తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 150
రేకు: 0150-01 నాట సం: 02-229 దశావతారములు
పల్లవి: దానవారితోడి పగ ధరించరాదు మీకు
కానుకిచ్చి శరణని కప్పము లియ్యరో
చ. 1: భ్రమసి వార్ధిఁబడ్డాను పాతాళము దూరినాను
సమయింపక మానఁడు శత్రులార
రమణ భూమిచొచ్చిన బ్రహ్మచే వరముగొన్న
తమిఁ జంపక మానఁడు దై తేయులాల
చ. 2: రాసి మిన్నులో దాఁగిన రాచమూకలలోనున్న
కోసివేసీఁ దల లరి కుమతులాల
ఆసఁ ద్రికూటమెక్కినా ఆచక్రవాళమంటినా
తోసి సాధించకపోఁడు దుర్మతులాల
చ. 3: సతుల మాఁటుననున్నా సరి నెందెందు వోయినా
రతి మెట్టక మానఁడు రాకాసులాల
యితఁడు శ్రీవేంకటేశుఁ డెదురులేదితనికి
గతియని మొక్కరో వో కపటులాల
రేకు: 0150-02 సాళంగం సం: 02-230 అంత్యప్రాస
పల్లవి: భోగించఁ బుట్టిన సొమ్ము పొంచి పరానకేలోపు
శ్రీగురుఁడ నీవే దయసేతువు గాని
చ. 1: యీరెండుచేతులే యిన్ని పాపాలకు నోపు
వూరకే పుణ్యము సేయనోపవు గాని
మారుకొ నీరెండుగాళ్లే మాపుదాఁకాఁ జుట్టనోపు
యేరీతి దేవ నీగుడి కేఁగ నలసుఁ గాని
చ. 2: కన్ను లివి రెండే మిన్నుగలంతాఁ జూడనోపు
ఉన్నతి నాసాగ్రదృష్టి కోపవు గాని
అన్నిటా రెండుపెదవు లధరామృతాన కోపు
సన్నల మోక్షముత్రోవ జపించవు గాని
చ. 3: యీవీనులు రెండే విశ్వమంతా నాలించనోపు
వోవల శాస్త్రాలకైతే నోపవు గాని
శ్రీవేంకటేశ నీవే చిత్తాన జ్ఞానమిచ్చితే
భావించి జీవుఁడిన్నిటా బ్రదుకనోపుఁ గాని
రేకు: 0150-03 ముఖారి సం: 02-231 ఉపమానములు
పల్లవి: పరము నిహము పంటవండినయట్టు
యిరవుగాఁ దానే యెట్టయెదుట నున్నాఁడు
చ. 1: ముంచిన మహిమలెల్లా మూర్తివంతమైనట్టు
కాంచిన వరములు సాకారమైననట్టు
అంచు శృంగారరసాన కంగములు వచ్చినట్టు
యెంచఁగ శ్రీవేంకటేశు డెదుర నున్నాఁడు
చ. 2: చెలఁగి అకాశానకు చైతన్యము వచ్చినట్టు
అల దయాసింధువు ప్రత్యక్షమైనట్టు
మొలచి సుజ్ఞానము మోసులెత్తి వుండినట్టు
యెలమి శ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు
చ. 3: పరగ నానందము ప్రతిబింబించినయట్టు
సురలభాగ్యము పొడచూపినట్టు
వురుటై యలమేల్మంగ నురమున నించుకొని
యిరవై శ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు
రేకు: 0150-04 భైరవి సం: 02-232 అధ్యాత్మ
పల్లవి: పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు
సురలకు నరులకు చోటయి యున్నాఁడు
చ. 1: కన్నులఁ గంటానే కడు మాటలాడుతానే
తన్నుఁగానివానివలె దాఁగియున్నాఁడు
అన్నియు వింటానే అట్టే వాసన గొంటానే
వన్నెలనూనె కుంచమువలె నున్నాడు
చ. 2: తనువులు మోచియు తలఁపులు దెలిసియు
యెనసియు నెనయక యిట్లున్నాఁడు
చెనకి మాయకు మాయై జీవునికి జీవమై
మొనసి పూసలదారమువలె నున్నాఁడు
చ. 3: వేవేలు విధములై విశ్వమెల్లా నొకటై
పూవులు వాసనవలె బొంచియున్నాఁడు
భావించ నిరాకారమై పట్టితే సాకారమై
శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతై యున్నాఁడు
రేకు: 0150-05 హిందోళవసంతం సం: 02-233 భగవద్గీత కీర్తనలు
పల్లవి: మూఁడే మాటలు మూఁడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంతరహస్యము
చ. 1: జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతిసంపద యిది యెఱుఁగుటే
వేవేలువిధముల వేదాంతరహస్యము
చ. 2: తనలోని జ్ఞానము తప్పకుండాఁ దలపోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మఱవకుండుటే
వినవలసినయట్టి వేదాంతరహస్యము
చ. 3: వేడుకతో నాచార్యవిశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశ్వరుఁగొలిచి దాసుఁడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంతరహస్యము
రేకు: 0150-06 సామంతం సం: 02-234 గురు వందన, నృసింహ
పల్లవి: ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు
యెట్టయినా గురువాక్య మేమరకుఁడీ
చ. 1: కాంతఁ దలచుకొంటేనే కామోద్రేకము వుట్టు
యింతలోఁ గూడెనా యేడకేడ సూత్రము
చింతకాయతొక్కు చూచితేనే నోరూరు
యెంతకెంతదవ్వు యేడకేడ సూత్రము
చ. 2: వీనుల మంచిమాటలు వింటేనే సంతోష ముబ్బు
యేనిజము గనె నేడకేడ సూత్రము
ఆనించితే నాలుకనే ఆరురుచులుఁ దెలిసీ
యీనెపమున నేడకేడ సూత్రము
చ. 3: ముక్కుకొనఁ బ్రాణ ముండి ముందువెనుకకు వచ్చి
యెక్కడ మోచున్న దేడకేడ సూత్రము
చిక్కి శ్రీవేంకటేశుఁడు జీవుల కంతర్యామి
యిక్కు వెఱిఁగితే నీడ కిదే సూత్రము