Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 144

వికీసోర్స్ నుండి

రేకు: 0144-01 సాళంగనాట సం: 02-194 వేంకటగానం

పల్లవి: ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచిత్తము
దీమసాన నీభావము తెలియ దెవ్వరికి

చ. 1: రవిచంద్ర గ్రహ తారకములకుఁ దెరువు
వివరించనున్నదా నీవే యాధారముగాక
పవనునికి భువికి పదునాల్గులోకముల-
కవల వేరొకచోట నాధార మున్నదా

చ. 2: తిలకింపఁ గులాచలదిగ్గజశేషాదులకు
నిలువఁ జోటున్నదా నీవే యాధారము గాక
నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు
కలది నీయాధారమే కాక వేర వున్నదా

చ. 3: అనంతబ్రహ్మాండముల కట్టే నీరూపములకు
వెనకముందున్నదా నీవే యాధారముగాక
వినుతి కెక్కిన శ్రీవేంకటేశ నీకు నీవే
మనికైన యాధారము మఱి యెంచ నున్నదా

రేకు: 0144-02 పాడి సం: 02-195 వైష్ణవ భక్తి

పల్లవి: విష్ణుఁడే యింతానని భావించుటే బుద్ధి
వైష్ణవుఁడై యాచార్యసేవ సేయుటే బుద్ధి

చ. 1: కొండవంటి తనలోని కోపము రేఁగవచ్చితే
దండనే యెచ్చరి వూరకుండుటే బుద్ధి
మెండుగా బరకాంతలమీఁది తమి వుట్టితేను
అండుకాచందుకు భ్రమయకుండుటే బుద్ధి

చ. 2: అట్టె యెవ్వరయినా గృహారామాదులపై నాస
పుట్టించితేఁ వానివెంటఁ బోనిదే బుద్ధి
చుట్టపు సమ్మంధాన సోఁకితే పరబాధలు
చుట్టుకోక లోనుగాక జునుఁగుటే బుద్ధి

చ. 3: తప్పదింతా దైవికమే తనవద్ద నున్నవారిఁ
దప్పులు పట్టనిదే తగిన బుద్ధి
యెప్పుడూ శ్రీవేంకటేశుఁ డెదలోన నున్నవాఁడు
చొప్పెత్తి యాతని మూర్తి చూచుటే బుద్ధి

రేకు: 0144-03 కన్నడగౌళ సం: 02-196 శరణాగతి

పల్లవి: సకలమైనవారికి సహజ మిది
అకటా యెట్టు గల్పించి ఆడించేవు దేవుఁడా

చ. 1: తనియ కొరుల చక్కఁదనమే చూచుఁ గాని
తనభావము తనకుఁ దలఁపు గాదు
చొనిపి యౌవ్వనపుసుద్దులే చెప్పు గాని
పొనిఁగి తనవయసు పోవుట దెలియదు

చ. 2: దారుణపాషాణబుద్ధులు దైవముపై బెట్టుఁ గాని
యీరీతినే తనదేహ మెంచుకొనఁడు
వూరిలోని మాటలెల్లా వుగ్గడించఁబోవుఁ గాని
కారణపు తన జన్మకథలు దడవఁడు

చ. 3: వేడుకతో నిక్షేపాలు వెదకఁగోరుఁ గాని
ఆడనే ఆత్మనిక్షేప మది వొల్లఁడు
వీడక శ్రీవేంకటేశ వెలయ నీదాసులకు
తోడఁదోడఁ దెలుపుచు తోడయి రక్షింతువు

రేకు: 0144-04 భైరవి సం: 02-197 గురు వందన

పల్లవి: ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను
చింతదీర నీసేవ సేయుటే కలది

చ. 1: ఉపకారముగ దేహమొసఁగితి విటు నాకు
ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది
యెపుడూ నీధర్మమున నిటు నీరుణస్థుఁడనై
ప్రపన్నుఁడనై నేను బ్రదుకుటే కలది

చ. 2: వేవేగ వెఱ్ఱి జేయక వివేకిఁ జేసితివి
యీవికి నే మారుకు మా రిచ్చే దెక్కడ నున్నది
యీవల నీకుఁ గీర్తిగా నిట్టే నీయాధీనుఁడనై
భావించి భయము లేక బ్రదుకుటే కలది

చ. 3: జడులలోఁ గూర్చక యాచార్యునిలోఁ గూర్చితివి
నడపేటి నీసరవికి నాసరివి యేమున్నది
యెడయక శ్రీవేంకటేశ నీకు బంటనై
బడివాయ కిట్లా నే బ్రదుకుటే కలది

రేకు: 0144-05 ముఖారి సం: 02-198 వైరాగ్య చింత

పల్లవి: వెలుపల వెదకితే వెస నాత్మఁ గనునా
పలుమారు నిదే యభ్యాసము గావలెను

చ. 1: యిన్ని చింతలు మఱచి యింద్రియాలఁ గుదియించి
పన్నివుండిన హృదయపద్మమందును
యెన్న నంగుష్ఠమాత్రపు టీశ్వరుపాదాల క్రింద
తన్ను నణుమాత్రముగఁ దలఁచఁగవలెను

చ. 2: పలుదేహపుఁ గాళ్లఁ బరువులు వారక
బలుదేహపు టింటిలోపల చొచ్చి
చలివేఁడిఁ బొరలక సర్వేశుపాదాల క్రింద
తలకొన్న తన్నుఁ దానె తలఁచఁగవలెను

చ. 3: కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో
చేకొని విన్నపములు చేసుకొంటాను
యేకాంతాన శ్రీవేంకటేశ్వరు పాదాల క్రింద
దాకొని తన్నుఁ దానే తలఁచఁగవలెను

రేకు: 0144-06 శ్రీరాగం సం: 02-199 వైరాగ్య చింత

పల్లవి: ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు
బంతినే వీని కెప్పుడుఁ బ్రకృతి గారణము

చ. 1: యివిగో గుణాలు మూఁడే యింద్రియాలఁ గూడుకొని
భువిఁ బ్రాణులనెల్లాను పూఁచి పనులుగొనేవి
కవిసి కర్మములై ఘనలోకాలఁ దిప్పేవి
ఆవలఁ బుట్టుగులకు నప్పటిఁ దెచ్చేవి

చ. 2: పంచభూతా లివియే పరగ జీవులకెల్లా
దించరాక యెప్పుడును దేహాలయ్యేవి
అంచెలఁ గంచములోఁ బదార్థములై వుండినవి
తెంచరాని పాశములై తీపులఁ బెట్టేవి

చ. 3: మనసొక్కటే జంతుల మర్మములు రేఁచేది
తనుభోగములలోనఁ దనివిచ్చేది
అనయము శ్రీవేంకటాధిప నీ మహి మిది
నినుఁ గొల్చిన దాసుల నెరవేర్చేది