Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 151

వికీసోర్స్ నుండి

రేకు: 0151-01 దేసాక్షి సం: 02-235 ఉపమానములు

పల్లవి: ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు
సంచితముగ నితని శరణంటే సర్వఫలప్రద మిందరికి

చ. 1: హరిఁ గొలువని కొలువులు మఱి యడవిఁగాసిన వెన్నెలలు
గరిమల నచ్చుతు వినని కథలు భువి గజస్నానములు
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళముల నిధానములు
మరుగురునికిఁ గాని పూవులపూజలు మగఁడులేని సింగారములు

చ. 2: వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁ గురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరనికోరికె లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁ జేయని భక్తులు చెంబుమీఁది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పైరులు

చ. 3: వావిరిఁ గేశవునొల్లని బదుకులు వరతఁ గలపు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపై లేనితలఁపులు పలు మేఘముల వికారములు
శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు

రేకు: 0151-02 గుజ్జరి సం: 02-236 భగవద్గీత కీర్తనలు

పల్లవి: త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగ బ్రయాసపడనేలా

చ. 1: తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసిన ఫలములు
తనుఁ దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగఁగ మఱి యేలా

చ. 2: హరియను రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమునఁ జదివిన పుణ్యములు
పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకఁగనేలా

చ. 3: మొదల శ్రీవేంకటపతికినిఁ జేయెత్తి మొక్కిన మాత్రములోపలనే
పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును
వదలక సాగంబులుగాఁ జేసినవాఁడే కాఁడా పలుమారు
మదిమదినుండే కాయక్లేశము మాఁటికి మాఁటికి దనకేలా

రేకు: 0151-03 ముఖారి సం: 02-237 వైష్ణవ భక్తి

పల్లవి: ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు
ఆతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము

చ. 1: యేలికెగల బంటుకు యెక్కడిది విచారము
పాలించే మగఁడుగల పడఁతి కేడ చింత
కోలుముందై తండ్రిగల కొడుకు కేది తొడుసు
యీలీల హరిదాసుని కెక్కడికోరికెలు

చ. 2: బలుదుర్గము వానికి భయ మేమిటా లేదు
కలిమిగలవానికి కడమ లేదు
యిల క్షేత్రవంతునికి నెందూ దరిద్రము లేదు
అల శ్రీపతిబంట్లకు నలమట లేదు

చ. 3: పట్టిన ముద్రుంగరపుప్రధాని కెదురు లేదు
కుట్టి చాతనికివారికిఁ గొంకు లేదు
నెట్టిన శ్రీవేంకటాద్రినిలయు సేవకులము
గుట్టుతోడ బ్రదికేము గుఱి మాకు నతఁడే

రేకు: 0151-04 గుండక్రియ సం: 02-238 అధ్యాత్మ

పల్లవి: మనసులో మర్మమై మరలఁ బారుచునుండు
పొనుఁగువడ్డ మదము పోవఁగనీదు

చ. 1: తింటేనే విషమెక్కు దిష్టముగ విషలత
కంటేనే వలపెక్కుఁ గాంతలను
అంటిముట్టి కాఁగిట నలముకొంటేఁ గనక
మంటఁ గలసిన భ్రమ మానలేదు

చ. 2: మెట్టితేనే కఱచును మెలుపుతోడుతఁ బాము
పట్టితే విడువనీదు పచ్చనిపైఁడి
దట్టమై మేన సొమ్ములు తగుటుకొంటేఁ గనక
తొట్టి వెల్లిఁ బోయినాస తొలఁగనీదు

చ. 3: ఆహారము వెట్టితేను అట్టె విడుచు భూతము
ఆహారానకుఁ బోదెక్కు నట్టే ప్రాయము
యీహల శ్రీవేంకటేశుఁ డిట్టే కరుణించితేను
సాహాయమై వచ్చుఁ దానే సత్వగుణజ్ఞానము

రేకు: 0151-05 సాళంగనాట సం: 02-239 తేరు

పల్లవి: దిక్కులు సాధించఁబూని దేవదుంధుభులు మ్రోయ
యెక్కువ శ్రీవేంకటేశుఁ డెక్కెఁ దేరు

చ. 1: పన్నిద్దరు సూరియుల బండికండ్లతేరు
సన్నుతి శేషాదిదేవాసనపుఁ దేరు
కన్నులపండుగైన గరుడధ్వజపుఁ దేరు
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు

చ. 2: మించు నానా మేఘముల మేలుకట్ల తేరు
చుంచులనక్షత్రాల కుచ్చుల తేరు
అంచెదేవతలే బొమ్మలై వుండినట్టి తేరు
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తీరు

చ. 3: అట్టె కిం దేడులోకము లంతరువులైన తేరు
నట్టనడుమను బ్రహ్మాండపు తేరు
దిట్ట యలమేల్మంగతోఁ దిరమైవుండేటి తేరు
యిట్టె శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు