తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 160
రేకు: 0160-01 భైరవి సం: 02-287 భక్తి
పల్లవి: ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది
రవ్వ సేయక జీవుల రక్షించవయ్యా
చ. 1: తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను
యెలమి నింతని నిశ్చయింపలేరు
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు
కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు
చ. 2: పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు
యెదుట నీశ్రీమూర్తి యెఱఁగలేరు
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా
పదిలపు నీభ క్తి పట్టఁగలేరు
చ. 3: నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మెుక్కుదురుగాని
మక్కువ నీమహిమ నమ్మఁగలేరు
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత
తక్కక నిన్ను సేవించి తనియలేరు
రేకు: 0160-02 మాళవిగౌళ సం: 02-288 వైరాగ్య చింత
పల్లవి: ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే
పన్ని యీతనిఁ దెలిసి బ్రదుకుటే జ్ఞానము
చ. 1: మనసునఁ బుట్టిన మంకుఁ గామక్రోధాలు
పనిలేవు తనకంటేఁ బాప మంటదు
పనివి తొడమ నూడి పండు తీఁగె నంటదు
జనులకెల్లాఁ బ్రకృతిసహజ మింతే
చ. 2: చేతులారఁ జేసేటి చేకొన్న కర్మానకు
ఘాతలఁ గర్తఁ గానంటే కట్టువడఁడు
ఆతల నబక ముంచినట్టి వేఁడి చెయ్యంటదు
జాతి దేహము మోఁచిన సహజ మింతే
చ. 3: వాకున నాడినయట్టి వట్టి పల్లదాలనెల్లా
దాకొని పొరయనంటే తప్పులే లేవు
పైకొని శ్రీవేంకటేశుబంటుకు వళకు లేదు
సైకమైన హరిభక్తి సహజ మింతే
రేకు: 0160-03 సాళంగనాట సం: 02-289 నృసింహ
పల్లవి: జయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద
చ. 1: మిహిరశశినయన మృగనరవేష
బహిరంతస్స్థలపరిపూర్ణ
అహినాయకసింహాసనరాజిత
బహుళగుణగుణ ప్రహ్లాదవరద
చ. 2: చటులపరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌనిప్రణుత
కుటిలదైత్యతతికుక్షివిదారణ
పటువజ్రనఖ ప్రహ్లాదవరద
చ. 3: శ్రీవనితాసంశ్రిత వామాంక
భావజకోటిప్రతిమాన
శ్రీవేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద
రేకు: 0160-04 సామంతం సం: 02-290 అధ్యాత్మ శృంగారము
పల్లవి: ఎంత వలచితివయ్యా యింతికి
చెంతనుంటే లేఁతనవ్వే నేసపాలుగావా
చ. 1: చెలి నీపైఁ జిగురాకు చిదిమివేసితేను
వలరాజడిదమని వంచించితివి
వెలయఁగ విరహపువేళ వాఁడెక్కుఁగాక
మెలుపునఁ గదిసితే మెత్తనేకాదా
చ. 2: బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపైఁ జల్లితేను
వసంతుని చొక్కనుచు వసివాడేవు
వెసఁ దెరమరఁగైతే వేగమే నామెక్కుఁగాక
రసికత నొద్దనుంటే రజమే కాదా
చ. 3: అలమేలుమంగ సురటట్టే నీపై విసరితే
మలయానిలు వేఁడంటా మాటువెట్టేవు
తలఁచి శ్రీవేంకటేశ దవ్వైతే వేఁడెక్కుఁగాక
చలపట్టి కూడితివి చల్లనేకాదా
రేకు: 0160-05 శ్రీరాగం సం: 02-291 అధ్యాత్మ శృంగారము
పల్లవి: ఎంతలేదు నీబత్తి యెరఁగరా యిందరును
దొంతిఁబెట్టేవు ప్రియాలు దొరకుదాఁకాను
చ. 1: పొరుగాపెపై వలపు పూనేవు నామీఁద
వరుసల వద్ది కాపె వచ్చుదాఁకాను
సరుస నావంక నీవు చక్కఁ జూచే వప్పటిని
అరసి యవ్వలిపొందు అదనౌదాఁకాను
చ. 2: కడవారిపొందు నాతోఁ గసి వుచ్చుకొనే విట్టే
అడరి వారితో మాఁట లందుదాఁకాను
నడుమ నవ్వులెల్లాను నవ్వేవు యీవేళను
వుడివోనియట్టి కాఁగి లొనరుదాఁకాను
చ. 3: పోరచి వనితమారు పొదిగేవు నన్ను నిట్టే
చేరి యాపె నిన్నుఁ గూడి చెలఁగుదాఁకా
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కోరికె లన్నియునుఁ జేకూరుదాఁకాను
రేకు: 0160-06 శుద్ధవసంతం సం: 02-292 అధ్యాత్మ
పల్లవి: ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు
జవళి నెంచిచూచితే సరిబేసివంటివి
చ. 1: అంగనల చూపులు ఆరతులవంటివి
కుంగక నీవు కొలువై కూచున్న వేళ
చెంగట లేఁతనవ్వులు సేసపాలవంటివి
కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ
చ. 2: కాంతల పలుకులెల్లా కప్పురాలవంటివి
అంతలో నీవు సరసాలాడేటివేళ
బంతిమోవుల యీవులు పాలకూళ్లవంటివి
మంతనాననుండి నీవు మన్నించేవేళను
చ. 3: వెలఁదుల కాఁగిళ్లు విడిదిండ్లవంటివి
చలముల నీ రతులు సలిపేవేళ
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తలఁపులవంటివన్నీ తమకపువేళను