Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 169

వికీసోర్స్ నుండి

రేకు: 0169-01 దేవగాంధారి సం: 02-333 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ
వీఁపు గానరాఁగా దాఁగే విద్య నీదిగాక

చ. 1: పుట్టిన మెకానకుఁ బూరి మేయ నేరిపిరా
అట్టె పిల్లలఁ బెట్ట నటు నేర్పిరా
చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా
మట్టులేని దింతా నీమాయ యింతేకాక

చ. 2: తీవెలకుఁ జుట్టి చుట్టి దిక్కులఁ బాఁక నేరిపిరా
తావులఁ దతికాలానఁ బూవ నేరిపిరా
వేవేలు పక్కొమ్మలు వెసఁ బెట్ట నేరిపిరా
యేవలఁ జూచినా నీమహిమ లింతేగాక

చ. 3: కోరి పక్షులు కొరులు గూండ్లువెట్ట నేరిపిరా
సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా
యీరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన
చేరి నీవు సేసిన సృష్టి యింతే కాక

రేకు: 0169-02 దేవగాంధారి సం: 02-334 వైష్ణవ భక్తి

పల్లవి: ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము
యెంతైనా నిదియు నీ విచ్చితేనే కలుగు

చ. 1: హరి నీచిత్తము వట్టేయందుకు నుపాయము
ధర నిన్ను బోధించే నీదాసులమాఁటే
దురతములన్నిటిని తొలగించే వుపాయము
నిరంతరమును నీనామజపమే

చ. 2: దండితోడ నీమాయ దాఁటేయందు కుపాయము
నిండు నిధానమైన నీపైభక్తే
అండనున్న కామాదుల నణచుట కుపాయము
కొడవంటి నీమూర్తిఁ గోరి శరణనుటే

చ. 3: పుట్టుగులు గెలిచి నిన్ను బొందుట కుపాయము
అట్టె నీరూపమైన‌ ఆచార్యుడే
యిట్టె శ్రీవేంకటేశ యిన్నిటికి నుపాయము
మట్టులేని రామానుజమతము చేకొనుటే

రేకు: 0169-03 దేవగాంధారి సం: 02-335 భగవద్గీత కీర్తనలు

పల్లవి: తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు-
వలలఁ జిక్కక నిన్నే కొలువఁగవలయు

చ. 1: చూడఁగ నీజగత్తుకు సూత్రధారివి నీవు
జోడై నీసూత్రాన నాడుచును సర్వంబునున్నది
యేడఁ జూచిన నీవుందు వెవ్వరికిఁ గానరావు
వోడక స్వతంత్ర మొకరిపై వేతువు

చ. 2: మఱపించాఁ దలఁపించా మర్మజ్ఞుఁడవు నీవు
గుణియై నీసంకల్పము కొలఁదే యీజీవులెల్లా
మఱి నీ వీశ్వరుఁడవు మాఁటలకుఁ జిక్కవు
కఱకరి నితరులఁ గర్తలఁగాఁ జేతువు

చ. 3: అందరిమొర లాలించి అట్టె రక్షింతువు నీవు
కందువ శ్రీవేంకటేశ కానవచ్చె నీమహిమ
చెంది వరము లిత్తువు చేతికి సులభుఁడవు
సందడి నెవ్వరినైనా సరిగా మన్నింతువు

రేకు: 0169-04 ధన్నాసి సం: 02-336 శరణాగతి

పల్లవి: నీవే దయదలఁచుక నెమ్మి రక్షించుట గాక
యీవలఁ గొలిచేనంటే యీడైనవాఁడనా

చ. 1: పరగ నేమైనా విన్నపము చేసుకొనేనంటే
హరి నీకు నెదురుమాఁటాడేవాఁడనా
గరిమ సువస్తువులు కానుక ఇచ్చేనంటే
సరుస నీకన్నా నేను సంపన్నుఁడనా

చ. 2: మెలఁగి నీగుణాలకు మెచ్చి సంతోషించేనంటే
జలజాక్ష నే నీతో సరివాఁడనా
బలువైనా నీపరమపదము గోరేనంటే
వలనైన నీతోడివంతువాఁడనా

చ. 3: తాలిమితో నాలో నిన్ను ధ్యానము సేసేకంటే
పాలఁసుడ నేను నీపాటివాఁడనా
యేలితివి శ్రీవేంకటేశ నన్నుఁ గృపతోడ
యీలీల నీమహిమలు యెరిఁగేటివాఁడనా

రేకు: 0169-05 దేవగాంధారి సం: 02-337 శరణాగతి

పల్లవి: చిత్తానఁ బెట్టకు మీమాఁట శ్రీరమణ మరవకు
హత్తి నిన్నే మెరుఁగుదు నజ్ఞాని నేను

చ. 1: నెలకొని నాలోన నీవున్నాఁడవు గనక
తలఁచకున్నా నిన్నుఁ దలఁచిన వాఁడనే
యెలమి నందరి నీవే యేలినవాఁడవు గనక
కొలువకున్నా నిన్నుఁ గొలిచినవాఁడనే

చ. 2: నెక్కొని ఆకసమెల్లా నీపాదమే కనక
మొక్కకున్నా నేను నీకు మొక్కినవాఁడనే
నిక్కి నానాక్షరములు నీపేరులే కనక
పెక్కులుగాఁ బిలువకున్నాఁ బిలిచినవాఁడనే

చ. 3: వోజ నారుగమలాల నున్నాఁడవు గనక
పూజించకున్నా నిన్నుఁ బూజించినవాఁడనే
తేజపు శ్రీవేంకటేశ దేవ నీవే గతిగాన
సాజాన నే మఱచినా శరణన్న వాఁడనే

రేకు: 0169-06 గుండక్రియ సం: 02-338 భక్తి

పల్లవి: దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీకీరితి రూపపుష్పము లివియయ్యా

చ. 1: వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా

చ. 2: నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా

చ. 3: యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్య్ర ము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా