Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 167

వికీసోర్స్ నుండి

రేకు: 0167-01 భైరవి సం: 02-322 శరణాగతి

పల్లవి: ఎంతపుణ్యమో యిటు మాకుఁ గలిగె
చెంతనే నీకృప సిద్ధించఁబోలు

చ. 1: శ్రీపతి మీకథ చెవులను వింటిమి
పాపము లణఁగెను భయ ముడిగె
తీపుగఁ దులసితీర్థము గొంటిమి
శాపము దీరెను సఫలంబాయ

చ. 2: గోవింద మిముఁ గనుఁగొంటి మిప్పుడే
పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీపాదములకు మొక్కితి
వేవేలుఁ గలిగెను వేడుకలాయ

చ. 3: శ్రీవేంకటేశ్వర సేవించితి మిము
దావతి దీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి
నీవారమైతివి నిలిచితి మిపుడు

రేకు: 0167-02 మలహరి సం: 02-323 శరణాగతి

పల్లవి: అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని
యెనలేని గుణాలు యేమిచూచేనయ్యా

చ. 1: దగ్గరి కొలుతు నాతరతమ్య మెంచుకోను
సిగ్గువడ నిట్టే నిన్నుఁ జేరి పాడుదు
వొగ్గి విన్నపాలు సేతు వుబ్బునఁ జిత్త మెరఁగ
యెగ్గు లెంచితే నావల్ల నెన్ని లేవయ్యా

చ. 2: పాదాలంటి మొక్కుదును పరిశుద్ధి దలఁచను
సాదించి కొలువవత్తు సత్వ చూడను
యేదేసనైననా నుతింతు యెంగిలినోరని మాన
పాదుగా విచారించితే బలుమూఢుఁడనయ్యా

చ. 3: మంచముపైఁ దలపోతు మందెమేళమనియన
కంచముకూడర్పింతుఁ గాదననేర
యెంచఁగ శ్రీవేంకటేశ యిన్నిటా నీబంట నైతి
పంచలఁ జూచితే నీపాలివాఁడనయ్యా

రేకు: 0167-03 మలహరి సం: 02-324 వేంకటగానం

పల్లవి: అన్నిటా నీవే వుందునందువుగా
యిన్ని నీవు పుట్టించిన విని నీసొమ్ములే

చ. 1: నిలిచిన రూపులెల్లా నీగుళ్లుగాఁ దలఁతు
మెలఁగేటి చైతన్యము మిమ్ముగాఁ దలఁతు
యిలలోని ధ్వనులు నీపలుకులుగాఁ దలఁతు
సకల పంచభూతా లుపకరణాలుగాఁ దలఁతు

చ. 2: నారుకొన్న పంటలు నీనైవేద్యాలుగాఁ దలఁతు
నీరెల్లా నీతీర్థమని నెమ్మిఁదలఁతు
ధారుణి భోగాలు పూజాద్రవ్యాలుగాఁ దలఁతు
నేరిచిన పనులెల్లా నీలీలలుగాఁ దలఁతును

చ. 3: కాలత్రయము నీగతులుగానే తలఁతు
చాలి సురల నీయనుచరులఁగానే తలఁతు
నాలోని శ్రీవేంకటేశ నాతండ్రివని తలఁతు
తాలిమి నీదేవులను తల్లియని తలఁతును

రేకు: 0167-04 మలహరి సం: 02-325 వేంకటగానం

పల్లవి: అందుకేపో నీపై నాసపుట్టి కొలిచేది
మందలించితి నిఁక మరి నీచిత్తము

చ. 1: యిందరుఁ జెప్పఁగా వింటి యెవ్వరికైనా విష్ణుఁడే
కందువ మోక్ష మియ్యఁ గర్త యనఁగా
ముందే వింటి నారదుఁడు ముంచి నిన్నుఁ బాడఁగా
పొందుగ లోకములోనఁ బూజ్యుఁడాయననుఁచు

చ. 2: అప్పటి వింటి లోకములన్నిటికి హరియే
కప్పి రక్షకత్వానకుఁ గర్త యనఁగా
యిప్పుడే వింటి ధ్రువుఁడు యిటు నిన్ను నుతించే
వుప్పతిల్లి పట్ట మేలుచున్నాఁడనుచును

చ. 3: యిదె వింటి శ్రీవేంకటేశ బ్రహ్మకుఁ దండ్రివై
కదిసి పుట్టించఁ బెంచఁ గర్త వనుచు
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలోఁ బ్రసిద్ధుఁ డాయననుచు

రేకు: 0167-05 భూపాళం సం: 02-326 నామ సంకీర్తన

పల్లవి: అపరాధిని నేనైనాను
కృపగలవారికిఁ గపటములేదు

చ. 1: సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
అనాది కారణ అనంతా
జనార్దనా అచల సకల లోకేశ్వరా
నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా

చ. 2: పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవే యట యెఱిఁగించఁగదే

చ. 3: దేవోత్తమా శశిదినకరనయనా
పావనచరితా పరమాత్మా
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుఁడను బుద్ధి చెప్పఁగవలయు

రేకు: 0167-06 భూపాళం సం: 02-327 శరణాగతి

పల్లవి: చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు
యెప్పడును జింతించేనిదే పనై నేను

చ. 1: పొలసి నీరూప మెట్టు పొడచూపేవో
యెలమి నాభాగ్య మిఁక నెట్టున్నదో
అలరి నా కేబుద్ధి ఆనతిచ్చేవో
కలిగిన నీమాయ యేగతిఁ గడచేనో

చ. 2: వరుస నా కెట్లాఁ గైవసమయ్యేనో
యిరవై నాజన్మఫల మెట్టున్నదో
పరగ నామతి నెట్టు పాయకుండేవో
కరుణానిధివి నిన్నే కరణి మెప్పించేనో

చ. 3: పనివడి యెట్లా నీభక్తి యిచ్చేవో నా-
మనసు చంచల మెట్టు మట్టుపడీనో
యెనలేని నాతలఁపు యెఱిఁగి శ్రీవేంకటేశ
నను నేలితివి యెట్లా నాకోరిక చెల్లీనో