Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 165

వికీసోర్స్ నుండి

రేకు: 0165-01 శ్రీరాగం సం: 02-312 శరణాగతి

పల్లవి: చెప్పితేఁ బాసునందురు చేసిన దోసములెల్లా
వొప్పుగొని మన్నించ నుచితమౌ నీకు

చ. 1: క్షమియించుకొనవే సర్వాపరాధములు
క్రమ మెఱఁగ కేమేమి గావించితినో
రమణతో సర్వలోకరక్షకుఁడవట నీవు
తమితోడ నన్నుఁ గావఁ దగవౌను నీకు

చ. 2: పరిహరించఁగదవే బహునరకబాధలు
గరిమల నెటువలెఁ గాచుకున్నవో
అరుదుగా సురల మొరాలించితివట తొల్లి
ధర నన్ను వహించుకోఁ దగవౌను నీకు

చ. 3: వెనుకొని యడ్డము రావే శ్రీవేంకటేశ్వర
అనుభవించే కర్మము లవేమున్నవో
పనివడి భక్తపరిపాలకుఁడవట నీకు
తనుభోగాలు భోగించఁ దగవౌను నీవు

రేకు: 0165-02 నాదరామక్రియ సం: 02-313 శరణాగతి

పల్లవి: అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూర్ణుఁడు
చతురుఁడితఁడే రక్షించఁగలవాఁడు శరణని బ్రదుకవో వో మనసా

చ. 1: మరుతండ్రిఁ జూచిన మంచికన్నులను మరొకరిఁ జూచిన నింపౌనా
సిరువరు నామమునొడిగిన నోరను చిక్కిన పేరులు యితవౌనా
పరమాత్ముఁ దలచిన మనసులోపలను పరులఁ దలఁచితే నొడంబడునా
కరుణానిధి పుణ్యకథలువినిన చెవుల కడలసుద్దులు విన సమ్మతించునా

చ. 2: నరహరిఁ బూజించినయట్టి కరములు నరుల సేవసేయ నరుహములా
మురహరు శరణని మొక్కిన శిరసున మూఢులకు మొక్క నుచితములా
హరిమందిరమున కరిగెడు పదములు అధములిండ్ల కేఁగఁగ నలవడునా
పురుషోత్తము లాంఛనము మోచిన మేను భువి హీనవృత్తికిఁ బొసఁగీనా

చ. 3: గోవిందుఁడే దిక్కై వుండు ఘనులకు కొలిపీనా దేవతాంతరంబులు
భూవల్లభుదెసఁ బుట్టిన జ్ఞానము పొంది వేరొకట నిలిచీనా
శ్రీవేంకటపతిపై నిడిన భక్తి చెలులపై నునుపఁగఁ దగవవునా
దేవకినందనుఁ డితనిదాసులఁ దెలియఁగ జడులకుఁ దరమయ్యీనా

రేకు: 0165-03 నాదరామక్రియ సం: 02-314 వేంకటగానం

పల్లవి: ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినాఁ దానే
యెదిటి బ్రహ్మాండము యిమ్ము చాల దిందకు

చ. 1: పనిగొంటే భువిలో నేఁబదియే అక్షరములు
కొనాడితే నీగుణాలు కోటానఁగోటి
యెనసి పదునాలుగే యెడమైన లోకములు
అనిశము నీవియైతే ననంతమహిమలు

చ. 2: మించి నిండుకొంటే నెనిమిదియే దిక్కులు
అంచల నీకతలైతే ననేకములు
యెంచి చూచితేఁ గలవి పంచమహాభూతాలే
ముంచిన నీమాయ తుదమొదలే లేదు

చ. 3: వుపమించి తెలిసితే నొక్కటే జగము
అపురూపపు నీసృష్టి అతిఘనము
అపరిమితపు జీవు లణువత్రులైనాను
యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు

రేకు: 0165-04 నాదరామక్రియ సం: 02-315 దశావతారములు

పల్లవి: ఎంతకత నడిపితి వే‌మి జోలిఁ బెట్టితివి
చింతించ లోకములు నీచేతివే కావా

చ. 1: కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల
నేరచి సారథ్యము నెఱపనేలా
కోరి భూభార మణఁచేకొరకై తే నీచే చక్ర-
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా

చ. 2: చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల
జోకతో లంకాపురి చుట్టుకోనేల
కాకాసురు వేసిన కసవే రావణుమీఁద-
నాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయఁడా

చ. 3: గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల
చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక
తక్కించి నీవెడసితే తానే పొలియఁడా

రేకు: 0165-05 నాదరామక్రియ సం: 02-316 వేంకటగానం

పల్లవి: పరులకైతే నిదే పాపము గాదా
పురిగొని నీవంకఁ బుణ్యమాయఁ గాక

చ. 1: పరమపురుష నీవు పట్టినదే ధర్మము
అరసి నీవు చెల్లించినదే సత్యము
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించఁగ
దొరసి ప్రహ్లాదునకు దోడైనదే గురుతు

చ. 2: నారాయణుఁడ నీవు నడిపినదే తగవు
ఆరూఢి నీ వౌన్ననదే ఆచారము
సారెకుఁ దమయన్నతో చండిపడి పెనగఁగ
కోరి సుగ్రీవు వహించుకొన్నదే గురుతు

చ. 3: శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి
చేవతో నీ వొడఁబరచినదే మాట
కావించి తాతతోఁ బోరఁగా నీవు చక్రమెత్తి
ఆవేళ నడ్డమైనందుకు అర్జునుఁడే గురుతు