Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 171

వికీసోర్స్ నుండి

రేకు: 0171-01 ధన్నాసి సం: 02-344 అధ్యాత్మ

పల్లవి: ఎఱఁగక వేసారు నిల జీవుఁడు
మెఱసి నిండుకున్నాఁడు మేఁటి యీదేవుఁడు

చ. 1: వూరకే పరాకైనట్టుండును దేవుఁడు
నారుకొన మతిలోఁ దనపైనే చింత
గారవాన మరి పలుకనియట్టే వుండును
యీరీతి మాటాడించేవాఁ డిన్నిటా నితఁడే

చ. 2: యెందు లేనియట్టే వుండు నెంచి చూచితే దేవుఁడు
చెంది లోకశరీరియై చెలరేఁగీని
అందరాక యెక్కడాను అడఁగినట్లనే యుండు
యిందరిఁ బోషించేవాఁడు యెప్పుడూ నితఁడే

చ. 3: చేరి లోనుగానెట్టుండు శ్రీవేంకటేశదేవుఁడు
కోరినవరము లిచ్చు గురుతుగాను
వారక యలమేల్మంగ వల్లభుఁ డిట్టిదేవుఁడు
యీరూపుతో నుండు నిందరిలో నితఁడే

రేకు: 0171-02 నాట సం: 02-345 వైష్ణవ భక్తి

పల్లవి: విష్ణుఁడొక్కఁడే విశ్వాత్మకుఁడు
వైష్ణవమే సర్వంబును

చ. 1: పరమేష్టి సేయు బ్రహ్మాండసృష్టియు
హరునిలోని సంహారశక్తి
పరగఁగ నింద్రుని పరిపాలనమును
అరసిచూడ శ్రీహరి మహిమ

చ. 2: యిలఁ బంచభూతములలో గుణములు
అల నవగ్రహ విహారములు
తలకొను కాలత్రయ ధర్మంబును
అలరఁగ నారాయణుని మహిమలే

చ. 3: అంతటఁగల మాయా విలాసములు
పొంతఁ బరమపద భోగములు
మంతుకు నెక్కిన మరి సమస్తమును
యింతయు శ్రీవేంకటేశు మహిమలే

రేకు: 0171-03 గుజ్జరి సం: 02-346 అధ్యాత్మ

పల్లవి: ఒకటి కొకటి లంకై వూరకైనాఁ బెనగొను
అకటా యెవ్వరు దాఁటేరయ్య నీమాయలు

చ. 1: తనయెదుటివెల్లాను తలఁపులోఁ బారును
మనసులోపలివెల్లా మర్మము లంటు
ఘనమర్మములు రేఁగి కాయమెల్లాఁ గరఁగించు
తనువుసౌఖ్య మవ్వలి తనువున నంటును

చ. 2: అవ్వలిదేహభోగము లట్టే కర్మములౌను
మువ్వంకఁ గర్మాలు లోకములై చెందును
చివ్వన నాలోకములు చేరి కాలము గడపు
తెవ్వనికాలము నిద్రాఁ దెలివినై ముంచును

చ. 3: వెస నాతెలివి యొకవేళ నిన్నెఱిఁగించు
వసమై ఆయెఱుకకు వచ్చి మెత్తువు
యెసగి నీవు మెచ్చితే యిహపరము లిత్తువు
మిసిమి శ్రీవేంకటేశ మెరయు నీయీవి

రేకు: 0171-04 సాళంగనాట సం: 02-347 హనుమ

పల్లవి: శరణు శరణు వేదశాస్త్రనిపుణ నీకు
అరుదైన రామకార్యధురంధరా

చ. 1: హనుమంతరాయ అంజనాతనయా
ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన
జనసురనుత కలశాపురనివాస

చ. 2: రవితనయసచివ రావణవనాపహర
పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహ బుద్ధివిశారద
జవసత్వవేగ కలశాపురనివాస

చ. 3: సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్య అసురాంతక
కౌతుక శ్రీవేంకటేశుకరుణాసమేత
శాతకుంభవర్ణ కలశాపురనివాస

రేకు: 0171-05 బౌళిరామక్రియ సం: 02-348 నృసింహ

పల్లవి: నమో నమో లక్ష్మీనరసింహా
నమో నమో సుగ్రీవనరసింహా

చ. 1: వరద సులభ భక్త వత్సల నరసింహా
నరమృగవేష శ్రీనరసింహా
పరమపురుష సర్వపరిపూర్ణ నరసింహా
గిరిగుహావాస సుగ్రీవనరసింహా

చ. 2: భయహర ప్రహ్లాదపాలన నరసింహా
నయనత్రయారవింద నరసింహా
జయ జయ సురమునిసంస్తుత నరసింహా
క్రియాకలాప సుగ్రీవనరసింహా

చ. 3: అతికృపానిలయ మోహనరూప నరసింహా
నత పితామహముఖ్య నరసింహా
సతత శ్రీవేంకటేశ్వర దివ్యనరసింహా
కితవారిభంజన సుగ్రీవనరసింహా

రేకు: 0171-06 భైరవి సం: 02-349 అధ్యాత్మ

పల్లవి: చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు
యిత్తల మానేరములు యెన్ని లేవయ్యా

చ. 1: అంగము యేడుజానలు ఆస కొండలపొడవు
యెంగిలిమేను ఆచార మెంతైనాఁ గద్దు
జంగి లింతే సంసారము సాధించేది లోకమెల్లా
అంగడిఁ బడి జీవుని కలపు లేదయ్యా

చ. 2: మఱి నల్లెఁడు నాలికె మాటలు గంపెఁడేసి
యెఱుక గొంచె మజ్ఞాన మెంచఁగరాదు
గుఱిలేనిది బదుకు కొలఁది లేదు భోగము
వెఱవని జీవునికి వేసట లేదయ్యా

చ. 3: పట్టరానిది మనసు బయలు వందిలి చేఁత
చుట్టుకొన్నది కర్మము వట్టిది గుట్టు
యిట్టె యలమేలుమంగ నేలె శ్రీవేంకటేశుఁడు
నెట్టన నీబంటుజీవునికి మితిలేదయ్యా