తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 159

వికీసోర్స్ నుండి

రేకు: 0159-01 రామక్రియ సం: 02-282 శరణాగతి

పల్లవి: నెట్టన శ్రీసతిమగనికి శరణు
దిట్టయై సర్వేశుఁడైన దేవునికి శరణు

చ. 1: చెలఁగి జగత్తులకు జీవులకుఁ బ్రాణమై
నెలవై వుండేయాతనికి శరణు
తెలివై మఱపై దేహాలలో సూత్రమై
వలనై రక్షించేయట్టివానికి శరణు

చ. 2: చక్కఁగా వేదములకు సకలశాస్త్రములకు
నెక్కొని గుఱుతైనవానికి శరణు
దిక్కుదెసయి స్వతంత్రుఁడయి తేరిన ఆదిమూలమై
అక్కజపు మహిమల యాతనికి శరణు

చ. 3: యిరవుగఁ గరుణించి యిహపరాలొసగేటి-
నిరతి శ్రీవేంకటేశునికి శరణు
గురువై తల్లిదండ్రియై గుణము సుజ్ఞానము-
లెరవులేక యిచ్చేటి యీతనికి శరణు

రేకు: 0159-02 మాళవి సం: 02-283 దశావతారములు

పల్లవి: పురుషులకు పురుషుఁడవు పురుషోత్తమా
పురుఁడు లే దిఁక నీకుఁ బురుషోత్తమా

చ. 1: పొలసులాడకు నీవు పురుషోత్తమా
బులిసి లోఁగఁగనేల పురుషోత్తమా
పొలమురాజవు నీవు పురుషోత్తమా నీ
పొలఁకు వదే కంబమునఁ బురుషోత్తమా

చ. 2: పొడవులకుఁ బొడవైన పురుషోత్తమా బిరుదు
పుడిసిళ్లఁ జల్లితివి పురుషోత్తమా
పుడికి సతిఁ గైకొంటి పురుషోత్తమా
పొడమెఁ జీఁకటితప్పు పురుషోత్తమా

చ. 3: బూటకపుబుద్ధిగల పురుషోత్తమా
పోటి గుఱ్ఱపుఁ బసల పురుషోత్తమా
మేటి శ్రీవేంకటముమీఁద నొసఁగే విదివో
పూటవూఁటవరాలు పురుషోత్తమా

రేకు: 0159-03 సామంతం (02-261, except rAga!!) సం: 02-284 అధ్యాత్మ

పల్లవి: అన్నిటికి మూలమని హరి నెంచరు
పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు

చ. 1: ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు
అకట చక్కనివార మనుకొనేరు
సకలపుణ్యపాపాల సంది జన్మములవారు
వెకలి సంసారాలకే వేడుకపడేవారు

చ. 2: కామునియేట్ల దిగఁగారేటి దేహులు
దోమటి తమబదుకే దొడ్డదనేరు
పామిడి కోరికలకు బంట్లైనవారలు
గామిడితనాలఁ దామే కర్తలమనేరు

చ. 3: యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు
కతల వెూక్షమార్గము గంటిమనేరు
తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
మతకాన నున్నవారు మారు మలసేరు

రేకు: 0159-04 వరాళి సం: 02-285 అధ్యాత్మ శృంగారము

పల్లవి: ఏఁటి జాణతనమే యేమే నీవు
కోటియైనా యాఁటది కక్కూరితికిఁ జొచ్చునా

చ. 1: వరుసకువచ్చి యావనిత గాచుకుండఁగా
యెరవులసన్నఁ బతినేల పిల్చేవే
తెరమఱంగున నొక్కెతకు మీఁదెత్తిన మోవి
యిరవుగ నీకది యెంగిలిగాదా

చ. 2: పొందైనయాపె యింటిలో బోనము వెట్టుకుండఁగా
విందు నీవేల చెప్పేవే విభునికిని
అందాకె మనసు పెట్టినటువంటి కాఁగిలి-
కిందటనే వాఁడి మిగిలినది గాకా

చ. 3: సేసవెట్టిన మగువ చెఱఁగువట్టుకుండఁగా
ఆసతో నీవెట్టు గూడి యలరితివే
యీసరినే శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వోసరించితే బువ్వము వూరఁబొత్తుగాదా

రేకు: 0159-04 ముఖారి సం: 02-286 అధ్యాత్మ శృంగారము

పల్లవి: ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను
వంతులవాసులతోడ వలరాచపౌఁజులు

చ. 1: కుతిలాలు మాని సరిఁ గూచున్నవి చూడవే
సతి యురముమీఁదట చక్రవాకాలు
గతిగూడ గుంపుగట్టి కాఁపురము సేసీనవే
మితిమీరి శిరసుపై మేఁటితుమ్మిదలు

చ. 2: కలికితనాలతోఁడ గడు మించీఁగదవే
జలజాక్షివమోముననే చకోరములు
పలుకులలోననే పాదుకొనె నిపు డిట్టె
చెలరేఁగి మోవిమీఁద చిలుకమొత్తములు

చ. 3: తగు శ్రీవేంకటేశ్వరుదండ నిల్చీఁ జూడవే
మగువ నడపులనే మంచిహంసలు
మిగుల రతివేళను మెరసీఁ దా మిన్నిటాను
పగటుఁ గుత్తికలోన పావురములు