తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 161

వికీసోర్స్ నుండి

రేకు: 0161-01 లలిత సం: 02-293 గురు వందన, నృసింహ

పల్లవి: ఎట్టిదో మీమాయావిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు
అట్టె మాగురు ననుమతినే ప్రత్యక్షమవై తివిగాని

చ. 1: కరుణాకరా మిమ్మునుఁ గని తెలియఁగలేను
ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును
నరహరి నీవు నాలో నుండఁగ నమ్మక పురాణకథలందు
అరయఁగ మీచరితలుచెప్పఁగ నాసతోడ మిముఁ దలంతును

చ. 2: జగదీశా మీనామంబులు జపించ నలయుదును
వెగటుగ నీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను
నగధర మీపై భక్తి సేయఁగ మనంబున వొడఁబడను
పగటున మీరిచ్చు వరములకొరకే పలుమారు మీకుమొక్కుకొందును

చ. 3: శ్రీవేంకటేశా నీమూరితి చింతించి చేపట్టఁగలేను
దేవుఁడ వనియెడు విశ్వాసమునకే తిరముగఁ గొలిచెదను
శ్రీవనితాధిపవేదాలు మిమ్మునుఁ జెప్పఁగానే తర్కింపుదును
వేవేలు పరుషలు సేవింపఁగ నీవే కర్తవని నిశ్చయింతును

రేకు: 0161-02 లలిత సం: 02-294 వైరాగ్య చింత

పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును
అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ

చ. 1: కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే
గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా
సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే
పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా

చ. 2: రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే
అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా
ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే
మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా

చ. 3: యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే
తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా
చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే
అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త

రేకు: 0161-03 లలిత సం: 02-295 శరణాగతి

పల్లవి: అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు
వివరింపఁగ నీవే గతి విష్ణుఁడ మన్నించఁగదే

చ. 1: నాకునాకే నీసన్నిధానము గల్పించుకొని
చేకొని విన్నపములెల్లాఁ జేయుచున్నాఁడను
కాకుసేసి నన్ను వీఁ డెంత గట్టువాయ యనక
శ్రీకాంతా నీ వింతట నుందువు చిత్తగించి వినవే

చ. 2: చూచిచూచి నీమూరితి నాసొమ్ముగఁ జేసుకొని
చేచేత నాలో ధాన్యము సేయుచున్నాఁడను
కాచుకొని వీనికి నాకూఁ గారణ మేమనక
యేచోటా నీరూపమే హరి యెదలోనుండఁ గదే

చ. 3: కోరికోరి నేనూరక నీకొలువు గడించుకొని
చేరి నీవూడిగములు సేయుచున్నాఁడను
యీరీతులు శ్రీవేంకటేశ్వర యివి యేఁటిసలిగె లనక
నారాయణ సర్వేశ్వరుఁడవు నన్ను నేలఁ గదవే

రేకు: 0161-04 లలిత సం: 02-296 శరణాగతి

పల్లవి: ఎట్టు సేయఁగలవాఁడవో యిఁక నీచేతిది నావునికి
నెట్టన నీదాఁసుడనై తిని నీచిత్తం బిఁకను

చ. 1: సారెకుఁ గొలువు‌సేతు చనవులు నీ విత్తువో యనుచు
నేరకున్నాఁ బాడుదును నీవు మెత్తువనుచు
వోరిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువో యనుచు
చేరి వాకిలి గాచుకుండుదు చిత్తము రావలెననుచు

చ. 2: కమ్మటి నిచ్చకములు నెరపుదు కైవసము గావలె ననుచు
వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదు వనుచు
నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కాతువని
నమ్మి నిన్ను నేఁ బూజింతు నను నీ వీడేరింతువని

చ. 3: ఆసతో నిను భావింతు అన్నిట నన్నేలుదు వనుచు
వేసరక నీమంత్రము నడుగుదు వేగమే వరమొసఁగుదు వనుచు
రాసికి నెక్కఁగ శ్రీవేంకటేశా రక్షించితి విప్పుడు నన్ను
వాసితోడ నే నిన్నుఁ దగులుదును వదలక నాపాలఁ గలవనుచు