తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 166

వికీసోర్స్ నుండి

రేకు: 0166-01 నాదరామక్రియ సం: 02-317 వైష్ణవ భక్తి

పల్లవి: ప్రపన్నులకు నిది పరమాచారము
విపరీతాచారము విడువఁగవలయు

చ. 1: భగవదపచారము భాగవతాపచారముఁ
దగులక దేవతాంతరము మాని
నగధరు శరణము నమ్మి యాచార్యుని
బగివాయనిదే పరమవైష్ణవము

చ. 2: దురహంకారము దుఃఖము సుఖమునుఁ
బొరయక ప్రాకృతులపొంతఁ బోవక
దరిశనాభిమానాన ధర్మము వదలక
పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము

చ. 3: ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి
యెపుడూఁ దీర్థప్రసాదేచ్ఛ తోడ
నిపుణత శ్రీవేంకటనిలయుఁడే గతియని
ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము

రేకు: 0166-02 రామక్రియ సం: 02-318 అధ్యాత్మ

పల్లవి: జతనము జతనము సర్వేశు నగరిది
బతుకుఁదోవ యిదె బడకరము

చ. 1: హృదయములోపల నీశ్వరుఁడున్నాఁడు
పదిలము మనసా బడకరము
తుద నల కామాదులఁ జొర నియ్యక
పదరక కావుము బడకరము

చ. 2: యెంచుకొనీనిదే యేలిక మిము నిఁక
పంచభూతములాల బడకరము
మించిన పురి తొమ్మిదివాకిళ్లను
పంచుక వున్నారు బడకరము

చ. 3: నడుమ నడుమఁ బ్రాణములాలా మీరు
బడివాయకుండరో బడకరము
యెడయక శ్రీవేంకటేశ్వరునకు మీరు
బడలక కొలువరో బడకరము

రేకు: 0166-03 భైరవి సం: 02-319 వేంకటగానం

పల్లవి: ఆతఁడే విష్ణుం డఖిలము నడపెడి
యీతల నెవ్వరి కేఁటికిఁ జింతా

చ. 1: పుట్టించఁ బెంచఁగ పొడవెక్కించ దేహుల
గట్టిగా మాఁటలాడించఁ గదలించ
పట్టి వాన గురియించ పైరులు మొలపించ
తిట్ట పెట్ట నొకానొకదేవుఁడు గలఁడు

చ. 2: అన్నపానము లొఁగ నాపదలు గడపఁగ
పన్ని మాయలు భువిఁ బచరించ
విన్నపాలు సురలవి విని యందరి రక్షింప
వున్నతోన్నతుఁడై వొకానొకకర్త గలఁడు

చ. 3: కాల మక్షయము సేయ కర్మము ఫలించఁజేయ
తాళుకొని మరపించఁ దలఁపించ
పాలుపడి శ్రీవేంకటపతియై వేదాలుచెప్పే-
యేలిక యొకానొక యీశ్వరుఁడు గలఁడు

రేకు: 0166-04 భైరవి సం: 02-320 శరణాగతి

పల్లవి: హరి హరి జగమెఱుంగ నీవాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు

చ. 1: వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు

చ. 2: వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు

చ. 3: పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు

రేకు: 0166-05 భైరవి సం: 02-321 దశావతారములు

పల్లవి: అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు

చ. 1: పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి
కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి
అరసి ద్రౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి
శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి

చ. 2: మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి
అనాథనాథుడవు నీ వగుట గ్రీవునందుఁ గంటిమి
పెనఁగి నిరుహేతుకప్రేమ పరీక్షితునందుఁ గంటిమి
నినుఁ గింకరాధీనుఁడని ప్రహ్లాదునియందేఁ గంటిమి

చ. 3: గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి
భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి
దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట
తావైన నీకొనేటిదండ నొసఁగేయందే కంటిమి