Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 147

వికీసోర్స్ నుండి

రేకు: 0147-01 సామంతం సం: 02-211 శరణాగతి

పల్లవి: ఎట్టు దోయవచ్చు విని నెంతటివారికై నాను
పట్టి నీకు శరణంటే బ్రదికింతువు గాక

చ. 1: మాలతనమువంటిది మతిఁదగులుఁ గామము
అలరి ముట్టువంటిది అంటుఁగ్రోధము
కేలి నొదిగించు నెంగిలివంటిది లోభము
వాలాయించి నెందుండై నా వచ్చును లోకులకు

చ. 2: చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము
వట్టి మాంసమువంటిది వయోమదము
పుట్టిన భ్రమవంటిది పొదిగిన మచ్చరము
వుట్టిపడి నోరూరించు నూరకే ప్రాణులను

చ. 3: గోడమఱఁగు వంటిది గుట్టుతోడి సంసారము
వీడని కట్టువంటిది వేడుకయాస
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నీదాసుల
జాడదప్పనియ్యవు యీచందము జీవులది

రేకు: 0147-02 వరాళి సం: 02-212 శరణాగతి

పల్లవి: మహినుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు
సహజివలె నుండేమీ సాధింపలేడు

చ. 1: వెదకి తలచుకొంటే విష్ణుఁడు గానవచ్చు
చెదరి మఱచితే సృష్టి చీఁకటౌ
పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితేఁ గాలము నిమిషమై తోఁచు

చ. 2: వేడుకతోఁ జదివితే వేదశాస్త్రసంపన్నుఁడౌ
జాడతో నూరకుండితే జడుఁడౌను
వోడక తపసియైతే వున్నతోన్నతుఁడౌ
కూడక సోమరియైతే గుణహీనుఁడౌను

చ. 3: మురహరుఁ గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెఱఁగకుండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుఁడు రక్షించును
పరగ సంశయించితే పాషండుఁడౌను

రేకు: 0147-03 కేదారగౌళ సం: 02-213 అధ్యాత్మ

పల్లవి: తనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహి
యెనలేక శరణంటే నితఁడే రక్షించును

చ. 1: కోరి ముదిమి మానుపుకొనే యాస మందులంటా
వూరకే చేఁదులు దిన నొడఁబడును
ఆరూఢి మంత్రసిద్ధుఁడనయ్యేననే యాసలను
ఘోరపుఁబాట్లకు గక్కున నొడఁబడును

చ. 2: యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనే యాసలను
వొట్టి జీవహింసలకు నొడఁబడును
దిట్టతనముఁ దా నదృశ్యము సాధించే యాస
జట్టిగ భూతాలఁ బూజించఁగ నొడఁబడును

చ. 3: చాపలపు సిరులకై శక్తిఁ గొలిచే యాసను
వోపి నిందలకు నెల్లా నొడఁబడును
యేపున శ్రీవేంకటేశుఁ డేలి చేపట్టినదాఁకా
ఆఁపరాని యాస నెందుకైనా నొడఁబడును

రేకు: 0147-04 ధన్నాసి సం: 02-214 ఉపమానములు

పల్లవి: దేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవే
సేవసేయకుండినా రక్షించ నీకు భారము

చ. 1: ఆడివచ్చిన బిడ్డని నపరాధిఁ జేసి తల్లి
వోడక యన్నము పెట్టకుండవచ్చునా
వేడుకకాఁడు చిల్కకు వింతమాటలెల్లా నేర్పి
ఆడినట్టే యాడితేను అదలించవచ్చునా

చ. 2: చిక్కినావు తొడుకుమేసి వచ్చేనంటా గొల్లఁడు
దుక్కక కావక పోఁదోలవచ్చునా
యెక్కే గుఱ్ఱము గోళిగె నెనసి పైకొంటే రౌతు
తక్కక దానిఁ జీకటితప్పు గొనవచ్చునా

చ. 3: పతిఁ బెండ్లాడిన యాలు పక్కనుండి నిద్రించితే
కొతికి కాలానుభాగి గొనవచ్చునా ?
తతి నేఁపనికి రాక తామసుఁడై వుండినా
గతియై శ్రీవేంకటేశ కావకుండవచ్చునా

రేకు: 0147-05 రామక్రియ సం: 02-215 శరణాగతి

పల్లవి: ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు వేసితి
తటుకన నీవనే నిధానము చేకొంటివి

చ. 1: కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు
వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై
నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య
ఆముకొని మోహించితి హరి నీరూపునకు

చ. 2: యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున
మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి
తఱిఁ జలపట్టితి నీతప్పని భ క్తియందు
వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి

చ. 3: కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి
బలు మమకారము నీపైఁ జేర్చితిఁ
యెలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి

రేకు: 0147-06 మాళవి సం: 02-216 హనుమ

పల్లవి: కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసిన వరాలిచ్చీ వాయునందనుఁడు

చ. 1: మాయాబిలము చొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగాన వచ్చిన వాయునందనుఁడు

చ. 2: కడలిదరినుండిన కపులతోఁ గూడికొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామ మెల్లాఁ జెప్పె
వడిగలవాఁడితఁడు వాయునందనుఁడు

చ. 3: రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆవిభుని సీతఁ గూర్చి అయోధ్య నుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు