తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 172

వికీసోర్స్ నుండి

రేకు: 0172-01 ప్రతాపనాట సం: 02-350 హనుమ

పల్లవి: ఏమని నుతించవచ్చు నితనిరూపము
భీమవిక్రముఁ డితఁడు పెద్ద హనుమంతుడు

చ. 1: వొక్కజంగఁ చాఁచినాఁడు వొగిఁ దూర్పుఁబడమర
తక్కక భుజా లుబ్బించె దక్షిణోత్తరాలు నిండ
మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెత్తెను
పిక్కటిల్లు మహిమతోఁ బెద్ద హనుమంతుఁడు

చ. 2: వేడుక వాల మాకాశవీథితోఁ బెనచినాఁడు
యేడుజలధులు చేసె నదె మోకాళ్లబంటి
వోడక పిడికిలించి వుగ్రదైత్యుల తలలు
బేడలుగాఁ జేసినాఁడు పెద్ద హనుమంతుఁడు

చ. 3: జళిపించి వలకేలు సకలము మెచ్చ నెత్తె
కులగిరులు తనతొడలసందినే యడఁచె
బలువుఁడు శ్రీవేంకటపతిబంటు మతంగాద్రి-
బిలమువాత నున్నాఁడు పెద్దహనుమంతుఁడు

రేకు: 0172-02 దేసాళం సం: 02-351 శరణాగతి

పల్లవి: పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు

చ. 1: మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే
జనులకు నిహపరసాధనమౌను
తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
పనివడి యంతలోనే పవిత్రమౌను

చ. 2: కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే-
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
ధర్మములకుఁ బరమధర్మము దానౌను

చ. 3: జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే
పగటున నదే తపఃఫలమౌను
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
మిగులా నిహమైనా మించి పరమౌను

రేకు: 0172-03 లలిత సం: 02-352 వైష్ణవ భక్తి

పల్లవి: మనసు నమ్మనేర్చితే మనుజుఁడే దేవుఁడౌను
తనలోనే వున్నవాఁడు తావుకొని దైవము

చ. 1: మగనిపై బత్తిచేసి మగువ యొక్కరితె
తెగి పరలోకము సాధించీనట
వొగి వీరవైష్ణవుఁడై వున్నవాఁడు హరిఁ గొల్చి
అగపడి ఘనమోక్షమంద నోపఁడా

చ. 2: యేలికకై పగవారి నెదిరించి బంటొకఁడు
మేలైన పదవులంది మెరసీనట
వేళతో సుజ్ఞాని శ్రీవిష్ణుకైంకర్యాలుచేసి
కాలమందే యందరిలో ఘనుఁడు గానోపఁడా

చ. 3: పరమపురుషార్థపుపని చేసి యెుకరుఁడు
అరిది నధికపుణ్యుఁ డయ్యీనట
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ బూజించి దాసుఁడు
పరము నిహముఁ జెంది బ్రదుకఁగ నోపఁడా

రేకు: 0172-04 దేసాక్షి సం: 02-353 అధ్యాత్మ

పల్లవి: సోదించి చూడఁబోతే చూచి మఱపు
వో దేవదేవ మించె నోహో నీమాయ

చ. 1: వొక్కటే పదార్థము వూరివారెల్లాఁ జూచితే
గుక్కిళ్లు మింగించి యాసకొలుపుచుండు
మక్కళిం చెందరిలోని మనసులు వేరు వేరో
వొక్కటో యేమనవచ్చు నోహో నీమాయ

చ. 2: ధరలో బిడ్డ వొక్కటి తల్లిదండ్రులిద్దరు
తొరలింపు వేడుకలై తోఁచుచుండు
పెరిగేటి పుట్టుగులు భేదమో అభేదమో
వొరుల కేమనవచ్చు నోహో నీమాయ

చ. 3: కోరే మోక్ష మొక్కటే కొలచే దిద్దరినట
చేరే ని న్నలమేల్మంగ శ్రీవేంకటేశ
మీరిద్దరు నేకమౌ మీభావాలే వింతలో
వూరకే యేమనవచ్చు నోహో నీమాయ

రేకు: 0172-05 దేసాళం సం: 02-354 వైష్ణవ భక్తి

పల్లవి: ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను
పన్ని నీముద్రలఁగాక పాపము వోయినా

చ. 1: కందువ నీపాదాలపైఁ గట్టిపెట్టినఁ గాక
సందులుదూరే మనసు చక్కనుండీనా
నిందలేక యేపొద్దు నిన్నే కొలిచినఁ గాక
తుందుడుకు నీమాయ తొలఁగిపోయీనా

చ. 2: వుడివోని రుచులు నీకొప్పగించినఁ గాక
బడిఁ బంచేంద్రియములు పాయనిచ్చీనా
జడియక నే నీకు శరణుచొచ్చినఁ గాక
వొడలిలో కామక్రోధా లుడిగిపోయీనా

చ. 3: నిక్కపు నాకర్మములు నీకొరకునైనఁ గాక
యిక్కడ నేఁ జేసేటి హింస మానీనా
పక్కన నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
అక్కర నీకు మొక్కక అజ్ఞానము వోయీనా

రేకు: 0172-06 నాట సం: 02-355 నృసింహ

పల్లవి: వాఁడె వో ప్రహ్లాదవరదుఁడు
వాఁడె వో భక్తవత్సలుఁడు

చ. 1: కోర దవడలతోడ కోటి సూర్యతేజముతో
హారకేయూరాది భూషణాంబరాలతో
చేరి బ్రహ్మాదులెల్లాను సేవలు సేయఁగాను
మేర మీరిన శిరుల మేడలో నున్నాఁడు

చ. 2: తెల్లని మేనితోడ తీగెనవ్వులతోడ
చల్లని గంధముల వాసనలతోడ
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించఁగా
వెల్లవిరిఁ గొలువై వేడుక నున్నాడు

చ. 3: సంకుఁజక్రముల తోడ జంట పూదండలతోడ
పొంకపు నానావిధ భోగములతో
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు
అంకెలనే పొద్దూ నెలవై తానున్నాఁడు