తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 142
రేకు: 0142-01 రామక్రియ సం: 02-183 అధ్యాత్మ
పల్లవి: అందుకల్లా లోనుగాన అట్టె యెచ్చరికెతోడ
పొందుగా హరిఁ దలఁచే పురుషుడే ఘనుఁడు
చ. 1: చలములు పుట్టించ సారె మచ్చరము రేఁచ
కలుగు నానావిధ కారణములు
తలఁపులు భ్రమయించ తగువేడ్క లొనరించ
పలుమా రెదుట నిల్చు బహురూపాలు
చ. 2: తగవులు దిద్దించ తగ నలమటఁ బెట్ట
తగులు ననేకబంధములెల్లాను
పగ సాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప
నిగిడివచ్చు ననేకనెపములెల్లాను
చ. 3: తేరకే మేనలయించ దేశమెల్లా నావటించ
వూరకే తోఁచు ననేకవుద్యోగాలు
కోరి శ్రీవేంకటేశ్వరుఁ గొలిచి నిశ్చింతుఁ డైతే
ఆరయ మతిలో నిండు నానందాలు
రేకు: 0142-02 మాళవిగౌళ సం: 02-184 వైరాగ్య చింత
పల్లవి: నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని
చ. 1: వొక్కరు నేర్పఁగవద్దు వొగి సంసారధర్మము
దిక్కై పుట్టించిన ప్రకృతియ నేర్పీని
గుక్కక జంతులు చన్నుగుడుప నేరుపవద్దు
చక్కగా ననాదివానలే నేర్పీని
చ. 2: అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు
మించి వారి తమోగుణమే కప్పీని
కొంచక భజియించుమని కోరి యచ్చరించవద్దు
పెంచిన తనఁయాకలే పిలిచి తెచ్చీని
చ. 3: అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు
యెట్టైనా తనజాతే సేయిపించీని
వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు కోనేటిదండ
పట్టి కొలిచినవారే భాగ్యవంతు లిలను
రేకు: 0142-03 శంకరాభరణం సం: 02-185 వైరాగ్య చింత
పల్లవి: అది నేనెఱగనా అంతలో భ్రమతుఁ గాక
మదనజనక నాకు మంచి బుద్ధియియ్యవే
చ. 1: యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జనసంగతి చేరిన యాదాయము
చ. 2: నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము
పూనిన పురాణగోష్ఠి పుణ్యమూలము
ఆనిన కృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టి
మానని యాచారమాత్మకుఁ బడ్డపాటు
చ. 3: పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలఁగు నాచార్యసేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు
నిలుకడయిన వాఁడవు నీవే యిన్నిటికి
రేకు: 0142-04 దేవగాంధారి సం: 02-186 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఒక్కఁడే మోక్షకర్త వొక్కటే శరణాగతి
దిక్కని హరిఁ గొల్చి బదికిరి తొంటివారు
చ. 1: నానా దేవతలున్నారు నానా లోకములున్నవి
నానా వ్రతాలున్నవి నడచేటివి
జ్ఞానికిఁ గామ్యకర్మాలు జరపి పొందేదేమి
ఆనుకొన్న వేదోక్తాలైనానాయఁ గాక
చ. 2: వొక్కండు దప్పికి ద్రావు వొక్కడు కడవ నించు
నొక్కఁ డీఁదులాడు మడుగొక్కటి యందే
చక్క జ్ఞానియైనవాఁడు సారార్థము వేదమందు
తక్కక చేకొనుఁ గాక తలకెత్తుకొనునా
చ. 3: యిది భగవద్గీతార్థమిది యర్జునునితోను
యెదుటనే వుపదేశమిచ్చెఁ గృష్ణుఁడు
వెదకి వినరో శ్రీవేంకటేశు దాసులాల
బ్రదుకుఁ ద్రోవ మనకు పాటించి చేకొనరో
రేకు: 0142-05 భైరవి సం: 02-187 అధ్యాత్మ
పల్లవి: ననుఁ జూచి హరి నీవు నవ్వకుండేవా
పనిమాలెంత బయలుపాఁకీ నామనసు
చ. 1: మనసుకు గోచరమా మాటలకు గోచరమా
కనుఁగొన వసమా నీఘనరూపము
నిను వెదకుచున్నాఁడ నీవెక్కడ నే నెక్కడ
జనుఁడ నింతె యెంత సాహసము నాది
చ. 2: వున్నచో టెఱుఁగుదునా వోయీ అంటేఁ బలికేవా
యెన్ని తెలియఁ దరమా యిట్టి నీమాయ
అన్నిటా నీకొలువుసేయఁ గడఁగుచున్నవాఁడ
యెన్నటిపొందు నీవు నాకెంత దిట్టతనమో
చ. 3: వాకిలి గానవచ్చునా వంచించి చొరవచ్చునా
రాకపోక కబ్బునా పరమపదము
శ్రీకాంతుఁడ ప్రత్యక్షమై శ్రీవేంకటాద్రి యిదె
కైకొంటి నీకృప నెంత గట్టువాయతనమో
రేకు: 0142-06 లలిత సం: 02-188 వైరాగ్య చింత
పల్లవి: ఎన్నటికి జీవుఁడిఁక నీడేరేది
పన్నుకొనేటి చింతలే బలిసీఁ గాని
చ. 1: కలరు వివేకులు కలదిటు ధర్మము
కలఁడు దైవము నేఁడు గావలెనంటే
వలవని సందేహాన వట్టిజాలిఁ బొరలేటి-
తలపోఁత లేమిటికో తడఁబడీఁ గాని
చ. 2: వున్నవి వేదశాస్త్రాలు వున్నది విశ్వాసము
వున్నవాఁ డాచార్యుఁడు వుపదేశించ
తన్నుఁ దానే మోసపోయి తత్త్వము నిశ్చయించక
మిన్నక చంచలమేలో మెరసీఁ గాని
చ. 3: యివిగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన
వివరింప వీఁడిగో శ్రీవేంకటేశుఁడు
భవములచే భ్రమసి బహుసంగతులచేత
యివల నామనసిప్పు డెఱిఁగీఁ గాని