడఁగా
హత్తి దేవతలు నిన్ను నందరుఁ బూజించఁగాను
కొత్తలాయ నీబ్రదుకు గోవిందరాజా
చ. 3: పరగి నీముందరను పంచబేరము లుండఁగా
గరిమఁ జక్రము నీకుఁ గాపై వుండఁగా
తిరమై శ్రీవేంకటాద్రి తిరుపతిలోపలను
గొరబాయ నీబ్రదుకు గోవిందరాజా
రేకు: 0174-04 శ్రీరాగం సం: 02-365 గురు వందన, నృసింహ
పల్లవి: కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద
మూశిన ము త్తెమువలె మొక్కేము నీకు
చ. 1: నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన
పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు
యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు
చ. 2: పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన
దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను
తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను
చ. 3: గురువవు గొల్లలకు గోవింధరాజవు గన
నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు
చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు
పరము నిహము మాకు బలువుగాఁ గలిగె
రేకు: 0174-05 గౌళ సం: 02-366 తేరు
పల్లవి: హరియు సిరియు నేఁగే రదివో తేరు
పరంజ్యోతి స్వరూపపు పైఁడికుండ తేరు
చ. 1: గరుడధ్వజపుఁ దేరు కనకమయపుఁ దేరు
సురలు బొమ్మలైనారు చుట్లఁ దేరు
మెరుఁగుల మేఘముల మించుఁ గొఱిఁగెల తేరు
సిరుల ధ్రువలోకపు శిఖరపుఁ దేరు
చ. 2: బలుకుల పర్వతాలె బండికండ్లైన తేరు
నలుదిక్కు లంచుల వున్నతపుఁ దేరు
కొలదిఁలేని చుక్కలకుచ్చుల ముత్తేల తేరు
మెలుపు నాకాశగంగ మేలుకట్ల తేరు
చ. 3: మునులనే వుత్తమాశ్వములఁగాఁ గట్టిన తేరు
ఘనమహిమలనే సింగారపుఁ దేరు
యెనసి శ్రీవేంకటేశుఁ డెపుఁడూ నలమేల్మంగ
దినదినభోగములఁ దిరమైన తేరు
రేకు: 0174-06 బౌళి సం: 02-367 శరణాగతి
పల్లవి: పరమపురుష నిరుపమాన శరణు శరణు రే యేయేయేయే ఇందిరా నిజమందిరా
కమలనాభ కమలనయన కమలచరణు రే
అమిత సురమునినాథయూధపనాయకా వరదాయకా
చ. 1: చతురమూరితి చతురబాహుశంఖచక్రధరా
అతిశయ శ్రీవేంకటాధిప అంజనాకృతిరంజనా
రేకు: 0174-07 మాళవి సం: 02-368 సంస్కృత కీర్తనలు
పల్లవి: హా సమీచీనమపహసంతే
దాసై ప్రకాశితం దరిదంతు లోకే
చ. 1: ద్వారకాపట్టణే త్వం పురా చ స్వయదీక్షితస్తూ స్త్రియః
కేశముష్టిః కథం సారస కురువంతి సరసవేళాయాం
చ. 2: వరశిశోరక్షణే త్వం పురా చ అహం బ్రహ్మచారి అథోచే స్తదేతి
గోపతరుణయః కిమితి వా తద్వసతి త్వం
చ. 3: తత్తబృందావనే త్వం పురా చ శ్రియౌ వేంకటాద్రౌ ఇదం
నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాశ్చ ది సేవంతి సర్వే