తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 164

వికీసోర్స్ నుండి

రేకు: 0164-01 ముఖారి సం: 02-306 శరణాగతి

పల్లవి: ఎవ్వరికి యెవ్వ రయ్యేరు యిందరికి నీవే దిక్కు
అవ్వలనివ్వల నీ వనాథనాథుఁడవు

చ. 1: కాయకము లందురునుఁ గార్యవశపరులే
పాయని నీ వకారణబంధుఁడవు
దాయగాం డ్లెవ్వరినైనాఁ దప్పించుకొనేవారే
బాయటనున్నా నీవాపన్నశరణ్యుఁడవు

చ. 2: అట్టె లోకమువారు అర్థకామపరులే
జట్టిగొని నీవైతే సర్వదాతవు
పొట్టఁబొరుగుచుట్టాలు భోజనసహాయులే
నెట్టన నీవైతే మాకు నిర్వాహకుఁడవు

చ. 3: అంతటా వారికివారు ఆత్మపోషకులే
రంతుల నీవైతే నానారక్షకుఁడవు
సంతతము శ్రీవేంకటేశా మమ్ము నేలితివి
పంతమున నీవు భక్తపరిపాలకుఁడవు

రేకు: 0164-02 ముఖారి సం: 02-307 గురు వందన, నృసింహ

పల్లవి: దేవ నీవు గల్పించిన తెరువు లివి
నీవారైన వారి నేరుపులివి

చ. 1: పరమశాంతునకుఁ బాపము రాదు
విరతిగలవానికి వెరపు లేదు
గురుసేవారతునకుఁ గోపము రాదు
ధర సత్యవిదునకుఁ దప్పు లేదు

చ. 2: పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు
అట్టె ఆసలేనివారికి అలపు లేదు
తొట్టిన సుజ్ఞానికి దుఃఖములేదు
గట్టియైన మౌనికి కలహమే లేదు

చ. 3: సమచిత్తునకును చంచలము గాదు
విమలాచారునకు వెలితి లేదు
నెమకి శ్రీవేంకటేశ నీదాసులై కొల్చి
భ్రమయనివారికి భారము లేదు

రేకు: 0164-03 శ్రీరాగం సం: 02-308 దశావతారములు

పల్లవి: వారివారి కర్మములే వారిఁ జుట్టుకొనఁగాను
యీరీతి నీవే వారియెఱుక మాల్పితివి

చ. 1: హిరణ్యకశిపుపాటు యెఱుఁగఁడా రావణుఁడు
ధరలో హరికిఁ బగై తానూఁ బొలిసె
విరసపు కంసుగతి వినఁడా దుర్యోధనుఁడు
సరుగఁ దానూఁ బగై సమసినాఁడు

చ. 2: తెగి మురాసురుజాడ తెలియఁడా నరకుఁడు
మొగిసి పోటుకుఁ బోయి మొక్కపోయను
సొగిసి సోముకుదెస చూడరా దానవులెల్లా
మగిడి మగడి పోరి మడిసిరి గాక

చ. 3: బలివోయిన తెరువు బాణుఁడు విచారించఁడా
బలిమిఁ దొడరి భంగపడెఁ గాక
యెలమి శ్రీవేంకటేశా యెవ్వరి నేమనవచ్చు
యెలమి నిప్పటివార నెఱఁగరే కాక

రేకు: 0164-04 శ్రీరాగం సం: 02-309 శరణాగతి

పల్లవి: హరి నీదాసులభాగ్య మిది యెంతని చెప్పేము
విరివైన నీసుద్దులు వింటిమయ్యా

చ. 1: నెమ్మదిని నీవనేటి నిధానము గన్నవారు
కిమ్ముల సంపన్నుల సుఖింతురయ్యా
కమ్మటి నీభక్తియనే కామధేను వున్నవారు
వుమ్మడి నచ్చికము లేకుందరయ్యా

చ. 2: చేరి నీపై చింతయనే చింతామణిగలవారు
కోరినట్టల్లా బదుకుదురయ్యా
సారపు నీకృపాపారిజాత మబ్బినవారు
బోరన సంతోసాలఁ బొదలుదురయ్యా

చ. 3: హత్తి నీనామమనే అమృతముగలవారు
నిత్తెమైన పదవుల నిలుతురయ్యా
యిత్తల శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సత్తుగా నీవారు నాకుఁ జనవిత్తురయ్యా

రేకు: 0164-05 శ్రీరాగం సం: 02-310 అధ్యాత్మ

పల్లవి: దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక
యీవలానావలా మఱి యెంచ నేమున్నది

చ. 1: పుట్టినవారికెల్లా పొత్తుల దీజగము
మెట్టికూచుండే యరఁగు మేదినియల్లా
బట్టబయటి భోగాలు బంతికూటిబోజనాలు
పట్టి తమపని యేరుపరచ నేమున్నది

చ. 2: పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు
పంచేంద్రియములే పరివారాలు
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి
తెంచి యెచ్చుకుందు లిందుఁ దెలుప నేమున్నది

చ. 3: మనోవికారాలు మానుషపు టెఱుకలు
వినోదమాత్రాలు వేడుకలెల్లా
యెనలేని శ్రీవేంకటేశ నీమహిమ లివి
వెనకా ముందరా విన్నవించ నేమున్నది

రేకు: 0164-06 శ్రీరాగం సం: 02-311 శరణాగతి

పల్లవి: ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివోకాక
అట్టి నీదయ దలఁచి అరుదయ్యీ నాకు

చ. 1: యేమేమి చదువవలె నెందరి నడుగవలె
ఆముక నిన్నుఁ దెలిసే యందుకొరకు
భూమిలోన నెంతేసి పుణ్యములు సేయవలె
కామించి నీపై భక్తి గలిగేటికొరకు

చ. 2: యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె
కన్నుల నీసాకారము గనేకొరకు
వున్నతి నెంతగాలము వొగ్గి కాచుకుండవలె
విన్నవించి నీసేవ వేఁడుకొనేకొరకు

చ. 3: యేదేది యెఱఁగవలె యెట్లభ్యసించవలె
నీదాసుఁ డనిపించుకొనేటికొరకు
సాదరాన శ్రీవేంకటేశ్వర నన్ను మన్నించితి-
వేదెసఁ బొగడవలె యింత సేసేకొరకు