Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 149

వికీసోర్స్ నుండి

రేకు: 0149-01 శంకరాభరణం సం: 02-223 హనుమ

పల్లవి: మతంగపర్వతమాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుఁడితఁడా

చ. 1: యీతఁడా రామునిబంటు యీతఁడా వాయుసుతుఁడు
ఆతతబలాఢ్యుఁడందు రాతఁడితఁడా
సీతను వెదకివచ్చి చెప్పిన యాతఁడితఁడా
ఘాతల లంకలోని రాక్షసవైరి యితఁడా

చ. 2: అంజనాసుతుఁ డితఁడా అక్షమర్దనుఁ డితఁడా
సంజీవనికొండ దెచ్చె సారె నితఁడా
భంజించెఁ గాలనేమిని పంతమున నితఁడా
రంజితప్రతాప కపిరాజసఖుఁ డితఁడా

చ. 3: చిరజీవి యీతఁడా జితేంద్రియుఁ డితఁడా
సురల కుపకారపుచుట్ట మీతఁడా
నిరతి శ్రీవేంకటాద్రిని విజనగరములో-
నరిది వరములిచ్చీ నందరికి నితఁడా

రేకు: 0149-02 కాంబోది సం: 02-224 శరణాగతి

పల్లవి: ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము
కామించి మీ శరణంటిఁ గమలారమణా

చ. 1: కలది యందరికైతేఁ గర్మఫలము
కెలన నాకైతే నీకృపాఫలము
అల సురలకు మథితామృతము
నెలకొన్న నాకైతే నీనామామృతము

చ. 2: సకలాత్మల బ్రదుకు సంసారమూలము
ప్రకటించ నాకైతే నీ పాదమూలము
వెకలి లోకులరతి వీథివీథిని నా-
త్రికరణరతి నీదివ్యభావవీథిని

చ. 3: రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు
సంగతి నాకు నీ భక్తజనులయందు
అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి
చెంగట నా ధ్యానము నీ శ్రీమూర్తియందు

రేకు: 0149-03 పాడి సం: 02-225 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఇహపరసాధన మీ తలఁపు
సహజజ్ఞానికి సతమీ తలఁపు

చ. 1: సిరులు ముంగిటను జిగిఁ దడఁబడఁగా
హరిని మఱువనిది యది దలఁపు
సరిఁ గాంతలెదుట సందడిగొనఁగా
తిరమయి భ్రమయనిదే తలఁపు

చ. 2: వొడలి వయోమద ముప్పతిల్లినను
అడఁచి మెలుగుట యది దలఁపు
కడఁగుచు సుఖదుఃఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలఁపు

చ. 3: మతి సంసారపుమాయ గప్పినను
అతికాంక్షఁ జొరనిదది తలఁపు
గతియై శ్రీవేంకటపతి గాచిన
సతతము నితనిశరణమే తలఁపు

రేకు: 0149-04 శంకరాభరణం సం: 02-226 రామ

పల్లవి: శరణన్న విభీషుణుఁ గరుణఁ గాచినవాఁడు
పరికింపఁ దారకబ్రహ్మమా యీరాముఁడు

చ. 1: ఆలికై విల్లువిఱిచి వాలికై యమ్మువేసిన-
వాలుమగఁటిమిగలవాఁడా వీఁడు
ఱాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి
యేలేను జటాయువును యీతఁడా రాముఁడు

చ. 2: మింటికట్లు దెగనేసి యంటి పగసాధించి
దంటరాకుమారుఁడు తా నీశూరుఁడా
బంటుగా వాయుజు నేలి నంటు సుగ్రీవుతోఁ జేసి
కంటకరావణవైరి ఘనుఁడా యీరాముఁడు

చ. 3: రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి
మైకొన్న జానకీరమణుఁ డితఁడా
యీకడ శ్రీవేంకటాద్రి నిరవై తాను నున్నాఁడు
దీకొన్న ప్రతాపపుఁ దేవుఁడా యీరాముఁడు

రేకు: 0149-05 సాళంగనాట సం: 02-227 తేరు

పల్లవి: మిన్నునేలా నొక్కటైన మేటితేరు
కన్నులపండువయిన శ్రీకాంతునితేరు

చ. 1: జలధులమీఁదను చక్కఁగా నేఁగెను తేరు
బలిమిఁ గులాద్రుల పైఁ బారెను తేరు
పెలుచు లంకముంగిట పేరెలువారెను తేరు
చెలఁగె దిగ్విజయపు శ్రీహరితేరు

చ. 2: రమణఁ గుండిననగరము చుట్టుకొన్న తేరు
తిమురుచు రుకుమిణిఁ దెచ్చిన తేరు
సమరములో జరాసంధునిఁ దోలిన తేరు
అమరుల వెనుబలమగు శౌరితేరు

చ. 3: వొట్టి సృగాలవాసుదేవుని భంగించిన తేరు
బెట్టుపౌండ్రకునిపై దాడివెట్టిన తీరు
అట్టె శ్రీవేంకటుశుఁ డలమేలుమంగఁ గూడి
పట్టమేలుచు నెక్కిన పరమాత్ము తేరు

రేకు: 0149-06 సాళంగనాట సం: 02-228 నృసింహ

పల్లవి: సింగారాల మించీ నరసింహదేవుఁడు
చెంగటనున్నాఁడు నరసింహదేవుఁడు

చ. 1: సురలు జయవెట్ట నసురలెల్ల మొరవెట్ట
సిరితో మెలఁగీ నరసింహదేవుఁడు
ధరణి వంపెట్ట బ్రతిధ్వనులు మిన్నులు ముట్ట
శిరసెత్తె నవి నరసింహదేవుఁడు

చ. 2: కాంచనదైత్యుఁడు దొరకాలువనెత్తురు వార
చించెను గోళ్ళ నరసింహదేవుఁడు
పంచలఁ బంతాలు మీరి భవనాళియేరు వార
చెంచతలఁ గోరీ నరసింహదేవుఁడు

చ. 3: బలిమి పైపైనెక్క ప్రహ్లాదుఁ డట్టె మొక్క
చిలికీఁ గరుణ నరసింహదేవుడు
అలరి శ్రీవేంకటాద్రి నహోబలముమీఁద
చెలువమే చూపీ నరసింహదేవుఁడు