తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 168

వికీసోర్స్ నుండి

రేకు: 0168-01 భూపాళం సం: 02-328 అధ్యాత్మ

పల్లవి: ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదెను
వివరముతోడుత నీవు సులభుఁడవు విష్ణుఁడ నిన్నే కొలిచెదఁ గాక

చ. 1: జపయజ్ఞదానకర్మంబులు యెంచఁగ జిరకాలఫలంబులు
యెపుడుఁ బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకుఁ గారణంబులు

చ. 2: రవిచంద్రగ్రహతారాబలములు భువిలోఁ గామ్యఫలములు
తవిలిన పంచేంద్రియనిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు
అవిరళ ధర్మార్థకామంబులు మఱి యైశ్వర్యములకు మూలములు
అవల గ్రహణకాలానుష్ఠానము లధికఫలంబులు ఆశామయము

చ. 3: పరగ సప్తసంతానబ్రాహ్మ ణతర్పణములు ఖ్యాతిసుకృతములు
అరయఁ బుత్రదారక్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొఁసగెడి దాతవు
సరుగన నీవే దయతో రక్షించఁజాలుదు వేకాలమును మమ్మును

రేకు: 0168-02 ధన్నాసి సం: 02-329 శరణాగతి

పల్లవి: నీవే మాకు దిక్కు నిన్నే తలఁతుము
కావు మా నేరమెంచక కరుణానిధీ

చ. 1: నెట్టన సూర్యులోని నెలకొన్న తేజమా
గట్టిగాఁ జంద్రునిలోని కాంతిపుంజమా
పుట్టిరక్షించే యజ్ఞపురుషుని ప్రకాశమా
వొట్టుక దేవతలలోనుండిన శక్తీ

చ. 2: సిరులుమించిన యట్టిజీవులలో ప్రాణమా
గరిమ వేదములలోఁ గల యర్థమా
పరమపదమునందుఁ బాదుకొన్న బ్రహ్మమా
చరాచరములలో సర్వాధారమా

చ. 3: జగములో వెలిసేటిసంసారసుఖమా
నిగిడినమంత్రముల నిజమహిమా
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదనున్నదైవమా
ముగురువేల్పులలోని మూలకందమా

రేకు: 0168-03 ధన్నాసి సం: 02-330 భగవద్గీత కీర్తనలు

పల్లవి: నీ వెంత నే నెంత నేఁడు నాయగ్గలి కెంత
దేవ నీదాసులఁ జూచితేనే నిన్నుఁ గనుట

చ. 1: వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు
ఉక్కుమీరి ధరించుక ఉన్నాఁడవట
నిక్కిన నీరూప మెంతో నిన్నుఁ గనుఁగొను టెట్టు
అక్కజపు వేదముల కగోచరుఁడవు

చ. 2: యెన్నో శిరసులట యెన్నో పాదములట
యెన్నరాని చేతులట యిట్టి నీమూర్తి
కన్నులఁ జూచుట యెట్టు కడగురు తందు కేది
అన్నిటా మునీంద్రులకు నచింత్యుఁడవు

చ. 3: కోటిసూర్యు లొక్కమాటే కూడ నుదయించినట్టు
గాటపు నీతిరుమేనికాంతులట
మేటివి శ్రీవేంకటేశ మిమ్ము ద్రిష్టించుట యెట్లు
పోటిదేవతలకెల్లాఁ బొడవైనవాఁడవు

రేకు: 0168-04 ధన్నాసి సం: 02-331 అధ్యాత్మ

పల్లవి: నారాయణ నీపంపో నాభాగ్యమో ఇది
పేరుకొని పిలువని పేరంటమై వున్నది

చ. 1: వుడిగినాఁ గామాదు లొక్కొక్కవ్యాజాన వచ్చీ
నుడిసి నడుముచొచ్చు చుట్టాలవలె
తడవకున్నాఁ గర్మాలు తమ్ముఁ దామె సేయించీ
బడిబడిఁ దిరుగును బంట్లవలె

చ. 2: చూడకున్నా దుర్గుణాలు సొంట్లు సోదించవచ్చీ
వాడవాడలఁ దలవరులవలె
యేడ నున్నా లంపటాలు యెదుటనే పొలసీని
జోడువాయనీక తోడునీడలవలె

చ. 3: తలఁచకున్నా భోగాలు తనువుతోఁ బెనఁగీని
చెలరేఁగి గరిడిలో జెట్లవలె
బలిమి శ్రీవేంకటేశ భావములో నీమూరితి
నిలుపవే యెందుకైనా నిగిడీ నామనసు

రేకు: 0168-05 దేవగాంధారి సం: 02-332 భగవద్గీత కీర్తనలు

పల్లవి: పసులఁ గాచుట యెట్టు బండిబో యిఁడవౌటెట్టు
వెస నిన్నుఁ దలఁచితే వెరగయ్యీ నాకు

చ. 1: వరుస నంతరియామిత్వము నవతారములు
పరగ మూఁడుమూర్తుల ప్రభావము
పరమపదము పరాత్పరము బ్రహ్మమునై
తిరమైన యాదిదేవదేవుఁడవు నీవు

చ. 2: అనిశము జీవులకు నణువుకు మహత్తుకు
వెనుకొన్న మాయకు విరాట్టుకు
పొనుఁగని మహిమల పొడవుకుఁ బొడవైన
దినకరకోటికోటితేజమవు నీవు

చ. 3: సర్వశాస్త్రములలో సనకాదులలో
పర్విన గరుడానంతప్రముఖులలో
సర్వదా మెలఁగుచు జనవరదుఁడవై
వుర్వి శ్రీవేంకటాద్రినున్న దేవుఁడవు