Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 145

వికీసోర్స్ నుండి

రేకు: 0145-01 దేసాళం సం: 02-200 వైరాగ్య చింత

పల్లవి: భావించలే రెవ్వరును బయలువాఁకేరు గాని
నీవే గుఱుతు మాకు నీరజనాభా

చ. 1: కైవల్య మెట్టుండునో నిక్కపు జ్ఞాన మెట్టుండునో
దైవిక మెట్టుండునో తలఁచరాదు
జీవన మెట్లనుండునో చిత్త మేరీతి నుండునో
ఆవిధ మెవ్వరి కిట్టట్టనఁగరాదు

చ. 2: వేదము లెట్టుండునో విరతి యెట్టుండునో
ఆది నంత మెట్టుండునో అరయరాదు
భేదమనే దెట్టుండునో అభేదమది యెట్టుండునో
సోదించి యెవ్వరికిని చూడఁగరాదు

చ. 3: ఫల మెట్లానుండునో భ క్తి యెట్లానుండునో
తెలివి యెట్టుండునో సాధించఁగరాదు
యిలపై శ్రీవేంకటేశ యిటు నీశరణుచొచ్చి
నిలుకడై వున్నారము నీకృప యిఁకను

రేకు: 0145-02 గౌళ సం: 02-201 శరణాగతి

పల్లవి: ఒడఁబరుచుకొంటివి వుపేంద్ర నిన్ను నిపుడె
చిడిముడి నీసేవకే సెలవు చేసుకొమ్మీ

చ. 1: కన్నుల నేఁ జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే
విన్నవినుకులెల్లా విష్ణుఁడ నీకథలే
తిన్నని నామాటలెల్లా త్రివిక్రమ నీమంత్రాలే
అన్నిటా నాభావము సమర్పణము నీకును

చ. 2: అట్టె నే నడచేవెల్లా హరి నీప్రదక్షిణాలే
గుట్టున నాసేఁతలెల్లా గోవింద నీకైంకర్యాలే
ముట్టి నేభుజించినవి ముకుంద నీప్రసాదాలే
నెట్టన నాభోగమెల్లా నీవసము చేసితి

చ. 3: యిల నేఁ బండఁబడేవి యీశ్వర నీకు మొక్కులే
తలఁచే నాతలఁపెల్లా దామోదర నీధ్యానమె
నలువంక శ్రీవేంకటనాయక నీయనుజ్ఞను
నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి

రేకు: 0145-03 కన్నడగౌళ సం: 02-202

పల్లవి: నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని
వున్నవాఁడ నిఁక వేరే ఉపాయ మేమిటికి

చ. 1: గతియై రక్షింతువో కాక రక్షించవోయని
మతిలోని సంశయము మఱి విడిచి
యితరులచే ముందర నిఁక నెట్టౌదునోయని
వెతతోడఁ దలఁచేటి వెఱపెల్లా విడిచి

చ. 2: తిరమైన నీమహిమ తెలిసేవాఁడననే-
గరువముతోడి వుద్యోగము విడిచి
వెరవున నీరూప వెదకి కానలేననే-
గరిమ నలపు నాస్తికత్వమును విడిచి

చ. 3: ధ్రువమైన నాచేఁతకు తోడు దెచ్చుకొనేననే
అవల నన్యులమీఁది యాస విడిచి
వివరిం చలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ
తవిలితి నాపుణ్యమంతయు నీకు విడిచి

రేకు: 0145-04 లలిత సం: 02-203 అధ్యాత్మ

పల్లవి: భ్రమయక వుండేదే పరమార్థము
నెమకితే నన్నిటాను నీవే వుండుదువు

చ. 1: వసుధలోఁ బురుషుల వనితల రూపులు
వెస మాయయంత్రపు వెరబొమ్మలు
ముసరి యెండొంటికి మోహించే మోహములు
అసురుసురయ్యే ఇంద్రియావేశములు

చ. 2: తగిన తమలో చక్కఁదనాలు వయసులు
పగటు రక్తమాంసాల పరిపూర్ణులు
జిగి నిందుకుఁగాఁ బుట్టే చిత్తవికారములు
నిగుడుచు బయలువన్నినయట్టి వురులు

చ. 3: లలి మీరి యన్యోన్యవిలాసములు భోగములు
వలవని మొయిలులేని వానజల్లు
యెలమి శ్రీవేంకటేశ యివెల్లా నీదాసులకుఁ
దెలిపి బ్రహ్మానందము తిరముగా నిత్తువు

రేకు: 0145-05 పాడి సం: 02-204 అంత్యప్రాస

పల్లవి: దైవము తోడిదే తన తగులు
జీవుడిఁది యెఱిఁగితే చిక్కనీదు తగులు

చ. 1: కన్నులఁ జూచినంతనే కలుగునుఁ దగులు
మిన్నక మాటలాడితే మిగులాఁ దగులు
పన్నుగా నవ్వితేను పాదుకొనుఁ దగులు
యెన్నైనా నూరకుండితే నేమీ లేదు తగులు

చ. 2: వీనులొగ్గి వినఁబోతే విశ్వమెల్లాఁ దగులు
ఆనుక సహవాసాన నంటుకొనుఁ దగులు
పూని లోకుల పొందుల పొదిగొను తగులు
మోనాన నూరకుండితే మొగియదు తగులు

చ. 3: కరుణించి యేమిచ్చినా గట్టియవునుఁ దగులు
దొరతనాన మించితే తొడరును తగులు
ధరణి శ్రీవేంకటేశుఁ దలఁచి యేకాంతాన-
నిరవై వూరకుండితే నెనయదు తగులు

రేకు: 0145-06 సామంతం సం: 02-205 వైరాగ్య చింత

పల్లవి: ఇందరూ జీవులే యెంచి చూచితే-
నందులో భావము లవియే వేరు

చ. 1: అంతటఁ జూచిన యాహారనిద్రలు
జంతురాసులకు సహజములు
సంతోషంబును సాత్వికగుణమును
శాంతచిత్తులకు సహజములు

చ. 2: మనసునఁగల కామక్రోధంబులు
జననశీలులకు సహజములు
వినయంబును ఘనవిజ్ఞానము స-
జ్జనుల కెపుడును సహజములు

చ. 3: విడువని యాసలు వేవేలు చింతలు
జడులకు నం(నెం ?) దును సహజములు
బడి శ్రీవేంకటపతి కొలువుఁ దపము
జడియని దాసుల సహజములు