తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 146

వికీసోర్స్ నుండి

రేకు: 0146-01 శంకరాభరణం సం: 02-206 శరణాగతి

పల్లవి: కలది యీమూర్తివల్ల గతి గనవలెను
యిల నిందు నమ్మకుంటే యెందు మరి లేదు

చ. 1: కంటిమా బ్రహ్మమును వేంకటపతిఁ గనినట్టు
కంటిమా అవతారాలు కతలె కాక
కంటిమా హృదయములోఁ గలిగిన దైవమును
కంటిమా వైకుంఠముకడవారైనాను

చ. 2: తెలిసీనా జ్ఞానము యీదేవుని మహిమవలె
తెలిసీనా వేదాలు సందేహమే కాక
తెలిసీనా మాయ యిది యెంత చదివినా
తెలిసీనా ముందరితెరువు వెదకితే

చ. 3: చిక్కీనా మనసు యీశ్రీవేంకటేశ్వరువలె
చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక
చిక్కీనా అనాదినుండి చిగిరించీ కాలము
చిక్కీనా పెద్దలు చెప్పే జితమైన శాంతి

రేకు: 0146-02 నాట సం: 02-207 హనుమ

పల్లవి: అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు
కందువ మతంగగిరి కాడి హనుమంతుఁడు

చ. 1: కనకకుండలాలతో కౌపీనముతోడ
జనియించినాఁడు యీ హనుమంతుఁడు
ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ
పెనుతోఁక యెత్తినాఁడు పెద్ద హనుమంతుఁడు

చ. 2: తివిరి జలధి దాఁటి దీపించి లంకయెల్లా
అవల యివల సేసె హనుమంతుఁడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుఁడు

చ. 3: తిరమైన మహిమతో దివ్యతేజముతోడ
అరసి దాసులఁ గాచీ హనుమంతుఁడు
పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు
వరములిచ్చీఁ బొడవాటి హనుమంతుఁడు

రేకు: 0146-03 సాళంగనాట సం: 02-208 రామ

పల్లవి: ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు
కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు

చ. 1: రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ-
భౌముఁడు షోడశకళాసోముఁడు
దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు
కామితఫలములిచ్చి కాచినాఁడు సురల

చ. 2: పూర్ణుఁడు నీలమేఘవర్ణుఁడు దానమున వి-
స్తీర్ణుఁడు వాహనసువర్ణుఁడు
అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు
నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ

చ. 3: వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా-
గురుఁడు దివ్యామోఘశరుఁ డితఁడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాఁడు
సరి భరతలక్షణశత్రుఘ్న సహితుఁడు

రేకు: 0146-04 శ్రీరాగం సం: 02-209 వైష్ణవ భక్తి

పల్లవి: ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు
వదలకురో హరిదాసుల మతమిది వర్ణించెద నోవివేకులాలా

చ. 1: దేవుఁడు గలఁడని మదిలోఁ దెలియుటే జన్మఫలంబు
తావుగ నాతని నెప్పుడుఁ దలఁచుటే తనభాగ్యము
శ్రీవైష్ణవధర్మము దప్పక చెలఁగుటయే వైభవము
దేవతాంతరంబులన్నియు మానినదియే సుకృతంబు

చ. 2: కామక్రోధము లుజ్జగించుటయే కల్యాణానుభవము
చేముంచి పాపము సేయక మానుటే చెప్పఁగ లాభము
నేమముతోడుత విరక్తుఁడగుటే నిర్మలానందము
వేమరు నాచార్యసేవ సేయుటే విచారింపఁగ దాఁచిన ధనము

చ. 3: ప్రకృతివికారములకుఁ జొరకుండుటే పరమమైన సాత్వికము
సకలబంధములఁ బెడఁ బాసినదే సామ్రాజ్యపదము
ప్రకటింపఁగ నలమేలుమంగకును పతియగు శ్రీవేంకటవిభుని
అకలంకుఁడై కొలిచియుండుటే యనంతమహిమాతిశయంబు

రేకు: 0146-05 కేదారగౌళ సం: 02-210 శరణాగతి

పల్లవి: ఇదియే ఉపాయ మిఁక నాకు నిందులకంటే మఱి లేదు
మది నితని దాసుఁడనై మహిమలతోఁ గడుమెఱసేఁ గాక

చ. 1: కడచితినా నాజన్మములు గక్కన మానిసినైనంతనే
విడిచితినా పాపము సేయక వేవేలుచదివినయంతనే
అడఁచితినా సంసారవారధి అఖిలదేవతలఁ గొలిచినయంతనే
బడిబడి హరినామము నుతించి నేఁ బావనమయ్యేఁ గాక

చ. 2: గెలిచితినా యీమాయను నేఁ గెరలి తపంబులు నేసినంతనే
తలఁగితినా నరకములు చొరక ధరయెల్లా నేలినంతనే
తెలిసితినా తత్త్వరహస్యము తిరముగ కులజుఁడనయినంతనే
యిలలో శ్రీపతి శరణుచొచ్చి నేనిన్నిటఁ బుణ్యుఁడనయ్యేఁ గాక

చ. 3: వదలితినా నాదుర్గుణములు వరుసతోఁ జుట్టాలు గలిగినంతనే
వెదకితినా ముక్తిమార్గమును విద్య లెఱిఁగి నేర్చినంతనే
యిదివో శ్రీవేంకటేశుఁడు నాకును యేలికయై మన్నించఁగను
పదిలముగా నాతనిసేవచేసి పరమానందుఁడనయ్యేఁ గాక