Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 162

వికీసోర్స్ నుండి

రేకు: 0162-01 గౌళ సం: 02-297 దశావతారములు

పల్లవి: ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను
తటుకన నీకీరితి వొగడుదురు తలకొని యిందరును

చ. 1: సురాసురగంధర్వయక్షులు మిమ్ముఁ దెలియఁగలేరు
పరాశరాదులు మీరూపు భావించఁగలేరు
నరు లెరుఁగుదురా మిమ్ము నారాయణ నీవే సులభఁడవై
కరీంద్రుఁ గాచినయటువలెఁ గాతువు గాక

చ. 2: సనాతనబహువేదశాస్త్రంబులు మిమ్ముఁ నుతింపలేవు
అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించఁగలేవు
తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను
వినోదముగఁ గాచినయటువలె వెసఁ గాతువు గాక

చ. 3: రమాసతి నీళామహిరామలు మీతలఁ పెఱంగరు
సమేతులైన శేషాదులు మీజాడ మీరలేరు
తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంకటేశ
నమోనమో యని మొక్కంగాఁ ననుఁగాతువు గాక

రేకు: 0162-02 సామంతం సం: 02-298 వేంకటగానం

పల్లవి: సరిగాఁడు వీఁడనవలదు జగమున రాజు వలసినది దేవులు
యిరవుగ నందరు లోకములోపల యిది నానుడిమాట

చ. 1: జగదేకబంధుఁడవట సకలజీవులకును గుఱుతుగ
మొగము చూపవయ్యా మీకు మొక్కెద నిదె నేను
తగులైన చుట్టరికము దాఁచఁగ నిఁకనేలా
తెగరాని మమకారము తెలుపఁగవలెఁ గాని

చ. 2: యితవైన ప్రాణమవట యీచరాచరములకు అభయము
సతత మియ్యవయ్యా మాకును సన్నుతింతు నిన్ను
మతిఁ బాయని కూటంబులు మానుప మరి యాలా
జతనంబునఁ జాలాఁ బ్రియములు జరపఁగవలెఁ గాని

చ. 3: నెలవైన యేలికెవట నీదాసులకెల్లా వేళలు
దెలియఁజెప్పవయ్యా మిమ్మును తిరముగఁ గొలిచెదను
బలువయిన శ్రీవేంకటేశ పరాకు లిఁకనేలా
చెలరేఁగి నీసులభత్వమే చెల్లించవలెఁ గాని

రేకు: 0162-03 సామంతం సం: 02-299 వైష్ణవ భక్తి

పల్లవి: ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు
పదరఁగఁ దగదు నీకు పంతములిచ్చితిఁ గావఁ గదే

చ. 1: మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు
ననుఁ జూచి 'దేహి' యంటే 'నాస్తి' యనరాదు నీకు
ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు

చ. 2: వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మాయింటికి
వదలఁదగదు నీభక్తి యొసఁగు నీవాఁడను పాయకుమనుచు
పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు
యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు

చ. 3: మురిగి నీముద్రలు మోచితిని మన్నించితివిటు నను నీవు
కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు
యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు
నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు

రేకు: 0162-04 సామంతం సం: 02-300 వైరాగ్య చింత

పల్లవి: ఏది గతి నే నొక్కఁడనే యెందరి కోపుదును
నీదయతో మన్నించఁగదవే నీరజనాభా

చ. 1: మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది
దేహాభిమానము అందుకుఁ దోడు దీకొనివచ్చీని
సాహసభూతము ఘనహింసలకే చాఁపించీఁ జేయి
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని

చ. 2: కోపాగ్నికణములు సారెకుఁ జుట్టుక గుబ్బతిలఁ దొడఁగె
పైపై వయోవికారంబులు చలపట్టుక తిరిగీని
చాపల గర్వము యెవ్వరినైన సాధింపించీని
తీపుల ధనములు మీఁదిమీఁదనే తీదీపులు రేఁచీని

చ. 3: భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని
వేవేలు సంపద లెందుచూచినా వేడుకసేసీని
శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొను దేవుఁడా
యీవేళను నన్నేలితివి నిన్నియు తగ వసమయ్యీని