Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 141

వికీసోర్స్ నుండి

రేకు: 0141-01 శుద్ధవసంతం సం: 02-178 రామ

పల్లవి: దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
జానకీపతిఁ గొలువుఁడీ ఘనసమరవిజయుఁడు రాముఁడు

చ. 1: హరుని తారకబ్రహ్మమంత్రమై యమరిన యర్థము రాముఁడు
సురలఁ గాచి యసురల నడఁచిన సూర్యకులజుఁడు రాముఁడు
సరయువందును ముక్తిచూరలు జనుల కొసఁగెను రాముఁడు
హరియె యీతఁడు హరివించుల కాదిపురుషుఁడు రాముఁడు

చ. 2: మునులరుషులకు నభయమొసఁగిన మూలమూరితి రాముఁడు
మనసులోపలఁ బరమయోగులు మరుగుతేజము రాముఁడు
పనిచి మీఁదటి బ్రహ్మపట్టము బంటు కొసఁగెను రాముఁడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముఁడు

చ. 3: బలిమి మించిన దైవికముతో భక్తసులభుఁడు రాముఁడు
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుఁడు రాముఁడు
మెలుపు శ్రీవేంకటగిరీంద్రముమీఁది దేవుఁడు రాముఁడు
వెలసె వావిలిపాటి లోపలి వీరవిజయుఁడు రాముఁడు

రేకు: 0141-02 బౌళి సం: 02-179 అధ్యాత్మ

పల్లవి: తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగకపోదు
సులభుఁడ వన్నిట ప్రాణనాథుఁడవు చొప్పుగ నానతి యియ్యఁ గదే

చ. 1: నీవే బలవంతుఁడవో నీకంటేఁ గర్మము బలువో
కైవసముగ నే నెంచిచూచితే కర్మముకంటె బలువుఁడవు
భూవలయంబుల ప్రారబ్ధంబులు భోగించవలెనని యంటివా
వావిరి నిట్టైతే నీదేవత్వమునకు వెలితిగదే

చ. 2: ఐనాఁగాని లోకములోపల నది నీ యాజ్ఞని తలఁచితిమా
నేను నీశరణుచొచ్చిన మీఁదట నీవే పరిహరించఁగవలదా
కానిపించు నాకిఁక నొకబుద్ధి కర్మముపై నెప మటువేసి
పూనుచుఁ గాలక్షేపంబునకై భువిని వినోదము గాఁబోలు

చ. 3: యెందాఁకా జీవులతోడుత నీ వేలాటంబులు జరపెదవు
అందరికిని నీవే తలిదండ్రివి అయి రక్షింపుచునున్నాఁడవు
కందువ దెలిసెను శ్రీవేంకటేశ్వర కర్త వెట్టు చేసిన మేలు
చందమాయ నిది దగవౌ నీకును సంతోషించితి మిటు నేము

రేకు: 0141-03 వరాళి సం: 02-180 వైరాగ్య చింత

పల్లవి: ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ
కామించి బ్రహ్మాదులనుఁ గప్పీ నీమాయ

చ. 1: బచ్చెనరూపుల పెక్కు పడెచ్చుల వేసినట్లు
నిచ్చల నినుచున్నది నీమాయ
తచ్చి వారివారిరతి తమతమకే తెలియ
పచ్చిగా భోగింపించీ దంపతుల నీమాయ

చ. 2: మఱి తొలునాటి భోగాలు మరునాటికి నింతగా
నెఱువుగాఁ దమకించీ నీమాయ
విఱచరాని దుఃఖము వెస నిద్రవోయితేనే
మఱపించి నవ్వించీ మహిలో నీమాయ

చ. 3: పట్టరాని జవ్వనము పరసిపోతే ముదిమి
నెట్టుకొల్పి వుబ్బఁడచీ నీమాయ
గట్టిగా శ్రీవేంకటేశ ఘనుఁడవైన నీదాసుల
పట్టకుండాఁ జేయుము బలిసె నీమాయ

రేకు: 0141-04 నాట సం: 02-181 వైరాగ్య చింత

పల్లవి: ఎంత కఠినమో హృదయ మిది
చెంత ఱాతఁజేసిరి గాఁబోలు

చ. 1: అమరఁ బురాణములందు నరకముల-
క్రమములు చదివియుఁ గలంగవు
యమకింకరఘోరాకృతు లటు విని
భ్రమసి యించుకా భయపడ నేను

చ. 2: మనుజుల దారుణమహితకర్మముల-
అనుభవములు గని యలయను
వొనర మహోగ్ర యహోరాత్రంబులు
చనుచుండంగా జడియను నేను

చ. 3: కలుషరౌద్రదుఃఖముల కించుకా
కలఁగను చీరికిఁ గైకొనను
యెలమిని శ్రీవేంకటేశుఁడ నాపాలఁ
గలిగి కాచితివి గాసిల నేను

రేకు: 0141-04 రామక్రియ సం: 02-182 అంత్యప్రాస

పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు
యీటువెట్టి పెద్దతనా లెంచఁ బనిలేదు

చ. 1: సరవిఁ గలకాలముఁ జదువుచుండు నొకఁడు
గరిమ నీకృప నిన్నుఁ గను నొకఁడు
ధరఁ బ్రయాసముతోడఁ దపము సేయు నొకఁడు
శరణుచొచ్చి నీకుఁ జనవరౌ నొకఁడు

చ. 2: వొక్కఁడు మోపుమోచు నొక్కఁడు గొలువుసేయు
వొక్కఁడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్కఁ డాచారము సేయు నొక్కఁడు మోక్షము గను
యెక్కడా నీకల్పన కేమి సేయవచ్చును

చ. 3: భావించనటుగాన ఫలమెల్లా నీమూలము
యేవలనైనా నీవు యిచ్చితేఁ గద్దు
జీవులు నిన్నెఱఁగక చీఁకటి దవ్వఁగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు